Sunday, January 1, 2017

సీమ

కురవని వానల జూడని
నరవరు లందందరున్న నరకము సీమన్
కురవగ వానలు తమవని
నరహరులే కోతలిడరె నమ్మికనదియే!

గలగలబారెడి నదులను
విలవిలలాడంగజేసి విద్యనుగొనగన్
బిలబిల నేగిన బాదుల
కలతను కలరవమునంప కలలే దీరున్!

అడవులు తడవకు గొట్టిరి
కడకును ఖనిజమనిగొట్టి కనుమలజేయన్
జడయుట నెరుగని మేఘము
వెడలెను తన తల్లిసీమ, వెతలే వహ్నిన్!

రాయల వారేలిరిచట
పోయగ కనకంబుగుట్ట పోలిక యిదటన్!
బాయగ తిరుమల దేవుడు
సాయము రాడేల సీమ సాగుకు నిపుడున్!

నేతల మగ్గములాగెను
కోతల కొడవళ్ళునాగె కోతలు నాగెన్
చేతగు చుట్టపు జూపున
చూతము వానలనింక చూకురు యెదలన్!

మేనే తడియకయున్నను
తానే మరి యొరిగిపోదు తాపసి సీమన్!
వానే వదలక కురిసిన
చేనై తావబ్బునంట చేవగు ధరణిన్!

రంకెల లేపాక్షి దుముకు
నంకెల వెంకన్నహుండి నందుట జరుగున్
సంకెలబట్టిన తుంగయు
సుంకేసుల జేరురోజు సుంకులు దొలగున్!

శిఖరపు శ్రీశైలమునను
నఖలను సప్తగిరులుగల నాకంబదియేన్!
ముఖమున మంత్రాలయమును
శిఖముల జలజామణులకు సుమములు లేవే!

పొందెడి అనవరతజలము
నందిన పొందేటి సీమనంతట పొందన్
వందల యేళ్ళే వేచిరి
కొందరు మరి పూనుకొన్న కొండలు కరుగున్!

No comments:

Post a Comment