Tuesday, February 21, 2017

తెలుగువెలుగు

తెలుగును వెలుగని దెలిపిన
తెలివిదొరలు తెలిసిదెలిసి తెలివని దీయన్
తెలుగేదని దెలవకడుగ
తెలుసుకు బతకంగ తెలుగు తెరగుల గలుపున్!

తెలుగే తొలిభాష యనుచు
కల వలె యరిచిన జనులకు కనులే లేవా!
కలలూ బోవును గనులను
నిలలో రవిగాంచు తృటిని, నిక్కము నదియే!

రాయక జదువక జెప్పక
రాయిని దలపైనగొట్టి రాదే యనగన్
రాయే దేవునిరూపై
రాయును బీజాక్షరములు రావని నీకున్!

సంకర యాంకరుభాషల
వంకరబోయేటి తిక్కవంగడములవన్!
చంకలుగుద్దుకు యరచిన
కింకరులే యొచ్చువరకు కించిత్ రాదే!

అమ్మను గాటికి జేర్చగ
దిమ్మరులై దిరుగువారు దిమ్మను లేకన్
కమ్మగ బుట్టిన భాషను
చెమ్మలబుట్టిన కథలను చెరనేసితిరే!

ధర్మము జెప్పుటకు భాష
కర్మము నేర్పంగ భాష కడజూపుటకున్!
కర్మల గలవగ భాషని
మర్మము దెలిసిన, మనుజులు మరియొదులురటే!

అమ్మా! వదలములెమ్మా
లెమ్మా! దశదిశల దెలుగులెక్క గనమ్మా!
నమ్మకమమ్మములెమ్మా!
లెమ్మా! మమ్ములను నడుప లెస్సగరమ్మా!

తెలుగే తెరగని తెలిసిన,
తెలుగును తెలుపని తరుణపు తెరలును తొలగిన్
తెలుగును తెలచెడి తపనల
తెలుగే తలయెత్తుననుచు తెలిమది తెలిపెన్ !

(చంద్ర రెంటచింతల - 21- ఫిబ్రవరి-2017)

No comments:

Post a Comment