Saturday, December 9, 2017

శైశవరోదన

నీలో నాలో పసితనముందని
నవ్వే పిల్లల అమాయకత్వం!
నచ్చే పిల్లల నవ్వుల అర్థం!
నమ్మకమంటే నమ్మినవారై
నమ్మినమనిషితో నడిచేతత్వం!
అన్న నాన్న బావ మామ
అన్నీ కలిపిన ఒకటే అర్థం
తెలిసిన కలిసిన కుటుంబధైర్యం
తమదే తమదే అనుకునే తత్వం!
అటుగా తెలియని
ఎదగని మనసుల
ఎదిగిన వయసున
ఎదుగూ బొదుగూలేని శరీరం
చదువూ గిదువూలేని సమాజభారం
కసివేస్తుంటే
మసిచేస్తుంటే
మొగ్గల్లోనే తొలిచేస్తుంటే
పువ్వులగానక బలిచేస్తుంటే
క్రిమిసంహారం చేసేదెవరని
రసాయనానికై వెదికే సంఘం
చూసి చేసే పనియే లేదని
పలాయనమై నిదరోతుందా?
జనారణ్యమే మృగమౌతుందా?

దరిద్రమంతా తమదే కాదని
దరిద్రవీరుల దారికొదిలేసి
వీధికొకణ్ణి
సోదికొకణ్ణి
వార్తలివేయని చదువుకుపోతూ
ధూర్తసమాజమని ముడుచుకుపోతూ
సమూహక్షేమం వేడిని వదిలి
స్వార్థపుదుప్పటి కప్పుకుపోతూ
చలికాలాన్ని దాటేస్తూందా?

నవ్వులపూల తోటలకోసం
పువ్వులబాలల రక్షణకోసం
విలువలకంచెల ధరిత్రికోసం
ఒక్కోదారం కట్టేవారం
మేమూ మేమని తామే తాడై
శైశవరోదన ఆపిస్తుందా?
పట్టిన చీడని పీకేస్తుందా?
అమానుషత్వం అరికడుతుందా!
పూలనిపట్టి నిలబెడుతుందా!

(చంద్ర రెంటచింతల -డిసెంబరు/9/2017 - నిర్భయ పిల్లల వార్తలు చూస్తూ)

Thursday, October 12, 2017

శ్రీరామకర్ణామృతం

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీరామకర్ణామృతం -
ముఖ్యార్థ ప్రదాత - శ్రీ VS నంజుండయ్యగారు
సీసపద్య అనువాదము - భవదీయ చంద్ర రెంటచింతల
38. శ్లోకము - 68/111
వందే సాధక వర్గ కల్పక తరుం వందే త్రిమూర్త్యాత్మకం
వందే నాద లయాంతరస్థలగతం వందే త్రివర్గాత్మకం
వందే రాగ విహీన చిత్తసులభం వందే సభానయకం
వందే పూర్ణదయామృతార్ణవ మహం వందే సదా రాఘవం!
{ముఖ్యార్థము - యోగిసముదాయ కల్పతరువునకు వందనం, బ్రహ్మవిష్ణురుద్రస్వరూపునకు వందనం, నాదలయాంతరస్థలగతునికి వందనం, ధర్మార్థకామరూపునికి వందనం, రాగవిహీనచిత్తసులభునికి వందనం, సభానాయకునికి వందనం, సంపూర్ణదయాసముద్రునికి వందనం , సదా శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
వందనం సాధకబుధ సురతరుసమ!
వందనం త్రైమూర్త్య ఆత్మరూప!
వందనం నాదాలయాంతరవరపూజ్య ‎
ధర్మార్థకామ త్రిధర్మధారి!
వందనం సద్గుణానందజన సులభ
సాధ్య! జగత్సభావందితఘన!
వందనం కరుణామృతాంబుధిఘన! అవి
రామవందనములు రాఘవేంద్ర!
తే.
వందనం శ్రీరమణ! వందనం స్వయంభు!
వందనం శ్రీచరణ ! వందనం స్థితపద !
వందనం శ్రీదయిత ! వందనం స్తుతిఘన!
రామ రామ రామమయము రామపథము!
సీ.
సాధకమనముల సాధ్యకల్పతరువు
ముగ్గురుమూర్తులముడిగ రూపు
సంగీతగుడియందు సంస్థాపితమూర్తి
ధర్మార్థకామపు ధర్మధారి
రాగంబు మనసున రానట్టి మేల్దొర
జగమంత సభయైన జరుపువాడు
నిండుదయాసింధునిండిన ప్రతిరూపు
నిండుగ గుండెలను నిండువాడు
తే.
ఎవడు కదలని శిలగను నెరుకరేడు!
ఎవడు అగచర మనమున మెరయువాడు!
ఎవడు జలమున నడుగిడి నెనరువాడు!
రామ రామ రామమయము రామపథము!
37. శ్లోకము - 67/111
వందే నీల సరోజ కోమల రుచిం వందే జగద్వందితం
వందే సూర్య కులాబ్ధి కౌస్తుభ మణిం వందే సురారాధిపం
వందే పాతక పంచక ప్రహరణం వందే జగత్కారణం
వందే వింశతి పంచ తత్త్వ రహితం వందే సదా రాఘవం!
{ముఖ్యార్థము - నీలోత్పల కోమలాంగునకు వందనం, త్రిజగద్వంద్యునకు వందనం, సరసీజాప్తకులాబ్ధికౌస్తుభమణికి వందనం, దేవతార్చితునకు వందనం, పంచమహాఘనాశకునికి వందనం, జగత్కారణునికి వందనం, షడ్వింశతితత్త్వభాసితునికి వందనం, ( 25 తత్వములు లేనివాడు ) సదా రామాధీశునికి ప్రణమిల్లుచున్నాను }
సీ.
వందనం నీలవర్ణాంబుజమృదుదేహ!
వందనం ముజ్జగద్వందితఘన!
వందనం సూర్యవంశాంబుధికౌస్థుభ
మణిధారి ! వందనమనిమిషపూజ్య!
వందనం పాతకపంచకప్రహరణ!
లోకకారణ! సర్వలోకరక్ష!
వందనం ఘనపంచవింశతితత్త్వార్థ
రహిత! వసుమన! శ్రీరామనామ!
తే.
వందనం రాఘవా! వందనం శరణ్య!
వందనం మాధవా! వందనం వరేణ్య!
వందనం కేశవా! వందనం భురణ్య!
రామ రామ రామమయము రామపథము!
సీ.
నల్లకలువపువ్వు నప్పినమృదుమేని
జగములెల్ల పొగడు ౙట్టిఘనుడు!
రవికులమణి కౌస్తుభవిరాజితమరుడు
దేవతల్గొలిచేటి దేవఘనుడు
పాపంబులయిదైన పాపనాశుడొకడు
జగముల మొదలగు జన్ముడొకడు
తత్త్వంబిరవదైదు తనలోన లేవంచు
తనువులు తరియింప తనరువాడు!
తే.
ఎవడు భరమను జనుమల నెలిమికాడు
ఎవడు మనమున ఘనమైన నెలవువాడు
ఎవడు పరమను వరముగ నెరుకరేడు!
రామ రామ రామమయము రామపథము!
36. శ్లోకము - 66/111
వందే పాండుర పుండరీక నయనం వందే బ్జబింబాననం
వందే కంబుగళం కరాబ్జయుగళం వందే లలాటోజ్జ్వలం
వందే పీతదుకూల మంబుదనిభం వందే జగన్మోహనం
వందే కారణ మానుషోజ్జ్వల తనుం వందే సదా రాఘవం!
{ముఖ్యార్థము - తెల్లతామరలవంటి నేత్రద్వయునకు వందనం, రాకాచంద్రబింబాననుకు వందనం , కంబుగళునకు, కరాబ్జయుగళునకు వందనం, లలాటోజ్వలునకు, కాంచనలసచ్చేలధరునకు వందనం, అంబుదనిభునకు, జగన్మోహనాకారునికి వందనం, కారణమానుషోజ్వల దేహునికి రామవిభునకు సదా వందనం }
సీ.
వందనం శ్వేతపద్మనయన! వందనం
పూర్ణచంద్రముఖ! సంపూర్ణరూప!
వందనం కంబుకంఠ! వందనం అంబుజ
హస్త! లలాటోపనిస్తలముఖ!
వందనం పీతాంబరధర! అంబుజసమ!
వరజగన్మోహన వందనంబు!
వందనం కారణమానుషోజ్జ్వలవిరా
జితశరీర! అపరాజిత! పరేశ!
తే.
పద్మగర్భ! పద్మాక్ష! సుపర్ణ! ప్రణవ!
పద్మనాభ! ప్రాణద! ప్రాణ! పద్మినీశ!
పుణ్యవర ! పురాణపురుష! పుష్కరాక్ష!
రామ రామ రామమయము రామపథము!
సీ.
తెల్లతామరకళ్ళు తెలవారుటేలేని
తారాపతీముఖ! వందనంబు
శంఖపందముగొంతు శంకరంబగు చేయి
శంబునుదుటికాంతి శాంతమూర్తి
కనకవస్త్రముగట్టి కడలికి సముడైన
పరమమోహన! పరంధామ రామ!
కారణజన్ముడై కరణమానుషుడైన
ఉజ్వలశరీర! ఉత్తమాంగ!
తే.
జననకారణ! మరణవారణ! అశరణ
శరణ! శతసహస్రస్తుతిశ్రవణ! రమణ!
కరణకారణ! కర్మావతరణ ! శ్రోణ!
రామ రామ రామమయము రామపథము!
35. శ్లోకము - 65/111
వందే సాగర గర్వ భంగ విశిఖం వందే జగజ్జీవనం
వందే కౌసిక యాగ రక్షణకరం వందే గురూణాం గురుం
వందే బాణ శరాసనోజ్జ్వలకరం వందే జటా వల్కలం
వందే లక్ష్మణ భూమిజాన్విత మహం వందే సదా రాఘవం!
{ముఖ్యార్థము - సాగర గర్వాపహశౌర్యధుర్యునకు వందనం, జగజ్జీవునికి వందనం, విశ్వామిత్ర యాగరక్షకునకు వందనం, గురువులకు గురువైన శ్రీ రాములకు వందనం , శరచాపోజ్వలహస్తునకు వందనం, జటావల్కునికి వందనం, సీతా లక్ష్మణ సహితునకు వందనం రాఘవుని ప్రణమిల్లుచున్నాను }
సీ.
వందనం సాగరమదభంగశరఘన!
వందనం సర్వజీవనవదాన్య!
వందనం కౌశికానంద యాగరక్షణబాల!
వందనం బోధకబోధకవర!
వందనం బాణకోదండప్రభాస్థిత
హస్తం! జటావల్క్య వందనంబు!

