Thursday, October 12, 2017

గాలి మంటలు

నాపా గాలి మంటలు  - చంద్ర రెంటచింతల
-----------------
గాల్లో దూరాన్నుంచి
ఎగిరొస్తున్న మంటలపొగలు
మానవ జీవననిర్మితాల్ని
ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి!

ఎక్కడో మండుతున్న కాష్టాలు
గాలి చెట్టాపట్టాలతో ఎగిరొచ్చేసి
దుంగల ఇళ్ళని కాల్చేస్తున్నాయి!

గాల్లోనుంచి పడుతున్న
అగ్నిమాపకజలాలతో
అంతవరకు తడవని రెల్లుగడ్డి
కోపంగా మండుతూ
కోరికగా తడుస్తోంది

ఎప్పుడో చూసిన ద్రాక్షాతోటల్లా
పొగమేఘాలు చాలా రూపాలుగా కనబడి
ముక్కుపుటాలకు బిరడా కొట్టేస్తున్నాయి!

ఎక్కడో అన్నీ పోగొట్టుకున్న జనాలతో
మనస్సు బాధను నింపుకుని
గాల్లోకి చూస్తోంది కాపాడాలని!

పిల్లలు తరగతిగదులు దాటి బయటికి రాలేక
పొగలగురించి పాఠాల బదులు చర్చించుకుంటున్నారు
మానవత్వం తెలీని వయస్సులో!

కళ్ళు చెమర్చి ఒకింతమూసుకుంటే
ఉప్పునీళ్ళ కొలనులో ఆ ఊళ్ళప్రతిబింబం కనబడింది
అప్పుడెప్పుడో వెళ్ళిచూసిన ఙ్ఞాపకాల్లోంచి!

మానవత్వం గుండెను తాకి ఇంకో ఇల్లుకట్టుకుంటోంది
పిల్లలకు కన్నీటిచెరువు కథలను చెబుతూ!

(నాపా మంటల పొగల్లోంచి - 11, 2017)

No comments:

Post a Comment