Friday, May 12, 2017

మిత్రుని తీరాలు

నిన్న తలిస్తే, చుట్టూ వాళ్ళే
ఇంటా బయటా,
గాలితో నిను తాకేంత దగ్గరగా!

నేడు కలిస్తే, చుట్టూ వాళ్ళే
ఇంటిబయట,
గాలైనా నిను తాకలేనంత బిగ్గరగా!

కళ్ళు మూసే ఉన్నాయి
ఎవరూ లేపటంలేదు
ఎవరికీ లేపటం తెలీదు
ఎవరైనా లేపాలని చూసే ఎన్నో కళ్ళు
ఎదురుచూపుల కన్నీళ్ళలో మునిగి
ఙ్ఞాపకాలు వెతుక్కుంటున్నాయి!

సూర్యుడు వచ్చి నీ సూర్యకాంతాలని తిప్పి వెళ్ళాడు
చంద్రుడు వెన్నెలతో అవే పూలను తడిపేస్తున్నాడు
పవనుడు నువు పెంచిన పూలసువాసనల్ని పంచుతున్నాడు
నీళ్ళు నువు లేవని, కన్నీళ్ళై మొక్కల్ని చేరుతున్నాయి
ఇవన్నీ నువులేవని రేపు వెళ్ళిపోతే
మళ్ళీ రావని నీతో కలిసొచ్చేస్తాయేమో!

నింగిలో నీలం, భూమిపై పచ్చదనం,
నీ నిర్మలత్వాన్ని చూపెడుతున్నాయి
ఆకాశమంత దూరం వెళ్ళలనున్నా
నేలపై నిలిచిన
నీ మనసు నిబ్బరత
నీ కుటుంబప్రేమ
వెళ్ళింది నువు కాదేమోనని చూసుకోమంటే
మరలి మరలి ఆలోచిస్తోంది మనసు
నువు వెళ్ళాల్సిన రైలు ఇంకా రాకూడదే అనుకుంటూ!

ఇంట్లో నువు నిలిపిన రెండు కమలాలు
నీడలా కాపాడేందుకు కమలాక్షునికి
కరాలు మోడ్చి, కనురెప్పలు మూసి,
ధ్యానంగా కదిలే అక్షరాలు
నువు చేసుకునే పూజల్లా వినబడుతూనే ఉన్నాయి!
నీ స్నేహం స్వచ్చతను, ఆప్యాయతను
మనికిపడే శ్వాసలో వెతుక్కుంటున్నాయి!
మంచిజరగాలని కోరుకోమంటున్నాయి
 
(పైలోకాలకు వెళ్ళిన మిత్రుడు వ్యాస్ చివరిచూపుల తర్వాత)

No comments:

Post a Comment