Friday, July 29, 2016

పక్షి విహారం

తెలీని కోనలో,
ఓ కానా! కనరవా అంటే
ఎగిరే రెక్కల కోసం,
ఎన్నేళ్ళు ఆగానో
కథల్లాంటి కలల్ని
కళ్ళతలుపులు తెరిచి
తనివితీరా చూట్టానికి!

ఒక్కరోజు రెక్కలనిస్తే
చక్కగా ఎగిరే స్వేచ్చతో
కానలకథలను పోగేసి
కబుర్లమాలిక అల్లివ్వనూ ఇలా!

కనులముందు రెండుచెట్లు
కొమ్మబంధాల్తో కోటద్వారంలా
పచ్చటి ఆకుల ముందుగుమ్మంతో
పద్ధతిగా స్వాగతంచెప్పాయి!

ఒక ముదుసలి మాను
నేలపై వాలిపోయాక్కూడా
ఆకులనే మనుమల్ని ఎత్తుకుని
మొదటి అతిథినైన నన్ను
ఇంట్లోకి ఆహ్వానించింది!

తన ఒడిలో ఉన్న పిల్లఆకులు కొన్ని
గౌరవంగా గాలికి ఎగిరి
నాకు అవ్వ ఒడిలోకూర్చునే
అమరత్వపు చోటిచ్చాయి!

అంతలో వేళ్ళూనిన మరో మాను
ఆటకు రమ్మంటూ
ఊడను వదిలింది నావైపుకు
నేను పదమనేలోపలే
ఊయల ఆటలు!

ఆటలో అలసిపోతాననేమో
కొమ్మ వింజామరలు
నెమ్మదిగా వీస్తున్నాయి!

ఆగిచూస్తే వర్షపు బిందువు
ఆకుచాటున నాకోసం
ఎన్ని ఘడియలు వేచిచూసిందో పాపం
నన్ను చూస్తూనే ఆనందభాష్పమై రాలింది!

అంతలో అలసి దాహానికి చూస్తే
అప్పుడెప్పుడో పడ్డ వానలా వుంది
కలువ కొలనును చేసి
నా ఆనందబింబం చూసుకోమంది
నీ ఆర్తితీరే పూజలు నాదగ్గరేనంది!

నాలుగు అడుగులు గాల్లోవేస్తే
నలుదిక్కులా జలపాతాలు
పరవళ్ళ పాటల్లో మహతీరవాలు
పూలపడవల్లో పుప్పొడి ప్రయణాలు
నిటారుచెట్లను చీలుస్తూ రవికిరణాలు
గాలినడకకు మొక్కల సహగాత్రాలు
ప్రతిదీ అథిధి సత్కారాలు చేసేస్తుంటే
ఆ రూపాలతోడులో జీవితం గడిపేయాలనింది
సంధ్యాకాంతుల్లో కరిగే విహంగవరం తెలిసి
సంబరాన్ని చూసానన్న తృప్తితో  ఇంటికి చేరాను!

మళ్ళీ ఒక్కసారి విహంగాలు దొరికితే బాగుణ్ణు!
నా మానసికోల్లాస గీతం నేనే వెతుక్కుందును!

No comments:

Post a Comment