(భూమి దినం కోసం గుండెచప్పుడు)
కనిపించని చెట్లు
ఆకాశ హర్మ్యాల వంక
వేళ్ళూనుకుని కోపంగా చూస్తున్నాయి
మరకుళాయిలను ఆపేసే
ఆసక్తి శక్తిలేని ఇళ్ళు
ఎండల్లో నీళ్ళు కొనుక్కుంటున్నాయి
పచ్చని పైర్లు పల్లెలు
నేలమట్టం కావాలని
పట్నపు రంగువేషాలేసుకుని
భూమినమ్ముకుని నిమ్మకుంటున్నాయి
అప్పుడేనాటిన రాజకీయమొక్కలు
ఖనిజమూలాలనీటితో
బారసాల జరుపుకుంటున్నాయి
రోజూ పౌష్టికపానంలేక
నేలరాలి ఉసూరంటున్నాయి
ఆకుపచ్చ మన రంగేకాదన్న
పచ్చకామెర్ల ప్రపంచం
పచ్చటి నేలకోసం
స్వచ్చపు గాలికోసం
సెలవుల్లో ప్రయాణాలు
సిద్ధం చేసుకుంటొంది
మామడి వేప కరివేపాకు
మరువం ధవనం పుష్పాలు
చలిమరగదుల్లో
స్వేచ్ఛనుకోల్పోయి
పెరడులో నేర్చుకున్న
పాతపాటలు పాడుకుంటున్నాయి
బట్టసంచీ
చిట్టిచెట్టు
మోటుబావి
ఘాటుపచ్చడి
రోలు రాయి
చింత తొక్కు
పసుపు వాకిలి
మెంతి కూర
తేనె పట్టు
పుస్తకాల్లోచేరి
అయోమయంగా
చదివేవాళ్ళ వంక చూస్తూ
నాలికపై వల్లెవేస్తున్నాయి
వెర్రిజనాలకి
వికృతి తరిగేదెలాగని
ప్రకృతి పాతకాలందని
పదేపదే మళ్ళీ చెబుతున్నాయి!
No comments:
Post a Comment