వందనం సౌమిత్రసీతాన్విత సభాంత
రాత్మక! వందనం రామచంద్ర!
తే.
మాతకౌసల్యమనసున మాధవుండు
భ్రాతభరతహృదయగతి పాదుకంబు
రాజ్యమానవపదపద్మరాజితఘన!
రామ రామ రామమయము రామపథము!
సీ.
బాణంబు సంధించి భారజలధిగర్వ
భారంబు తొలగించు భాస్కరునికి
జగమంత చరియించు చరితార్థ దొరకును
కౌశికయాగపక్షౌణిఘనుని
గురువుల గురువుకు గురిధనుర్బాణంబు
కరమిడు నారశిఖల నరునికి
లక్ష్మణ లక్ష్ణణ్యలక్ష్మి సహితునికి
రఘవంశ మారాజు రాఘవునికి
తే.
వశముగానట్టి దూరంబు వహ్నిజూప
దశరథప్రేమధర్మంబు దరినిజూప
రామభద్రాయ! రామచంద్రాయ! రామ!
రామ రామ రామమయము రామపథము!
34. శ్లోకము - 64/111
వందే సూర్య శశాంకలోచన యుగం వందే జగత్పావనం
వందే పత్ర సహస్ర పద్మ నిలయం వందే పురారి ప్రియం
వందే రాక్షస వంశ నాశనకరం వందే సుధా శీతలం
వందే దేవకపీంద్ర కోటి వినుతం వందే సదా రాఘవం
{ముఖ్యార్థము - రవిచంద్ర నేత్రునికి వందనం జగత్పావనునికి వందనం సహస్రార పద్మనిలయునికి వందనం, పరమేశ్వర ప్రియునికి వందనం ,రాక్షస వంశనాశనునుకి వందనం, సుధాశీతలునికి వందనం, దేవ కపీంద్రకోటివినుతునికి వందనం రఘురామచంద్రునకు నిరంతరం ప్రణమిల్లుచున్నాను }
సీ.
వందనం సూర్యశశాంకనేత్ర! సహస్ర
పత్రపద్మనిలయ! పావనాత్మ!
వందనం లోకపావనఘన! వందనం
పరమేశ్వరసఖ్య! పరమమిత్ర!
వందనం రాక్షసవంశనాశనకర!
అమృతశీతల! అమృతరూప!
వందనం వానరవందిత! సురకోటి
వినుత! విరజ! మానవేంద్ర రామ!
తే.
వేదసారాయ! వేదవేదాంతనిలయ!
జీవరూపాయ! జీవనిర్జీవనిలయ!
భవతారక! భవ్యరూప! పరమాత్మ!
రామ రామ రామమయము రామపథము!
33. శ్లోకము - 63/111
వందే శౌనక గౌతమాద్యభినుతం వందే ఘనశ్యామలం
వందే తారక పీఠ మధ్యనిలయం వందే జగన్నాయకం
వందే భక్త జనౌఘ దేవ విటపం వందే ధనుర్వల్లభం
వందే తత్త్వమసీతి వాక్యజనకం వందే సదా రాఘవం
{ముఖ్యార్థము - శౌనక గౌతమ మహర్షి మొదలగువారిచే స్తొత్ర పూజలందుకుటున్న రఘురామునికి వందనం ఘనశ్యామునకు వందనం, తారకపీఠమధ్యనిలయునకు నమస్కారం, జగన్నాయకునకు, భక్త సముదాయ కల్పవృక్ష శాఖకు, కోదండ గురునకు వందనాలు, {వేదపంచమహావాక్యం} తత్త్వమసీతివాక్య జనకుని, సర్వేశ్వరుని సదా ప్రణమిల్లుచున్నాను}
సీ.
వందనం శౌనకగౌతమాదిమునీంద్ర
సన్నుత! వందనం శ్యామలాంగ!
వందనం ప్రణవపీఠాంతరస్థితఘన!
లోకకారణ సర్వలోకనాథ!
వందనం భాగవతధరార్థసురతరు
శాఖోపశాఖాన్వితోపస్థిత!
వందనం శివధనుర్వల్లభ! వందనం
వేదమహావాక్యజాతకర్త!
తే.
వేదనిర్వేదఘనకీర్త్య వేదవేద్య!
శ్వేతపద్మాబ్జశితసత్య వేదగర్భ!
స్వాస్థ్యసాయుజ్యకరశౌరి వాగధీశ!
రామ రామ రామమయము రామపథము!
32. శ్లోకము - 62/ 111
వందే రామ మనాదిపూరుష మజం వందే రమానాయకం
వందే హార కిరీట కుండల ధరం వందే సునీలద్యుతిం
వందే చాపకలంబకోజ్జ్వలకరం వందే జగన్మంగళం
వందే పఙ్క్తి రథాత్మజం మమగురుం వందే సదా రాఘవం
{ముఖ్యార్థము: పురాణపురుషునకు, అనాది పురుషునకు, లక్ష్మీనాథునకు వందనాలు, హారకిరీటకుండలధరునకు, ఇంద్రనీల కాంతి ప్రకాశ్వోజ్వలునకు, కోదండదివ్యమహాస్త్రోజ్జ్వలునకు, జగన్మాంగళాకారునకు, దశరాత్మజనునుకు, నాగురువునకు, నిరంతరం ప్రణమిల్లుచున్నాను }
సీ:
వందనం శ్రీరామ! వందనం శ్రీపతే!
వందనం సర్వాత్మ! ఆదిపురుష!
వందనం రాఘవ! వందనం మణిహార
కర్ణాంబరమకుట కలిమిధారి!
వందనం మణికాంతినింద్రనీలద్యుత!
కోదండదివ్యప్రకోపధారి!
వందనం దశరథనందనా! వందనం
జగముల మంగళజంత్రికాడ!
తే:
వందనం దశాశ్వరథాగ్ర! వందనీయ!
వందనం తవగురుపూజ్య! చందనాంగ!
వందనమభివందన రామ! ఇందువదన!
రామ రామ రామమయము! రామపథము!
31. శ్లోకము - 61/ 111
సాకేతే నగరే సమస్త సుఖదే హర్మ్యేబ్జకోటిద్యుతే
నక్షత్ర గ్రహపఙ్క్తి లగ్న శిఖరే చాంతర్య పంకేరుహే
వాల్మీక్యత్రిపరాశరాది ముని భిస్సంసేవ్యమానం స్థితం
సీతాలంకృత వామభాగ మనిశం "రామం భజే తారకం"
సీ:
సాకేతనగరిని సర్వసత్సుఖకీర్తి !
హర్మ్యమంచున కోటిహయనదీప్తి!
నక్షత్ర రాశుల నభశోభ గ్రహపంక్తి
శశ్యాంతరస్థితసరసిశిఖర
అత్రి వాల్మీకి పరాశర మునివర్య!
సంసేవ్య శోభిత శంఖపాణి
వామనయన సీత వామభాగంబొప్ప
అనిశం బనుజరక్షాప్తహస్త!
తే:
మునివశిష్ఠుడెరిగినట్టి ముక్తిదాయి!
జనకదశరథప్రేమకు చమరవీచి!
జనగణహిత! వానరసఖ! జాతవేద!
రామ రామ రామమయము రామపథము!
30. శ్లోకము - 60/ 111
సాకేతే రవి కోటి సన్నిభ మహాహర్మే సుసింహాసనే
నానారత్న వినిర్మితే మునిజనా కీర్ణే సదా నందనే
దేవాధీశ్వర సంయుతే నివసితం వామాంక సీతోజ్జ్వలం
దేవేంద్రోపల నీల కోమల తనుం "రామం భజే తారకం"!
{ముఖ్యార్థము: అయోధ్య లో కమలాప్త కోటి సూర్యులతో తుల్యమైన మహా హర్మ్యమందు ,ఉజ్వల రత్న పీఠమందు ,మునీశ్వరులమధ్య, సదానందాన్ని కలిగించి, దేవతా శ్రేస్ఠులతో కూడిన పద్మమందు ఆసీనుడై, వామాంకమున సీతా మాత ద్విగుణీకృత తేజస్సుతో విరాజిల్లుతూ , కాంచన మంజీర కిరీటకుండలవిరాద్భూషణుడైన తారక రాముని ప్రణమిల్లుచున్నాను}
సీ.
సాకేతపురవాస సారూప్య రవికోటి
తేజితఘనహర్మ్యదేవదేవ!
ఘనరత్ననిర్మిత ఘనతరాసనమందు
అగణితనందన! అమరవంద్య!
దేవతాశ్రేష్ఠాధిదేవ! వామస్థిత
జానకీమాతతేజప్రకాశ!
ఇంద్రనీలమణుల కింపగువర్ణాన
కోమలాంగ! సహస్రకోటినామ!
తే.
ఇనకులతిలక! మునిజనాశ్రిత! సురహిత!
అనఘ! అనుజభూషణ! అర్కభానుదీప!
జనహితమనిశం! సత్యధ్వజస్థితఘన!
రామ రామ రామమయము రామపథము!
29. శ్లోకము - 59/ 111
శీర్షాంభోరుహ కర్ణికే నిరుపమే శ్రీ షోడశాంతే శశి
ప్రఖ్యాతామృత వార్ధి వీచి లహరీ నిర్వాణ పీఠాంతరే
శబ్దబ్రహ్మ పరం చరాచర గురుం తేజ:పరం శాశ్వతం
సత్యా సత్య మగోచరం హృది సదా సీతాసమేతం భజే!
{ముఖ్యార్థము: సామ్యములేని పదియారు రేకులుగల శిరస్సునందలి పద్మ కర్ణికయందు ప్రసిధ్ధమైన అమృత సముద్ర తరంగములు గల ప్రవాహముతో కూడిన మోక్షపీఠమందు శబ్దబ్రహ్మప్రధానము కలిగి, స్తావరజంగమములకు గురువై, శాశ్వతుడు, ఉత్కృష్ట తేజస్సై, ఈశ్వర ప్రపంచరూపుడై నేత్రములకు గోచరించనట్టి సీతా సమేతుడైన శ్రీ రామ పరబ్రహ్మను ప్రణమిల్లుచున్నాను }
సీ.
శిరసరసీభూష శితకర్ణికాఘన!
ఉపమానవినిహత ఉత్తమాంగ!
పదునారురేకుల పద్మపత్రస్థిత
క్షీరసాగరసుధాశీకరాబ్ది!
సుమరుత్తరంగభాసుర మోక్షకారక!
వాక్స్థితబ్రహ్మరవాదికధిప!
సకలచరాచరసద్గురువర! ఘన
తేజ! శాశ్వత! నిత్య! దేవదేవ!
తే
సత్యమునసత్యమునను రసాత్మసిద్ధి
నిత్యమైజూపు సద్గుణ! నిరుపమాన!
సీతాపతి! సురహితమతి! శీతకర!
రామ రామ రామమయము రామపథము!
28. శ్లోకము - 58/ 111
భ్రూమధ్యే నిగమాగమోజ్వల పదే చంద్రే త్రిమార్గాంతరే
నిర్ద్వంద్వే నిఖిలార్థ తత్త్వవిలసత్సూక్ష్మే సుషుమ్నోన్ముఖే
ఆసీనం ప్రళయార్క భాసుర పరంజ్యోతి స్స్వరూపాత్మకం
వర్ణాభ్యంచిత మోక్షలక్ష్మి సహితం" రామం భజే తారకం"!
{ముఖ్యార్థము: వేద శాస్త్రములచే ప్రకాశించు స్థానం, చంద్రస్వరూపమైన మూడు మార్గముల మధ్య ప్రదేశమైన కనుబొమ్మల మధ్యమందు, సుఖ దు:ఖాది ద్వందములు లేని, సమస్త తత్త్వములచేనొప్పుచు ,సూక్ష్మమైన సుషుమ్నాభిముఖమైన స్థానమందు కూర్చొని ,హరి ,పరంజ్యోతి తేజో రూపుడు ,క కారాది వర్ణములచే నొప్పుచున్న మోక్షలక్ష్మితో కూడిన తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
బొమముడి నడుమను, బొనగెడి నిగమాగ
మోజ్వలస్థాన తమోహరసమ!
ముక్కాలమార్గమై ముచ్చటగు నడుమను
సుఖదుఃఖనిర్ద్వంద్వసహితరూప!
నిఖిలతత్త్వంబున నిజసూక్ష్మపాజ్ఞను
చక్రాసన సుషుమ్నాధిరోహ
ద్యోతభాస్కర పరంజ్యోతిరూపాత్మక!
హంస క్షమాదివర్ణార్చ్యవర్య
