Friday, May 13, 2016

అన్నదాత - ఆర్తరక్షణ

నువ్వెవరో ఎలావుంటావో
నాకు తెలీదు
నీ కుటుంబం ఏమనుకుంటుందో
నాకు తెలీదు

నేనెవరో ఏంతినాలనుకుంటానో
నీకు తెలుసు
నా కుటుంబం తినేదొకటుందని
నీకు తెలుసు

నీరు తడిసిన మట్టివాసన
వేరు కదలని మట్టినిచూసిన
మేరునగమును మట్టిపైచూపినా
నువ్వెవరో నాకు తెలీదు
అనేసి అడుగునుతీసే శక్తిచ్చావు
నువ్వు అడుగడుగడున గుర్తొచ్చావు
దేవుడిని వెతికే దారిలో నాతోడయ్యావు  

కనబడని గాలీ దేవుడైతే
కాల్చేసే అగ్నీ దేవుడైతే
కానల జాబిల్లీ దేవుడైతే
కిరణాల సూర్యుడూ దేవుడైతే
కనబడక కదిలించే కరుణించే
కానుపు కాటికి మధ్యన బతికించే
నువ్వూ దేవుడివే అంటోంది మనసు!  
నువ్వెక్కడున్నా దేవుడిలా దీవించి
నలుగురికి ఆరూపాన్ని నీలో చూపించెయ్
నేనడగకున్నా నువు చూసేది అదేనని
నాకు నేర్పిన మెదడు నీ చలవతో పెరిగిందే!
ఆర్తరక్షకా! శరణు శరణు!

(రైతుకోసం -  Sandhya Gollamudi, గోపీనాథ్ పిన్నలి గారికి కృతఙ్ఞతలతో)

No comments:

Post a Comment