Sunday, February 19, 2017

ఆవకాయ

అమ్మా! తినుటకు నేనన,
లెమ్మా! రుచులను గలుపుట లెస్సగదమ్మా!
తెమ్మా తుడిచిన ముక్కల
క్రొమ్మావిని గలుపునంత క్రొంతయు బోదే!

మామిడికాయే జీడిని
భామినికై వదిలియొచ్చె భారతమహినిన్
గోమున గలిపిన కారము
కామితమై నావకాయ కావాలనిరే!

నువ్వులనూనెను బోసిన
కెవ్వనలేదేమిటనగ కెమ్మోవి గనన్
జివ్వనదే మేననుచును
నవ్వెడి పూబోణిజూచి నవనవలాడెన్!

కమ్మని మెంతిని చూర్ణము
గమ్మని, నావాలగలిపి ట్టిగ నూరన్
చెమ్మలబట్టిన మేనే
తెమ్మని జాడీలగలుప తేమొలదనెనే!

ముక్కల జేయుద ననుచున్
బక్కటివారిని వలదని బలవంతులిలన్
చక్కగనెత్తిన గత్తిని
పక్కకు బడకుండ కాయపట్టున గొట్టన్!

ఎక్కడి వారలు వీరే
ముక్కలు జేయంగ బెంచి ముద్దులివనరే!
చిక్కను నేనే యనుచును
పక్కకు నెగిరెను తాను పట్టున గొట్టన్!

ముక్కలు జేయంగనొకరు
ముక్కలు గొనంగనొకరును ముచ్చటలొకరున్
ముక్కల గూరంగనొకరు
ముక్కల దాచంగనొకరు ముచ్చట గలవన్!

కళకళలాడే యింటను
తళతళ యన్నమును జేసి తరుదళములన్
ఇళనెయ్యి గలిపి వేసిన
భళభళ దినియావకాయ భళిభళి యనరే!

కలిపిన జాడీ నిండును
కలిపిన జేతులును పండు కదనపు రంగై
కలిపిన అన్నము పండును
కలిపిన పొడులన్నియుండు కసి కారముతో!

కాయన కానిదిదనిరే !
వేయగ వలదన్న నిలను వేషములనిరే!
రాయగ ఆవకాయనునది
కోయగ బొడిచేటి పొడుపు కోమలిక మిలన్!

శిరమున గంగమ్మ గదిలి
పరమాత్మా యనిన జనుల పరిరక్షణకై
పరమశివుడు కందిపొడిని
వరమివ్వగ నావకాయ వహ్నికి దిగెనా!

అన్నము బ్రహ్మకు రూపము
కన్నుల నెర్రావకాయ కలిసిన దైవం
బన్నను కందిపొడి గలిసి
యున్నట్టి క్షణము లక్ష్మియున్నటులయ్యెన్!

No comments:

Post a Comment