తే.
మోక్షలక్ష్మీశ! మురహరి! మోహితాత్మ!
రాక్షసారి! రావణసంహార! రణవీర!
సాక్ష్య! స్థిర! నిర్గుణగుణసారధార!
రామ రామ రామమయము రామపథము!
27. శ్లోకము - 57/ 111
సాక్షాత్ షోడశ దివ్య పత్ర కమలే జీవాత్మ సంస్తాపితే
రుద్ర గ్రంధిమయే మనోన్మనిపథే జాలంధ్ర పీఠాంతరే
శుభ్ర జ్యోతిమయం శరీర సహితం సుస్థం సుధా శీతలం
శబ్దబ్రహ్మ నివాస భూత వదనం "రామం భజే తారకం"!
{ముఖ్యార్థము: జీవాత్మ స్థానమై, రుద్రగ్రంధి స్వరూపమై, మనోన్మనీమార్గమై, జాలంధరపీఠ మధ్యమందు, షోడశదళపద్మమందుండి, పరిశుభ్రజ్యోతిస్స్వరూపమై, దేహముతోకూడి, అమృతంవలెచల్లనై, శబ్దబ్రహ్మకు( అనగా వేదములకు) నివాసమగు ముఖముగల తారకరాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
పదునారు అచ్చుల పద్మపత్రంబుల
స్వరపేటి విశుద్ధవాస! చక్రి!
జీవాత్మ కొలువను జీవరూపంబీవు
ఫాలరుద్రగ్రంధిపాశవాస
మతిగతి పరమాత్మమతమైన పథదీప్తి!
అమలిన దీపంబు నమరదీప్తి!
అశరీరపరమాత్మ! అమృతశీతసహిత
‎ స్వాస్థ్యశరీరనివాస! రామ!
తే.
తారక! తరుణకారణ! తామరాబ్జ
సారజనక! సామనిగమసారగర్భ!
మారజిత్శత్రుజితకర! మానవేంద్ర!
రామ రామ రామమయము రామపథము!
26. శ్లోకము - 56/111
హృత్పద్మే విలయార్కకోటి సదృశం కాఠాంత వర్ణోజ్జ్వలే
ప్రాణాంత ప్రణవాంతరే ప్రవిలసద్దోర్బాణ పీఠాంతరే
సూర్యం హంసమయం సదాశివపదం కోదండ దీక్షాగురుం
వాసం మోక్ష రమా సమేత మనిశం "రామం భజే తారకం" 24
{ముఖ్యార్థము - క కారాది ఠ కారాంత వర్ణ రూపమైన ప్రాణ వాయువులయందొప్పుచు, ఓంకార మధ్యమందు సుస్థిరుడు, ప్రకాశించు భుజ బాణ పీఠముగల హృదయపద్మమందుండి, ఛాయాధిప, హంసరూపుడు ,సత్సదాశ్శివ రూపుడు ,మహా కోదండ ధనుర్విద్యా దీక్షాగురువు, మోక్ష లక్ష్మీయుతుడు, తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
ద్వాదశదళపద్మవాసమై హృదయంబు
కోటిప్రళయసూర్య కాంతిదాయి
ద్వాదశాక్షరి కంఠవాద్యమై "క""ఠ" అంత్య
పదమనాహతచక్ర పద్మవాసి
ప్రాణవాయువునందు ప్రణవనాదంబందు
భుజబాణపీఠహృద్పద్మధారి!
కోదండదీక్షకు కోవెలగురువైన
రవిహంసశివరూప! రక్షపాల !
తే.
పద్మవాస! మోక్షస్థితపద్మ హృదయ
పద్మవాస! అనవరత పరమపూజ్య
పద్మపాద! పరంధామ! పావనాత్మ
రామ రామ రామమయము రామపథము!
25. శ్లోకము 55/111
డా పాంత్యాక్షర పంకజే దశదళే మాణిక్య సంపూరితే
విష్ణుగ్రంథిమయే పరాభయకరం చాశంఖ చక్రాన్వితం
మార్తాండద్యుతి మంజులాభ మతులం పీతాంబరం కౌస్తుభం
సర్వం సర్వగ మిందిరా సహచరం" రామం భజే తారకం "
{ముఖ్యార్థము - పది రేకులు కలిగి, మాణిక్య సంపూరితమై, విష్ణుగ్రంధి స్వరూపమైన డ కారాది ప కార పర్యంతాక్షర రూపమైన మణిపూర చక్రమందుండి, అభయహస్తముతో, శంఖచక్రములతో సూర్యమండలకాంతివలె మనోహరమై పీతాంబర, కౌస్తుభమణి ధారియై, సర్వస్వరూపుడై, సమస్తమునుపొంది, లక్ష్మీయుతుడు, పద్మనాభుడైన తారకరాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
దశపత్ర కమలంబు దశవర్ణమాలయై
"డ""ఫ"నడిమక్షర పత్రపదము
మాణిక్యములనిండు మహిత విష్ణుగ్రంధి
మయమైన మణిపూరచక్రముండు
చక్రంబు శంఖంబు చనవునభయహస్త
మార్తాండకిరణమనోహరుండు
కమలాక్ష! కేశవ! కనకాంబరధర!
కౌస్తుభమణిహార కౌసలేయ!
తే.
సర్వరూపధర సర్వాత్మ సర్వగామి
సరసిజాసన సిరిసీతసహచరాప్త
సకలగుణధామ సాకేత సార్వభౌమ!
రామరామ రామమయము.రామపథము!
24. శ్లోకము - 54/ 111
"స్వాధిష్ఠాన " సరోరుహే ప్రవిలసద్బాలాంత వర్ణాశ్రయం
బ్రహ్మగ్రంధి మహోన్నతే కరతలే శ్రీకుండికా మాలికాం
పీఠే రత్న నిభం పరాభయకరం వాణీయుతం బిభ్రతం
సాక్షాద్బోధ మనన్య మంగళకరం "రామం భజే తారకం"!
{ముఖ్యార్థము: స్వాధిష్ఠాన చక్రమందు ప్రకాశించుచున్న బ కారము మొదలు ల కారము వరకు గల అక్షరములకాశ్రయుడు, బ్రహ్మ గ్రంధిచే ఉన్నతమైన హస్తమునందు కమండలువును మాలికను దాల్చి, పీఠాసీనుడై, రత్నములతో సమానుడై, కల్యాణముద్రోజ్వలుడై, సాధువాక్యములతో గూడి, కేవలబోధస్వరూపుడై( వాణీయుతుడై) , అసాధారణ శుభకరుడు గుణాభిరాముడైన తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ:
వెన్ను స్వాధిష్టాన వెలుగుల చక్రమై
"బభమయరల" వర్ణమాలనుండు
బ్రహ్మగంధిని నిలిచి బ్రహ్మంబుగబెరిగి
పూదండ కుండికా కరముదాల్చు
రత్నపీఠాశీన రత్నసమానమై
కల్యాణముద్రతో కన్నుగట్టు
ఎదుటనే ఙ్ఞానంబు నెన్నదగు మృదువాక్య
మెరుకగు వాణిగ నెరుకజేయు
తే:
అన్యథాశరణంనాస్తియను సురముని
మాన్యరూపగుణ విరాజమాన శౌర్య
ధన్య రఘువరా! రాఘవా! ధర్మరూప
రామ రామ రామమయము రామపథము!
23. శ్లోకము - 53/ 111
"మూలాధార"సరోరుహే హుతవహ స్థానే త్రికోణాంతరే
కందే కుండలికా సుషుప్తి పటలీ "వాసాంత "వర్ణాశ్రయే
బాలార్కప్రతిమం పరాభయకరం పాశాంకుశాలంకృతం
భూతన్వాశ్రయ మాదిపూరుష మజం రామం "భజే తారకం
{ముఖ్యార్థము: అంతకు దుంపయైన మూలాధార చక్రమందు, అగ్నిస్థానమందు ,త్రికోణయంత్రమందు కుండలి రూపముగా సుషుప్తిచేత ఒప్పుచున్న వ కారము మొదలు స కార పర్యంతాక్షరములకాశ్రయమై, లేత సూర్యునితో సమానుడు, కరము అభయయముగల హస్తములు కలిగి, పాశాంకుశములచేత అలంకరింపబడి, భూతములకు ముఖ్యాశ్రయము, మొదటిపురుషుడు, పుట్టుకలేని తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
ఆధారమూలంబు అగ్నిశక్తిస్థాన
మూల మూలాధారచక్రమందు
దర్శితత్రికోణదరిని యంత్రంబు
కుండలిరూపమై యొప్పుచుండ
సౌషుప్తనాడిని సౌందర్యమలరారు
"వ శ ష స" వర్ణమాలందునుండి
అంకుశపాశంబు నందంబు బెంచగ
అభయంబు కరమిడు ఆదిపురుష!
తే:
జీవులందరు జేరగ జీవపవధి!
జీవజీవంత నిర్జీవజీవనముల
జీవమైన త్రిధామ! రాజీవనేత్ర!
రామ రామ రామమయము రామపథము!
సీ.
చక్షుమూలాధార చక్రారవిందాన
అగ్నిశక్తిస్థానబిందువందు
దర్శితత్రికోణదరికి మధ్యంబు
‎ తామరతీగపోచంబు గతిని
కుంభమైయున్నట్టి కుండలినీశక్తి
సౌషుప్తినాడీసమూహమందు
వాసితంబైన నివాసాంతమునుజుట్టి
ముప్పేట నభయంబులిచ్చు మూర్తి
తే.
‎సుప్రకాశ దివ్యదీపాంశుకరరూప
‎శోభల స్వయంభూలింగశోభితఘను
‎డాతడు నాత్మారాముడు! నాదిదేవ!
‎రామ రామ రామమయము రామపథము!
22. శ్లోకము - 52/ 111
కోదండ దీక్షా గురుమాదిమూలం
గుణాశ్రయం చందన కుంకుమాంకం
సలక్ష్మణం సర్వ జనాంతరస్థం
పరాత్పరం రామ మహం నమామి
సీ.
కోదండ రాముని కోటిపూజలగని
కోమలికొకడిని కోటికొకని
గురువుల గురువని గుణముల నెలవని
నిర్గుణమతియని నిజపుదొరని
చందన కుంకుమ చంపక జవ్వాజి
పూజితమరుడని పూర్ణఘునుని
సఖలక్ష్మణసఖుని సకలజనస్థితుని
సహచరి సీతకు చనవరియని
తే.
రమము రామనామము కర్ణరమము యనుచు
నమములిడి గొలిచెడి శరణమత హృదయ
సుమము రాముని పదమున పదసుమంబు
రామ రామ రామమయము రామపథము!
21. శ్లోకము - 51/ 111
సాకేతే ధవళే సురద్రుమతలే సౌధే విమానాంతరే
చాదిక్షాంత సమస్త వర్ణ కమలే దివ్యే మృగేంద్రాసనే
ఓం కారోజ్జ్వలకర్ణి కే సురసరిన్మధ్యే సదే వాంతరే
వ్యాసాద్యాది మునీశ్వరాద్యభినుతం "రామం భజే తారకం" !
{ముఖ్యార్థము: అయోధ్య యందు తెల్లని కల్పవృక్షవాటికయందుగల భవన పైఅంతస్థునందు
అ కారముమొదలు క్ష కారమువరకు సమస్తాక్షర రూపపద్మమందు ప్రకాశించుచున్న
సిం హాసనమందు ఓం కారముచే ప్రకాశించు పద్మమధ్యమందు దేవతలోకూడిన మధ్యభాగముగల గంగామధ్యమందు వ్యాసుడు మొదలగు ఆదిమునులచే స్తోత్రము చేయబడుచున్న తారకరాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
సాకేతపురమున సామీప్య సురధేను
సురతరూవాటికా సౌధవాస
గోపురమధ్యాన గోచరంబైనట్టి
వర్ణమాలాలంకృతకమలేశ

