ఇంకెన్నాళ్ళు
ఇంతికన్నీళ్ళు?
ప్రేమనే ఉన్మాదంలో
ప్రేమన్న మనిషే పోతే
ప్రేమించినదెవర్నో తెలియని
ఆమ్లజనిత అమానుషహృదయాలను
క్షారమయమైన కర్కశస్వప్నాలను
చెయ్యెత్తి కాల్చేసే సమూహమే నీవై
చెయ్యంటక కడిగేసెయ్ సమాజమా నీవే!
అందానికి అణకువ ఉందంటే
బంధానికి బదులే లేదంటే
అంతమయ్యే రోజులనాపి
అసమ్మతం తమ హక్కంటూ
అర్భకము తమకేలంటూ
అంతంచేసే గులాబిరూపం
అంతికలను వెలిగించేసి
అగ్నిహోత్రమై సర్పయాగాలు చేస్తూ
అంతటా కాల్చే కణికలుగా కనబడదేమి?
మంటల్లో పడిపోకుండా మంటపెట్టదదేమి ?
ఉన్మాదం ఉరితాడంటు
తమస్సుకు సరిజోడంటు
సరినేర్పే సమయపు పాఠం
సిరిమూలపు సహాయభావం
సమయమిదను సంస్కారాలు
సరి వయసులొ నేర్వకపోతే
కరుణెరుగని విషపు నాగులై
బుసకొట్టి చంపిన పడతుల
ఆత్మలన్నీ ఘొషిస్తాయా?
అంతుచూడ గర్జిస్తాయా?
అందరిలో తమనే చూస్తూ
అంతపు దారుల మూయండంటూ
సుంతైనా మారండంటూ
గుండెనిండి రోదిస్తాయా?
గండికొట్టి ముంచేస్తాయా?
అతివబలం చూపిస్తాయా?
అతివగళం వినిపిస్తాయా?
అగ్నిగోళమై చుట్టేస్తాయా?
(చంద్ర రెంటచింతల - 09 జులై 2017)
No comments:
Post a Comment