ఎప్పుడో ఎవరితోనో ఎక్కడో
అంకురార్పణకు ఆలంబమైన అభీప్సితబీజం
అభిరుచుల తీగలుగా ఎగబాకి
ఆనంద విహంగతతుల ఎదసడిగా ఎదిగి
పదపుష్పాలు పూయించి
ప్రతిరోజూ వెన్నెల్లో తడుస్తూంటే!
అదే వెన్నెల సిరివరమై
అత్యంతదగ్గరగా ఆత్మీయతతో
కనిపిస్తే వినిపిస్తే కలవనిస్తే కలలిస్తే
కలకాని కాలాన్ని కలంలా కదిలిస్తే
ఆ కలానికి, కలవరంలేని గళానికి
కలలు కనులుతెరిచి చూసిన కలువలై,
మనసుతరగలు ప్రశాంతతీరం తాకిన నిలకడై,
మరోసారి నన్ను నాకే పరిచయంచేస్తే
మరోసారి గుండెలో వినిపించే పాటకు పల్లవి దారేది?
మరీసారి నన్ను నడిపే త్రోవలో తోడయ్యే చరణమదేది?
వెన్నెలలో తడిసిన తెమ్మెరతో తాకిన సౌందర్యసిరి
ఎదసవ్వడిలో చేరి చైతన్యమై వదలనంటే
ప్రతి ప్రశ్నకు సమాధానం ఎదలయనాదంలా తోచింది!
ప్రతి సమాధానం ప్రశ్నగామారే స్పృహాప్రమోదంగా నిలిచింది!
(24 జూన్ 2017)
No comments:
Post a Comment