దివ్యసింహాసన దీప్యమానంబైన
ప్రణవోజ్వలితపద్మవాస
సురవర్యశోభిత సుజనసభామధ్య
వ్యాసాదిమునివరస్తోత్రశౌరి
తే.
తరుణి జానకి తవవామహస్తగతిని
హరణభరణంబునారక్ష హస్తమలర
శరణు తారకరామ! అశరణధామ!
రామ రామ రామమయము రామపథము!
20. శ్లోకము - 50/11
ఓతప్రోతసమస్త వస్తునిచయం చోంకారబీజాక్షరం
ఓంకార ప్రకృతిం షడక్ష రహితం హ్యోంకార కందాంకురం
ఓంకారస్ఫుట భూర్భువస్సువరితం త్వోఘత్రయారాధితం
ఓంకారోజ్జ్వల సింహపీఠ నిలయం "రామం భజే తారకం"!
{ముఖ్యార్థము: బట్ట నిలువుగాను అడ్డుగాను నేసినట్టుగా, సమస్త వస్తుసముదాయములో ప్రవేశించిన, ఓంకారమను బీజాక్షరము కలిగి, ఓంకారము ప్రధానముకలిగి, షడక్షరమంత్ర మిష్టముకలిగి, ఓంకారమనెడు దుంపకు మొలకయై, ఓంకారముచేత స్ఫుటమైన భూర్భువస్సువశబ్దములచేత (అనగా వ్యాహృతులచేత) పొందదగి, త్రివేణులచేత ఆరాధించబడి, ప్రణవముచే ప్రకాశించు సిం హాసనస్థానముగల తారకరాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
ఒక్కడోతప్రోత మొక్కొక్క వస్తువం
దోంకార బీజాక్షరముగనుండు
ఓంకార ప్రకృతిగ యొప్పిన పురుషుడే
ఓంకారవృక్షాది విత్తనంబు

