Wednesday, May 18, 2016

సుమశరం

మొన్న వ్యాహ్యళిలో
చల్లటిగాలి పీలుస్తూ
ఘంటసాల పాటతో నడుస్తుంటే
నీకూ నచ్చిందా
అంతలా తలూపావ్
మరీ తాదాత్మ్యంగా

మనసులు కలిశాయని
మరో అడుగు ముందుకేసి
నాతో రారమ్మంటే
ససేమిరా అనేశావ్
మళ్ళీ తలూపి
ఈసారి అడ్డంగా

పోనీ ఓముద్దిమ్మంటూ
నీ రెప్పల దరికొస్తే
ఆ గాలి గోడెక్కి
నీ ముల్లు మల్లుడు
మీ తుమ్మెద బావ
నన్ను దూరంగా తోస్తే
నువ్వేమనలేదేం
తలూపి ఉండొచ్చుగా అడ్డంగా

దూరంగా నడుస్తుంటే
నువ్వూ నీస్నేహితురాళ్ళు
నావంక కొంటెగా చూస్తూ
వదలిన గుంపు గుబాళింపుబాణం
నా గుండె తాకితే
నువ్వేం చూడలేదేం
తలెత్తుండొచ్చుగా ఓరగా

నీవే నాకు భగవత్ప్రసాదితవని
దేవకన్యంత గొప్పవుగనకనే
నీతో కలిసి గుడికెళ్ళాలనుకుంటే
దేవుడికి కలిసి మొక్కాలనుకుంటే
నీవేంటి?
నేను దేవునికై పుట్టానని
నన్నూ ఆదేవుణ్ణే పూజించమని
ఆజ్ఞాస్త్రాలేసి ప్రేమతో బంధించి
ఆదేవుని మెడలో మాలయ్యావు
నన్నేంచేయమంటావు
నిన్నూ నీనాథుణ్ణీ కీర్తించటంతప్ప!

No comments:

Post a Comment