Friday, February 24, 2017

గొలుసు

మరుడే మదిగౌరి గలుప
హరుడై తుదిజేర్చువేళ హరమే సురలన్
వరుడై వనజను జేరెడి
హరుడా హరుడనరె సురలు, హరహరదేవా!

భారము నీదేనంచును
భారతిపై భారమిడగ భావము దానై
భారతమే బలుకగలదు,
భారము గాదు మొదలెట్ట భావకవితలోన్!

బుడతల తలలోని దపన
బడలిక నెరుగక వెతికెడి బడి మనబడియే
నడతను భాషను కథలను
గడపల సంస్కృతిని దెలిపి గమనము నేర్పున్!

కమ్మటి మాటల యమ్మను
గమ్మున ప్రేమలిడు మాటగతిలో నాన్నన్
తెమ్మని గలిపిన తేటద
నమ్మిల తెలుగనగ జదువు నమ్మిక దెలియున్

No comments:

Post a Comment