ఓంకారజనితమై యొప్పు గాయత్రియై
భూర్భువస్సువరితంబను పదంబు
ఒక్కడే సాకార ఓంకార ఆకార
త్రయంబులన్నేర్ప నాదిగురువు
తే.
ఆర్తరక్షకునిగన నారక్షరంబు
లర్థమైన నోంకారోజ్జ్వల ఘనసింహ
సదనమైన తారకరామశబ్దమబ్బ
రామ రామ రామమయము రామపథము!
19. శ్లోకము - 49/11
దేవేంద్ర నీల నవ మేఘ వినిర్జి తాంగం
పూర్ణేందు బింబ వదనం శరచాప హస్తం
సీతా సమేత మనిశం శరణం శరణ్యం
చేతో మదీయ మభివాంఛతి రామచంద్రం!
{ముఖ్యార్థము: జయించబడిన ఇంద్రనీలములు క్రొత్త మేఘముగల దేహము, పూర్ణేందు బింబ వదనం, శరచాప హస్తం, సీతాసమేతం,నిరంతరం రక్షించ అర్హుడైనట్టి రామచంద్రుని నాచిత్తము శరణు కోరుచున్నది }
సీ.
నవనీలమేఘంబు నవ్యనీలమణియు
నీలవర్ణుని రూపనిర్జితంబు
పూర్ణచంద్రునిరూపు పూరణ నీ రూపు
శరచాపహస్తమే శరణురూపు
సీతమ్మగనురూపు శీఘ్రశరణ్యుడై
అనిశంబు శరణను రక్షరూపు
చిత్తంబు నొదలక చిత్తవృత్తీవని
శరణుగోరు తవ చిదాత్మరూపు!
తే :
జయము నీలమేఘశ్యామ! జయము రామ!
జయము ఇందీవర! జయము జన్మకీల!
జయము రామచంద్ర! యనునట్టి జగతిగతుల
రామ రామ రామమయము రామపథము !
18. శ్లోకము - 48/11
హృదయ కుహరమధ్యధ్యోతితన్మంత్రసారం
నిగమ నియమ గమ్యం వేదశాస్త్రైరచింత్యం
హరిహర విధి వంద్యం హంసమంత్రాంతరస్థం
దశరథసుతమీళే దైవతం దేవతానాం!
{ముఖ్యార్థము: హృదయాకాశమధ్యమందు ప్రకాశించు "తత్" అను మంత్రమునకుసారమై, వేదనియమముచే పొందదగి, వేదశాస్త్రములచే చింతింపశక్యముగాని, బ్రహ్మ విష్ణు, శివులకు నమస్కరించతగిన , హంసమంత్రమధ్యమందున్నట్టి , దేవతలకు దేవుడైన దశరథ పుత్రుడైన రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
హృదయనాళంబుల హృద్యాత్మతత్త్వార్థ
మంత్రసారంబైన మంత్రమూర్తి

