నేనని భ్రమించే
ఈ నా నేనూ మేనూ
నువ్వు శ్రమించి
కొత్తని సృజించి
కెవ్వను పాపలా
అమ్మకు దండలా
నాలా చూపిస్తే
నను వదిలేప్పుడు
నువు రాల్చిన
బంధం కోసేప్పుడు
నీ కన్నుల్లో నేచూసిన
ఆ పేగురక్తం
ఆనందార్ణవమై
చుట్టూ నవ్వులని నింపేస్తే
నువు చెప్పిన తథాస్తుదీవెన
నన్ను వదలలేదు తెలుసా!
నేను పెరిగేప్పుడు
నేను గాల్లో విసిరిన బంతి
నువు ఆడావేమో అటువైపు
కిందకు వచ్చి నాతో ఆడటం గుర్తు
నా ఆటల ఒంటరితనంలో
నేను చాచిన స్నేహపు హస్తం
నువు గాలై తాకావేమో అటువైపు
బంతిలా దొర్లివచ్చి నాతో ఆడటం గుర్తు
నా గీతల నిండుదనానికై
నేను కుంచెను ముంచిన క్షణం
నువు నింగిలో గీచావేమో హరివిల్లు
మదిలో నీసృజన నా చేతుల్లో కదలాడటం గుర్తు
నా భయం మునగడానికై
నేను నీటిపంచన పిల్లిమొగ్గేసినదినం
నువు నీటిలో ఎత్తావేమో అటువైపు
గాలిబుడగలా పైకొచ్చి నాభయం పోవటం గుర్తు
నా చదువుల పెంచడానికై
నేను బుడ్డి అగ్గిదీపం చూసిన రాత్రి
నువు వెలిగి నను వెలిగించావేమో అటువైపు
నీ కాంతితో నాచీకటి వెతలు బాపుకోవటం గుర్తు
నువు నాతోనే ఉన్నా
నా చుట్టూ వ్యాపించున్నా
నిను తెలుసుకునేందుకు
నిను కలుసుకునేంతవరకు ఆగాలా!
నిను వదలిన రోజే
నువు నేనైతే పోలా!
నేను నువు సృష్టించి
నువు రోజూ దీవించే
నీ ప్రతిరూపాన్ని!
నీ తథాస్తు రూపాన్ని!
No comments:
Post a Comment