Thursday, June 1, 2017

ప్రద్యోతజ్యోతి

సుప్రభాతాన
కలలు మరిచి
కనులు తెరిచి
ప్రశాంతనిశ్శబ్దంలో
కమనీయ సుస్వరం
గుండెల్లో వినిపిస్తే
కాళ్ళు కదిలి
వేసే అడుగులవెంట
ప్రద్యోత జ్యోతులు
సమీర సమ్మోహాలు
ప్రకృతి పులకింతలు!

యవ్వనగర్వం దాటినట్టే
పాదాలు దాటుతుంటే
తెలీని సౌందర్యాన్వేషణ
తేలికయ్యే శక్తితో స్నేహంచేస్తూ
చిరుదూరాలు దాటించి
తెలిసిన మార్గమనిపించేలా
మనసు పిలుచుకుపోయింది!

చక్కగా ఎగురుతూ
ఈ ప్రపంచం నాదేనంటూ
మకరందపు ఆఘ్రాణింపులో
మైమరచిన చిన్నశరీరం!
అణువణువునా చైతన్యరూపం!
తెలీనిశక్తి గాల్లో నిలబెడితే
తెలిసిన సుమధురగానంతో
పరాగాలతో భూపాలరాగాలు
సమీరాలతో స్నేహసరాగాలు
తనవేనంటున్న విహంగరూపం
తదేకమైన సమ్మోహనత్వం!

ఏ గతిబంధనాలూ దారిని లేవు!
ఏ అస్థిరవ్యాకులతలు దరికి రావు!
ఈ అనుబంధాలు తెలీదే అన్నట్టు
ఏ అందాలను వెదికి చేరావన్నట్లు
ఎక్కడో తెలిసిన జీవాన్ని కన్నట్టు
నా మనసు విన్నది నీవేనా అన్నట్టు
పారవశ్య మధూలిక
ప్రాతఃకాల మధూగీతాలాపక
ఒక దేవతాపుష్పం
ఒక దేవతాగానం
ఒక అంతఃసౌందర్యం
ఒక మధురానుభూతి
తాదాత్మ్యంలో నేను!

ప్రకృతి-మూలం

గాలి ధూళి
వెలుతురు నీడ
భూమి నీరు
మనిషి మెదడు
మనసు మంచి
ప్రకృతి ప్రాణం

శక్తి నిస్వార్థం
డబ్బు ధర్మం
యుక్తి భక్తి
మబ్బు మర్మం
మనిషి ధర్మం
మలుపు మూలం!

స్థిరాస్థిరాలు

సూర్యుని కిరణాల మారని వేడి స్థానం
భూమితో కలగలిపి మనదే కాలప్రస్థానం!

ఆత్రంగా ఆగక వెలిగే నక్షత్రదివ్వెల కాంతిరూపాలు
చిత్రంగా పగటికాంతిలోనూ కనుమరుగనే కంటిపాపలు!

సముద్రాలు మనచుట్టూ ఉసూరుమని ఉన్నాయనే మానవకల్పితాలు!
మనం సముద్రాలనడుమ ఉసురు పోసుకున్నామనే మనోనేత్రాలు!

జరామరణాల తెలీని తేదీల మధ్య మన ఆయువుభయాలు 
చుట్టూ తెలిసిన మన్నే ఆకృతుల మధ్య మనవి తృణప్రాయాలు!

అస్థిరతే మకిలై పడితే
స్థిరతేదో మదికే తడితే
సముద్రాన్ని కళ్ళల్లోంచి తరిమెయ్!
ఆనందాన అహరహమును తడిపెయ్!
అనుభూతిక్షణాల మయూఖతంత్రుల్ని మీటేయ్!
అంతరాత్మనే కాంతిపుంజపు వెలుగుల్లో వెలిగెయ్!
నీ జాడలనీడకు తొలివాటము నీవను కాంతిని వెదికెయ్!
నీ నీడలజాడలు తుదిబాటను దాటుట నీ తరమని కదులోయ్!

(చంద్ర రెంటచింతల - మే 25 2017)

లేశం-క్లేశం

లేశం-క్లేశం
---------------
మనిషిగా బతకాలని ఎదిగే ఒకరు
మనిషిగా బతకటం మర్చిపోయిన ఇంకొకరు
జీవితోంలో ఏది బరువోననే సంశయం!

కలలతెరలను చూస్తూ పగటికళ్ళు తెరవాలనే ఒకరు
రెండుకళ్ళతో లేస్తూ పక్కవాడికి కలలతెర అవ్వాలనే ఇంకొకరు
జీవనానికి ఏ తెరవ్వాలనే తెలీని సంశయం!

తెలిసిన ఙ్ఞానంతో మెట్లపై పరుగిడి ఎదగాలనే ఒకరు
కలిసిన ఙ్ఞానంతో ఎదిగిన చెట్లలా నిలిచి నీడయ్యే ఇంకొకరు
ఎలా ఆగనివయసుతో ఎదగాలా అని తెలీని విస్మయం!  

నీటిలో మునిగే చూపులను ఒదిలి, ఒడ్డుకు ఒంటరిగా ఈదేసే ఒకరు
కాటిలోకి పట్టుకుపోయేప్పటి చూపుల్లో, ఓ నలుగుర్ని అక్కడే పోగేసుకునే ఇంకొకరు
గమ్యంలో చేరే చూపులేవో, దారిలో తెలీక ఆగనిక్లేశం!
   
తెలీని దారుల్లో
తెలీని జీవాలతో
తెలుసనే ఊసుల ఙ్ఞాపకం!
తెలుసుకోమనే ఙ్ఞానప్రయాణం!