నిగమాగమనియతి నిఖిలగమ్యంబని
చింతనే లేదన్న చింతనాత్మ
హరిహరబ్రహ్మల కిహము పరమైనట్టి
దేవతారాధ్యుడై దేవదేవ
సోహంబు యొకటను శ్లోకంబునందుండి
"హం" "స"ల శ్వాసనిశ్వాసలుండు
తే.
యోగవాశిష్టపదముల యోగ్యుడైన
భోగలాలసనొదిలి యభోగుడైన
యోగరూపధారిపదమే యోగమనుచు
రామ రామ రామమయము.రామపథము!
17. శ్లోకము - 47/11
సాకేతే మణిమంటపే సురతరు ప్రాంతే విమానాంతరే
పద్మే చాష్ట దళోజ్జ్వలే నుతమహాసౌధే సుధామాన్వితే
సత్యం సూర్యజ రావణానుజ మరుత్పుత్రానుజై స్సేవితం
మధ్యే వాసవ నీల కోమల నిభం" రామం భజే తారకం"!
{ముఖ్యార్థము - అయోధ్యలో, రత్నమంటపమందు, కల్పవృక్షసమీపాన, విమానమధ్య అష్టదళపద్మమందు ,విరాజిల్లుచున్న హర్మ్యమందు, సత్య స్వరూపుడై, సుగ్రీవ విభీషణాంజనేయులచే సేవించబడుచు, వారిమధ్యలో ఇంద్రనీలమాణిక్యాలతో తుల్యుడైన తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
సాకేతపురమున సామీప్యతనుగోరి
కల్పవృక్షంబుండు ప్రాంతమందు

