హరుడన శివుడన సంభవ
హరుడన భరుడన భవపాపహరుడన కాళే
శ్వరుడన శరుడన విష
హరుడన భైరవుడన, మలహరుడా! నీవే!
బొమ్మను దునమగ నెంచియు
నమ్మకు తుదగంటినీరు నమ్మిక దీయన్
బొమ్మను దనయుని జేసిన
నమ్మిక కథలెన్ని నీవె! నటరాజప్రభో!
దక్షుని శిక్షించ నీవే!
శిక్షగు వరములను యొసగు శివుడవు నీవే!
రక్షయన రాక్షసులైనను
రక్షణని వరమిచ్చు నార్తరక్షకుడ వీవే!
వదిలితి వాడంబరతను
వదిలిన సతినే వదలక వదిలిన వేళన్
వదిలితివే మోహంబులు
వదిలెడి బంధంబులకును వసువైనావే!
తమకము లేదన్న దొరవు
సుమశర బాణంబు దాకి సుమమగు మనసున్
రమమగు భస్మంబు గనులు
భ్రమరాంబ గనెడి సమయము భ్రమజేసితివే!
పుట్టుటకు బ్రహ్మ ప్రభువని
గట్టున వేయుటకు విష్ణు ఘనపాలకుడున్
గిట్టిన లయకారకుడన
పట్టుగ నీకేమి ముట్టె పర్వదినంబున్!
రాతిరి దినకనె యుండుట
పాతకమను జనులకీవు పాపము నేర్పన్
జాతకమే బాగున్నను
కుతకుతలౌ కడుపునేర్పె కుక్షికిని లేమిన్!
శివుడా! శరణని వేడగ
భవుడై వెన్నంటియుండు భవబాధలనున్
కువకువ లీరవమై నీ
రవమై నాయందునిండు రమ్యపు లయతోన్
No comments:
Post a Comment