Tuesday, June 27, 2017

శక్తి రూపాలు

గాలిలో ఎగిరే పక్షికి
గమనం గమ్యం యిదని తెలిపే నిర్దేశశక్తి

కాలికి తగిలిన ముల్లుని
కంటికి పరిచయంచేసే అతీంద్రియ వేగనశక్తి!

నీటిలో అప్పుడే పుట్టిన చేపకి
మొప్పలబలం నీదని తెలిపే శైశవశక్తి!

కడుపులో అమ్మపాటలు వినే బిడ్డకి
నీ ఉనికి యిదని తెలిపే చరణాల్లో ఉద్భవపూర్వశక్తి!

ఆకుపై కదలాడుతున్న గొంగళిపురుగుకి
పాకేందుకు సున్నితత్వాన్ని లెక్కచేయని ధైర్యాన్నిచ్చే సజీవశక్తి!

ఎక్కడో నీ ప్రమేయం లేకుండా పెరిగిన కానలచెట్టుకి
అమృతఫలాలనిచ్చి భోక్తలకై వేచిచూడని నిస్వార్ధశక్తి!

తినేబలం తెగువ వున్న వనరాజులకు
తినాల్సినదేదో తెలిపే బుద్ధికి కారణభూతమైన వివేచనశక్తి!

తాకాలన్నా తాకలేనిది ఒకటుందని తెలిపే వివేకశక్తి!
తాకితే తన జ్ఞాపకమేదో మైళ్ళదూరం ప్రవహించి తెలిపే జ్ఞాపకశక్తి!
తాకిన తరంగాలతో మనసును తాదాత్మ్యం చెందించే వినికిడిశక్తి!
తానే సృష్టికర్తగా లయకర్తగా జననావర్తగా నిలిచిన సుమసౌందర్యంలో సమ్మోహనశక్తి!

ఆ చైతన్యాలేవీ మానవనిర్మితాలు కావని
ఆ సుచేతనాశక్తులన్నీ బాహ్యవలయాలను దాటినవని
నీతో చెప్పేందుకు నడిచే దైవత్వం
నీలోనే వేలమైళ్ళు ప్రసరిస్తోంది
నీకన్నా ముందే నీలో పుట్టి పెరిగింది
నీవు వద్దన్నా చాటుగా నేర్పేందుకేవుంది
నీవే చూడగలిగే అదభ్యచక్షువుని తెరిచి చూడు!
నీలోని దైవత్వం వెలిగించి తరించు నేడు!

(జూన్ 27 2017 - చంద్ర రెంటచింతల)

No comments:

Post a Comment