రత్నమంటపశోభ రాజిల్లు కోటల
గగనంబుగను సౌధహర్మ్యమందు
భవనగోపురమందు భద్రమై నిలిచిన
అష్టదళకమలశోభయందు
అమృతమిళితమైన సత్యరూప ఘనుడు
హనుమసుగ్రీవవిభీషణాది
తే.
భక్తజనకోటి గొలిచిన భారహర్త
నింద్రనీల మాణిక్యములింపుదూగు
భక్తజనవల్లభ పదమే భక్తియనుచు
రామ రామ రామమయము రామపథము!
16. శ్లోకము - 46/ 111
మద్వైకుంఠ నాథం సురముని మకుట ద్యోతిత స్వర్ణపీఠం
నీలాంగం చంద్రవక్త్రం మణిమయ మకుటం బాణ కోదండ హస్తం
పద్మాక్షం పాపనాశం ప్రణవమయ మహారత్న సింహాసనస్థం
శ్రీ సీతా వామభాగం శ్రితజనవరదం "రామ చంద్రం భజేహం "!
{ ముఖ్యార్థము - శ్రీమద్ వైకుంఠ నాథుడు, దేవతల మునుల కిరీటములచే(కిరీఠములతో ప్రణమిల్లుటచే) ప్రకాశింపచేయబడిన స్వర్ణ పీఠాలంకృతుడు, శ్యామలాంగుడు, చంద్రవదనుడు, మాణిక్యకిరీటధారి, ధనుర్భాణధారి, పద్మాక్షుడు, పాపనాశుడు, ఓంకారరూపరత్నపీఠాసీనుడై , వామభాగంలో సీతా మాతతో ఆశ్రయించువారలకు వరములనిచ్చు రామచంద్రుని ప్రణమిల్లుచున్నాను}
సీ.
వైకుంఠమున కొలువైన వైరినుతుని
నీలాంగుడైనట్టి చంద్రముఖుని
దేవమునికిరీట దేదీప్యకాంతుల
మెరిసేటి పీఠోపవిష్ఠ వరుని
బాణకోదండాల బారకరమువాని
సీతమ్మ నెదవైపు నిల్పువాని
మణిలసన్మకుటం బమరెడి శిరమువాని
ప్రణవరత్నాసనస్థిరుని మరుని
తే.
పాపనాశక! పద్మాక్ష! పాలకుడని
పారమును జేరగను పాహిపాహి యనెడి
పారమార్ధిక భజనల పానకంబు
రామ రామ రామమయము రామపథము!
15. శ్లోకము - 45/ 111
నిజా నందా కారం నిగమ తురగా రాధితపదం
పరబ్రహ్మానందం పరమ పదగం పాప హరణం
కృపా పారావారం పరమ పురుషం పద్మనిలయం
భజే రామం శ్యామం ప్రకృతి రహితం నిర్గుణ మహం!
{ముఖ్యార్థము - అనానందమే తానై { ఆనందస్వరూపుడై} , శివునిచే పూజింపబడు పాదములు కల శ్రీ రాముడై, ప్రబ్రహ్మరూపమున రమించతగినవాడై, మోక్షస్థానమును పొందినట్టి, పాపములను హరించు దివ్య రూపుడై, దయాసముద్రుడై, ప్రధాన పురుషుడై, సహస్రార పద్మనివాసియై, శ్యామాకారుడై, ప్రకృతిశూన్యుడై, నిర్గుణుడైన పరబ్రహ్మ రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
సచ్చిదానందపు సత్యస్వరూపుండు
పరమశివార్చిత పాదగురుడు
పాపంబు హరియించి పారంబు దరిజేయు
పరమాత్మరమణుండు, పావనుండు
పాహిపాహి యనెడు పారమార్థికులక
పారదయాసింధు పాలకుండు
పద్మాన కొలువుండు పర్జన్యరూపుడు
ప్రకృతిశూన్యుండును నిర్గుణుండు
తే.
పరమపురుషుడని గొలుచు పవనసుతుని
పరము ఇహమీవని దలచు పరమమునుల
పరమగతులకు పరిచయపదము పథము
రామ రామ రామమయము రామపథము!
14. శ్లోకము - 44/ 111
ముక్తేర్మూలం మునివర హృదానందకందం ముకుందం
కూటస్థాఖ్యం సకల వరదం సర్వచైతన్యరూపం
"నాదాతీతం" కమలనిలయం నాద నాదాంత తత్వం
"నాదాతీతం" ప్రకృతిరహితం రామచంద్రం భజేహం
{ముఖ్యార్థము - మోక్ష కారకుడై, మునులమనస్సులందు ఆనందమునకుహేతువై, ముకుందనాముతో, కూటస్థచైతన్యస్వరూపుడై, సకలప్రాణులకువరప్రదాతయై, సర్వప్రాణిస్వరూపుడై, శబ్దబ్రహ్మమునతిక్రమించి, సహస్రారపద్మమందునిలయుడై, ఓంకారధ్వనివాస్తవరూపుడై, నాదాతీతుడై ప్రకృతిశూన్యుడైన రామచంద్రుని ప్రణమిల్లుచున్నాను }
సీ.
ముక్తికాధారంబు ముకుందనామంబు
మునులకానందంబు మురహరియును
ముంపున రక్షించ ముజ్జగంబుల తోడు
మనిషిని పశువున మేలుకొలుపు
నాదమై బ్రహ్మమై నాకంబులను దాటి
నాలోన కమలంబు నిలుపురేడు
ప్రణవనాదంబున ప్రజ్వరిల్లెడు వాడు
ప్రకృతిశూన్యుండైన నిండుఘనుడు
తే.
రూపమే మారదను కాలరూపము వాడు
పాపమే యంటదను పుణ్యపావనుడేను
భజనసేయంగ నెడదకాభరణమైన
రామ రామ రామమయము రామపథము!
13. శ్లోకము - 43/ 111
తారాకారం నిఖిల నిలయం తత్త్వమస్యాది లక్ష్యం
శబ్దావాచ్యం త్రిగుణరహితం వ్యోమ మంగుష్టమాత్రం
నిర్వాణాఖ్యం సగుణ మగుణం వ్యోమరంధ్రాంతరస్థం
సౌషుమ్నాంత: ప్రణవసహితం "రామం భజే తారకం"!
{ముఖ్యార్థము - తరింపజేయు రూపం, సమస్తమునకు స్థానమై, సామవేద మహావాక్యం తత్త్వమసి వాక్యమునకుగురియై, శబ్దములచే చెప్పదగిన, త్రిగుణరహితుడై ( సత్వ రజస్తమోగుణశూన్యుడై)ఆకాశరూపుడై, బొటనవ్రేలియంత ప్రమాణముకలిగి, మోక్షశోభ కలిగి, సగుణనిర్గుణరూపుడై, ఆకాశరంధ్రమధ్యమందుండువాడై ,సుషుమ్నానాడియందునాదబ్రహ్మమైన తారక రాముని ప్రణమిల్లుచున్నాను }

సీ.
తారంపు రూపమై తాను లోకాలోక
నిజమూలస్థానమై తిప్పువాడు!
తత్వంబు బ్రహ్మంబు తవజీవజ్ఞాన
వేదమహావాక్య లక్ష్యశరుడు!
శబ్దపుపదముల సగుణనిర్గుణుడయ్యి
సత్వరజస్తమరహిత గుణుడు!
తారాధ్వ బిలమున, తారకశోభను
ఇంచుకన్ మింటిపై పొడవువాడు!
తే.
నాదజనకుడిల సుషుమ్ననాడి నిలిచి
ప్రణవసహితుని రాముని ప్రణతులిడెడి
గుణమతుల తారకమంత్రగుణము దెలుప
రామ రామ రామమయము రామపథము!
12. శ్లోకము - 42/111
రామం రాక్షస వంశ నాశన కరం రాకేందు బింబాననం
రక్షోరిం రఘువంశ వర్ధనకరం రక్తాధరం రాఘవం
రాధాయాత్మనివాసినం రవినిభం రమ్యం రమానాయకం
రంధ్రాంతర్గత శేషశాయిన మహం "రామం భజే తారకం"
{అమరద్వేషికులాటవీ దహనుడు, రాకేందుబింబాననుడు, రాక్షసశత్రువైన పరాక్రముడు , రఘువంశవర్ధనకరుడు, ఎఱ్ఱని అధరోష్ఠము గలిగి, రఘువంశోధ్భవుడై రాధాదేవి శుభావహ దైవముగల హృదయనివాసి, సూర్యునితో సమానుడై, సుందరరూపుడై లక్ష్మీనాథుడై హృదయరంద్రమందు కుండ లియందున్నట్టి తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
రఘువంశవర్థనా! రవిసమా! రాఘవా!
రక్తాధరా! రాక్షసారి రామ!
రాక్షసజన్మల రాహిత్యమునుబాపు
పూర్ణచంద్రముఖ పూర్ణపురుష!
రాధాదుల హృదయరాగరాజిత హరే
హృదయంబు రమజూపు నాయకుండు !
రక్షార్థి హృదయపు రంధ్రరంధ్రాలందు
జలకుంభ శయనుడౌ శేషశాయి!
తే
రూపలావణ్య సుగుణాది రూపగతివి!
రమ్యశుభదంబు లిచ్చెడి రక్షకుడవు
రామనామంబు భక్తికి రాజసంబు
రామ రామ రామమయము రామపథము!
11. శ్లోకము - 41/ 111
సత్యఙ్ఞాన మనంత మచ్యుత మజం చావ్యాకృతం తత్పరం
కూటస్థాది సమస్త సాక్షి మనఘం సాక్షాద్విరాట్తత్త్వదం
వేద్యం విశ్వమయం స్వలీన భువనం స్వారాజ్య సౌఖ్యప్రదం
పూర్ణం పూర్ణతరం పురాణ పురుషం "రామం భజే తారకం"!
{ముఖ్యార్థము - సత్యఙ్ఞాన రూపుడు, నాశములేనట్టి,సర్వత్ర ఎడబాయనట్టి, పుట్టుక వికారములేని ప్రధానుడు, కూటస్థరూపుడు మొదలగుసమస్తమునకు సాక్షి, దోషరాహిత్యుడు, సాక్షాత్ విరాట్స్వరూపుడు, తెలియతగినట్టిపరమాత్మ, ప్రపంచస్వరూపుడు, భువనములన్ని తనలో అణచుకొన్న మహిమాన్వితుడు, మోక్షసౌఖ్యప్రధాత, సర్వవ్యాపి, పురాణపురుషుడైన తారక రాముని ప్రణమిల్లుచున్నాను}
సీ:
సత్యమహావాక్య సమమగు ఙ్ఞానమై
సచ్చిదానందాత్మ! సాక్షిరూప!
నాశనంబేలేక నలుదిక్కుల వెలుగు
ఆద్యంతరహిత! దోషార్థరహిత!
విరాట్స్వరూపంబు విశ్వమయంబును
విశ్వంబు లీనమౌ విశ్వరూప!
మోక్షసౌఖ్యంబెల్ల మోకరిల్లగజేయు
కూటస్థాదిసమస్తకోటిసాక్షి!
తే:
పూరయిత పూర్ణసమ పరిపూర్ణరూప!
ఆదికావ్యంబు గొలిచిన ఆదిమూర్తి
నియమమెరిగిన మనసున నియతినిలువ
రామ రామ రామమయము రామపథము!
10. శ్లోకము - 40/ 111
ధ్యాయే త్వాం హృదయాంబుజేరఘుపతిం విఙ్ఞానదీపాంకురం
హంసోహంస పరంపరాది మహిమాధారం జగన్మోహనం
హస్తాంభోజ గదాబ్జ చక్రమతులం పీతాంబరం కౌస్తుభం
శ్రీవత్సం పురుషోత్తమం మణినిభం "రామం భజే తారకం" !
{ముఖ్యార్థము - ఙ్ఞానదీపుడు రఘువంశశ్రేష్ఠుడైన నిన్ను హృదయపద్మమందు ధ్యానించుచున్నాను. పరమహంస రూపం ఉత్కృష్టమహిమకాధారమై జగత్తులను మోహింపజేయు చేతియందు శంఖ చక్రగదలు గలిగి, పీతాంబరవస్త్రధారియై కౌస్థుభమణి శ్రీవత్సము గలిగిన పురుష శ్రేష్ఠుడైన నీలమణితో తుల్యుడైన తారక రాముని ప్రణమిల్లుచున్నాను }
సీ.
పరమహంసలుగని పరమాత్మకుడవను
ధ్యాతాంబుజహృదయ ధ్యానరాశి!
విజ్ఞానదీపాంశ విభ్రాజితాధార
మహిమాశ్రయమైన మహిమరూప!
శంఖచక్రగదాది శంకరంబుల దాల్చు
కౌస్థుభ శ్రీవత్స కనకధారి!
వరజగన్మోహన వరపురుషోత్తమ
నీలమణి సమాఢ్య! నీరజాక్ష!
తే.
రాఘవా! దశరథసుత రామచంద్ర!
శ్రీకరా! శుభదాయక శ్రీనివాస!
శమము కరుణయు ధ్యానంబు శరణమిమ్ము!
రామ రామ రామమయము రామఫథము!