(చంద్ర రెంటచింతల - జూన్ 1, 2017)

Saturday, May 20, 2017

సిరివెన్నెల

చుట్టూపక్కల చూడరా అంటే
రోజూ దయని కళ్ళల్లో పెట్టుకుని చూస్తునే ఉన్నా!

నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటే
రేయింబగళ్ళ తేడా మనసుతో వింటూనే ఉన్నా!

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటే
సిగ్గుని పెంపొందించుకునే అక్షరంగా మారుతూనే ఉన్నా!

కలలను కళ్ళతో చూస్తూ పదమంటే
వేదంలా రోజూ వింటూ కళ్ళను తెరుచుకు తిరుగుతున్నా!

మునుముందేదో తెలియని చిత్రం అంటే
ప్రతిక్షణాన్ని ఆనందించటం నేర్చుకుని అనుభవిస్తూనే ఉన్నా!

ప్రకృతికాంతకు ఎన్నెన్ని సిరులంటే
నిజసిరులను ప్రకృతి ఆకృతుల్లో చూస్తునే ఎదుగుతూ ఉన్నా!

ఏంటయ్యా! ఇంతలా తిప్పుకు తిరుగుతావు?
పదమై పాదాల్ని కదుపుతావు
మనోవినోదినివై జీవననాదాన్ని వినిపిస్తావు
నీ మయూఖతంత్రులనాదంలో మేమంతా మురిసిపోతుంటే
మామూలుమనిషిలా మరలిపోతావు
ఓ మహర్షీ! నీ దారి మనసులను కదపడం అయితే
ఆ దారివెంట రేణువులలో ఒక చైతన్యం ఉందని తెలిసి
పాదస్పర్శ తాకాలని తపించే అభిమానరేణువుని
కనికరించే వరంకోసం, మనసుపడే జీవితకాలం తపస్సు
వరమిచ్చే దేవుడివి, స్వరమిచ్చే చైతన్యానివి నీవే!
నీకూ ఓ తపస్సుంటే, వరాలతో కరుణించాలని
నీతో అక్షరసుమాలై పూయించే ఆ చైతన్యమూర్తికి వేడుకోలు!
జన్మదిన శుభాకాంక్షలు!

Friday, May 19, 2017

నీ చుట్టూ శరీరం

దుఃఖం ఇంకిపోని కళ్ళలో
తడిస్నానాలకై కాచిన కన్నీళ్ళు!

భారంగా కదిలే గుండెలో
తేలికగా తిరుగాడే రక్తపుధారలు!

శౌర్యంతో గట్టిపడే చేతిలో
భారాన్ని ఒడిసిపట్టే బాధ్యతకండరాలు!

కుంచించుకుపోయే మేనిలో
క్రోసుల దూరపు ప్రవాహనాడులు

ఆర్తికి కీీర్తికి వెనుకమల్లే
శమనస్తుతి నేర్పే దాఖలాలై
నువ్వూ, నీ చుట్టూ శరీరం!

Thursday, May 18, 2017

పంచభూతాలు

నింగిలో చంద్రకిరణాలకై వేచే చకోరపక్షీ!
ఊళ్ళో నీ పుట్టుపూర్వోత్తరాలు ఎవరూ అడగట్లేదేం?

నీళ్ళల్లో ఈదేస్తే గడ్డుకు చేరతాననుకునే ఓ చేపా!
బళ్ళల్లో నిన్నట్టుకెళ్ళేప్పుడు ఎవరూ నీ దారిసొద వినట్లేదేం?

అగ్గిలో బుగ్గైపోతున్నానంటున్న ఓ వెతలమానవా!
ఒగ్గేశాక నిన్నెత్తేవారెవరనే బాధ నిన్ను తొలవలేదేం?

నింగికైనా నిచ్చెనలేయగలననే నిరర్థకప్రయత్నచరమా! 
నీవెక్కాలనే నిచ్చెనమెట్లు నీకై గట్టిపడేదెక్కడో వెదకలేదేం?

మట్టిలో హర్మ్యాలను తవ్వే తరూభక్షకా!
ఆ గుట్టల శిథిలాల్లో విత్తులు నాటిన పూర్వీకులను కనిపెట్టలేదేం?

పంచభూతాల్లో వెదుక్కోలేని మూలాల్ని
పంచభూతాలై నీకొచ్చిన శక్తి నిలిచే కాలంలో
పాంచభౌతిక శరీరాన్ని అడ్డం పెట్టుకుని
పంచుకు తిరిగేంత మంచితనం చేయడం వెతకక
పంచుకు బతికేంత గోడల్ని కట్టేసుకుంటావేం?

నీకున్న శక్తి నీకు ఇచ్చిందెవరని
నీదన్న భుక్తి నీకు దక్కించిందెవరని
నీవున్న నేలను నిలవక తిప్పేదెవరని
నీపైని నీలాకాశం నిలిపే గొప్పెవరిదని
నీకే తెలపని వయసులగాలము
నీడన నడవకు కోసులదూరము
నీదని బతికే నిమిషపుకాలము
వీడని నడకే కర్మలజాలము!
వాడని నడతే ధర్మపుమూలము!

ప్రశ్నలమూటల బరువులు దించి
జవాబుబాటల తరువుల పెంచి
మంచికి నీడవు నీవే అయితే
పంచన పగులును పేర్చిన గోడలు!
పంచిన పెరుగును నీవను జాడలు!
పంచభూతాలే నీతో తిరిగెడి నీవగు నీడలు!