9. శ్లోకము - 39/ 111
నిత్యం నీరజ లోచనం నిరుపమం నీవార శూకోపమం
నిర్భేదానుభవం నిరంతర గుణం నీలాంగ రాగోజ్వలం
నిష్పాపం నిగమాగమార్చితపదం నిత్యాత్మకం నిర్మలం
నిష్పుణ్యం నిఖిలం నిరంజన పదం" రామం భజే తారకం" !
{ముఖ్యార్థము: నిత్యుడు, పద్మనయనుడు, ఉపమానములేనివాడు, నివరిగింజ ముల్లువలె సూక్ష్మరూపుడు ,అభేదానుభవస్వరూపుడు, ఎడతెగనిగుణములుకలవాడు, నల్లని శరీర శోభచే
ప్రకాశించువాడు,పాపశూన్యుడు,వేదశాస్త్రములచే పూజింపబడు పాదపద్మములుగలవాడు, నిత్యుడు, నిర్మలుడు, పుణ్యశూన్యుడు( పుణ్యపాపశూన్యుడని అర్థము) సర్వస్వరూపుడు అఙ్ఞాన శూన్యుడునైన తారక రాముని ప్రణమిల్లుచున్నను }
సీ.
నియతపు నెలవగు నీరజాక్షుని గంటి
నిరుపమగుణధామ నిన్నుగంటి
నివరిగింజను గంటి, నీ సూక్ష్మతను గంటి
నిర్భేద మెదగంటి నిలువుమంటి!
నినుతాక పాపంబు? నినుజేర పుణ్యంబు?
నినువిడువ గుణంబు? నిహతియంటి!
నిఖిల నిగమముల నిక్షిప్తమగునట్టి
నిర్మలనిత్యాత్మ నిక్కమంటి
తే.
నీలవర్ణ రాగంబట నీదుకాంతి
నినుగనిన భవమెల్ల అనిత్యమగును!
నీదు చరణపద్మము విశ్వనీలమణియె
రామ రామ రామమయము రామపథము!
8. శ్లోకం - 38/ 111
కస్తూరీ ఘనసార కుంకుమ లసఛ్ఛ్రీ చందనాలంకృతం
కందర్పాధిక సుందరం ఘననిభం కాకుత్ స్థవంశధ్వజం
కల్యాణాంబరవేష్టితం కమలయా యుక్తం కళా వల్లభం
కల్యాణాచల కార్ముక ప్రియసఖం కల్యాణ రామం భజే
{ముఖ్యార్థము: కస్తూరి, కర్పూరం,కుంకుమం,మంచిగంధం అలంకరింపబడి,మన్మథునికంటే సుందరుడై,మేఘములతో సమానుడై,కాకుత్స్థ వంశానికి ద్వజమై,కల్యాణ వస్త్రాలంకృతుడై,లక్ష్మితో గూడి,శాస్త్రములందిష్టుడై,పరమేశ్వరునికిప్రాణస్నేహితుడై మంగళస్వరూపుడైన కల్యాణరాముని ప్రణమిల్లు చున్నాను }
సీ.
కస్తూరి కుంకమ కర్పూర గంధంబు
నీ మేను జేరంగ శోభితార్థి
కందర్పు కంటెను కడుమిన్న తామను
సుందరు ల్జూచేటి సుందరాంగ
కట్టు భూషణమైన కళ్యాణవస్త్రంబు,
కమలిని చేపట్టు కలిమిదాయి!
కాకుత్స్థవంశజు కావలి ధ్వజరాజ!
కాచుకళలనుండి గాచు శరుడు
తే.
శుభకరుడు శంకరునికి నశుభగతులను
నభమువైనట్టి సఖునిగ నలరు నిభపు
సముని కల్యాణరాముని శరణుయనుదు
రామ రామ రామమయము రామపథము!
7. శ్లోకము:
మజ్జీవం మదనుగ్రహం మదధిపం మద్భావనం మత్సుఖం
మత్తాతం మమసద్గురుం మమవరం మోహాంధవిఛ్చేదనం
మత్పుణ్యం మదనేక భాంధవజనం మజ్జీవనం మన్నిధిం
మత్సిధ్ధిం మమసర్వకర్మ సుకృతం రామం భజే తారకం!
{ముఖ్యార్థము: నా ప్రాణము, నాయందు అనుగ్రహము కల నాస్వామి, నాయేలిక, నాధ్యాన రూపుడు, నాసౌఖ్యము, నాతండ్రి, నాగురువు, నా పరమాత్మ, నా అ ఙ్ఞాందకారముపోగొట్టు నా దేవత, నాపుణ్యరూపుడు, నాకు బహుబంధురూపుడు, నాప్రాణాధారమైన నా సర్వస్వరూపుడు, నానిధి, నాతపస్సిధ్ధి, నాసమస్త కర్మల పుణ్యమైన నా తారక రాముని ప్రణమిల్లుచున్నాను}
సీ:
నాదను జీవంబు నాపైన కరుణయు
నా వేల్పు! నా తండ్రి! నాదు గురువు!
నా భావనాధార నా సౌఖ్యవరదాయి
నామోహవిచ్ఛేద! నాదు వరమ!
నాదను పుణ్యంబు! నా వారలగువారు!
నాసిద్ధిదాయక! నాదు నిధివి
నాతపసిద్ధివి నాసర్వకర్మల
నాదు సుకృతమైన నామరూప!
తే:
నాదు మనమును నడపంగ నావ నీవు
నీదు తారకమంత్రము నీరమనుచు
నాదు జిహ్వను గ్రోలెడు నామధారి
రామ రామ రామమయము రామపథము!
6. శ్లోకము:
తారం తారక మండలో పరిలసజ్జ్యోతి స్ఫురత్తారకా
తీతం తత్త్వమసీతివాక్యమహిమాథారం తటిత్సన్నిభం
తత్త్వఙ్ఞాన పవిత్రితత్రిభువనం తారాసనాంతర్గతం
తారాంతధ్రువ మండాలాబ్జ రుచిరం "రామం భజే తారకం"!
(ముఖ్యార్థము: తరింపచేయునట్టి, నేత్రమండలమునకు పైన ప్రకాశించుసహస్రారము అతిక్రమించి, "నీవే పరబ్రహ్మ" సామవేదమహా వాక్యమహిమకాధారమై, మెరపులతో సమానమై, బ్రహ్మఙ్ఞానముచే పవిత్రమై చేయబడిన మూడులోకములు కలిగి, ముత్యాలపీఠము మధ్యము పొంది, నక్షత్రములపైనుండు ధ్రువమండలమునందు పద్మముచే శోభించు తారకరాముని ప్రణమిల్లుచున్నాను)
సీ:
కనులకు తరితీపు, కనుమండలముపైన
కవ్వల వెలుగు తారాధిపురుష!
స్థిరమైన తత్వమసీ మహావాక్యంపు
మహిమకాధారమౌ మహితరూప
మేరమీరు మెఱుపు మేనికాంతి సమము
ముత్యాలపీఠపు మూలనిలయ
తత్వము బ్రహ్మము తలరారు త్రిభువన
తత్వస్థితఙ్ఞాన తత్త్వవేత్త
తే:
తారలకు పైనగను ధ్రువతార మండ
లాబ్జరుచిర! శోభిత వచనాభిరామ!
సకలసురసేవితానంద! సౌమ్యబృంద!
రామ రామ రామమయము రామపథము !
5. శ్లోకము:
తారాకార విమాన మధ్య నిలయం తత్వ్తత్రయారాధితం
తత్రాధీశ్వర యోగనిర్గుణ మహాసిధ్దైస్సమారాధితం
తత్సంగం తరుణేందు శేఖరసఖం తారాత్రయాంతర్గతం
తప్త స్వర్ణ కిరీట కుండల యుగం "రామం భజే తారకం" !
(ముఖ్యార్థము: నక్షత్రములవంటి విమాన మధ్యమున నిలయుడై, జీవుడు, ప్రకృతి,ఈశ్వరుడు అన్న మూడు తత్త్వములచే ఆరాధించబడి, అందు ప్రధానమైన యోగముచే నిర్గుణులైన మహా సిధ్ధులచే పూజింబబడి, తత్పద సంగమము కలిగి, పరమేశ్వరుని ప్ర్రాణమిత్రుడై, నేత్రత్రయ మధ్యభాగ భ్రూమధ్య మందుండి,తప్త స్వర్ణ కిరీటం, కుండల యుగ్మములతో అలంకార శోభితుడైన, తారక రాముని ప్రణమిల్లుచున్నాను)
సీ:
తలగను తారల తలనిడు నభమున
నెలవైన తొలితార నెనరు వెలుగు
జీవేశ్వర ప్రకృతీ జీవనతతత్త్వ త్ర
యారాధిత! జగదేకార్యమిత్ర!
యోగమే నిర్గుణయోగమై నిలిచేటి
యోగులేగను మహాయోగమూర్తి
తత్సంగ తరుణమై తల నిందుశిఖరమై
తనరారు నీశ్వర సఖ్యమిత్ర
తే:
మూడుకన్నులు గలిసెడిమూల మణియు,
కావ స్వర్ణంపు మకుటము, కాచు కర్ణ
మిరుగడ కర్ణికంబుల శోభమీర గనగ
రామ రామ రామమయము రామపథము!
4. శ్లోకము :
ఖశ్యామం ఖగవాహనం ఖరరిపుం ఖద్యాదిభూతాత్మకం
ఖాతీతం ఖగమంత్రతత్పరపదం ఖద్యోతకోట్యుజ్జ్వలం
ఖావాచ్యం ఖగకేతనం ఖగమనం ఖర్వటశృంగాలయం
ఖరాధ్యంచ ఖరంద్ర పీఠ నిలయం రామం భజే తారకం!
(నల్లని ఆకాశ రూపమై, గరుడవాహనుడై, ఖరాసురుని శత్రువై, ఆకాశాది పంచభూత స్వరూపమై, ఆకాశమతిక్రమించెడిరూపమై, ఖేచరముద్రామంత్రములందు ఆసక్తి గలవారికిస్థానమై, కోటిమెరుపులవలె ప్రకాశమై, ఆకాశమువలె చెప్పశక్యముగానట్టి, గరుడ ధ్వజము కలిగి, ఖర్వాటపర్వతశిఖరమందు నివాసము కలిగి, ఆకాశమువలె బట్టబయలుగా ఆరాధింపదగినట్టి, ఇంద్రియపీఠమగు మనస్సునందు స్థానము గల తారక రాముని ప్రణమిల్లుచున్నాను)
సీసము:
ఖశ్యామ రూపంబు ఖగవాహనంబును,
ఖరరిపు నామంబు ఖంబునేత్ర!
ఖద్యాదిభూత లేఖకరూపధరుడవై
ఖాతీత మగునట్టి ఖంబుధారి!
ఖగమంత్రతత్పర ఖంబుపదంబీవు
ఖద్యోతకోటిఘనోజ్వలంబు!
ఖగకేతనముబట్టి ఖగమనసారథై
ఖావాచ్య ఖర్వాట శిఖరనిలయ!
తేటగీతి:
ఖరకరధ్యానమున బ్రహ్మఖనివి నీవు!
నిగ్రహఖరంద్రపీఠాన నిలయముండి
మంత్రతారక తారకమంత్రమనెడు
రామ రామ రామమయము రామపథము!
3. శ్లోకము:
నానాభూత హృదబ్జపద్మనిలయం నామోజ్జ్వలాభూషణం
నామస్తోత్ర పవిత్రత త్రిభువనం నారాయణాష్టాక్షరం
నాదాంతేందు గళత్సుధాఫ్లుతతనుం నానాత్మచిన్మాత్రకం
నానాకోటి యుగాంత భాను సదృశం రామం భజే తారకం!
(సమస్త భూతముల హృదయపద్మమందు నివాసమై, రామనామానికే ఉజ్జ్వల అలంకారమై, రామనామ స్తుతిచే పవిత్రమైన త్రిభువనాలు రక్షింపబడి, నారాయణాస్టాక్షర మంత్రస్వరూంతో, నాదమధ్యమ చంద్రునినుండిజాలువారెడి అమృత ధారలచేతడుపబడిన శరీరం కలిగి , అందరి ఆత్మలయందు ఙ్ఞాన స్వరూపుడు ప్రళయ కాల కోటి సూర్యులతో వెలుగొందు తారక రాముని ప్రణమిల్లుచున్నాను)
సీ:
సకలజనముల హృదయాబ్జ సరసిజముల
నిలయంబు నీవట నిశ్చితంబు
తవనామ పసిడియే తమకలంకారమై
తడవకు బలికిన తన్మయంబు
తవనామ కీర్తనే తమకు పావనమన్న
త్రిభువనరక్షణట త్రికరణంబు
నాల్కయే ఓం నమో నారాయణాయన్న
నాకంబుగనరటే నాల్గుగడల
తే:
సోమసుధధారల తడియు శోభితాంగ!
మామకాత్మయందు ఙ్ఞానమాసరంబు!
లోకమవ్వల రవికోటిలోన వెలుగు
రామ రామ రామమయము రామపథము!
2. శ్లోకము:
నాదం నాద వినీల చిత్త పవనం నాదాంత తత్వప్రియం
నామాకార వివర్జితం నవఘన శ్యామాంగ నాద ప్రియం
నాదాంభోజ మరంద మత్త విలస ద్భృంగం మదాంతస్థితం
నాదాంత ధ్రువ మండలాబ్జ రుచిరం" రామం భజే తారకం!
(ఓంకార వాచ్యుడు, వేదాంతములందు ప్రతిపాదింపబడినవాడు, నామరూపములులేనివాడు, క్రొత్తమేఘమువలె నల్లని వాడు, వేదములయందుప్రీతికలవాడు,అంతరాత్మయైనవాడు ఆశ్రయించువారిని రక్షించువాడైన నా తారకరాముని ప్రణమిల్లుచున్నాను)
సీసము:
నాదంబు పవనార్థ నాదార్తిచిత్తంబు
నాదాంత్యతత్వంపు నామమీవు!
నామమై రూపమై నాదన్నదేలేని
నవ్యమేఘంబందు నల్లనయ్య!
నాదజనిత భృంగనాదమందు నిలుచు
అందరియందుండు అంతరాత్మ!
నాదగతి కడిమి నాదనే ధ్రువునికి
తామరమధ్యంబు తారకంబు!
తేటగీతి:
ఎవ్వని శరణునశరణు లెన్నదగిరి
ఎవ్వని బిలువ నిడుముల లెక్కదొలగు
ఎవ్వని చరణపద్మము లెప్పయనిన
రామ రామ రామమయము రామపథము!
1. శ్లోకం
కోదండ మిక్షుజనితం స్మర పంచబాణం
శంఖం రథానయన మంకుశ పాశ వేణుం
హస్తై ర్దధాన మమలద్యుతి ముద్వహంతం
"ప్రద్యుమ్న కృష్ణ మనిశం భజ రామ చంద్రం"!
{చెరకువిల్లు ,పంచ బాణములు, శంఖము, చక్రము, అంకుశము, పాశము, శార్ఞ్గము ,వేణుదండము ఎనిమిది చేతుల బూని క్రొత్తమణులకాంతితో ప్రద్యుమ్నావతార నల్లని రామచంద్రుని ప్రణమిల్లుచున్నాను }
సీసము:
చెరకువిల్లునుబట్టు చెలిమిరాముని జేయి
పంచబాణమొడియు పసిడిజేయి
శంఖమటుగడను శంకరంబిడుజేయి
చక్రమటుదిరుగ చక్రిజేయి
అంకుశంబునుబట్టు అంతరాత్ముని జేయి
పాశంబుబట్టిన పాహిజేయి
వేణుదండమమరు వేడుక నొకజేయి
శార్ఙ్గబాణంబొప్పు శార్ఙ్గిజేయి
తేటగీతి:
భవ్యరక్షణహస్తక భరిమమహిమ
నవ్యమణికాంతి నిలనీయు నల్లనయ్య
దివ్యరూపంబు గానగ దివినిదింప
రామ రామ రామమయము రామపథము!