క్షీరపు సాగరమందున
బీరపు దేవతలు వెదికిన బీదలు కారే!
సారపు యంచే నాకపు
దారను వారలు వెదికెడి దారులు వేరే!
భారపు మందర వినెను
కోరల వాసుకి వినెమరి కోరిన ధర్మం!
భారము నీదే యనుచును
కోరగ కూర్మమును మోసి కోర్కెలు దీర్చున్!
చలువల శశినీ విడిచిరి
విలవగు మాయమ్మ లక్ష్మి విడిచిరసురులే!
జిలుగుల కోరికలావును
వెలుగగు కల్పతరువొదిలి వెతలను గొనిరే!
చచ్చుటనాపుట చాలని
వచ్చుటనాపని వరముల వదులుటనేలా!
వచ్చును గరళము చావై
మచ్చుక ధైర్యము సడలి చెమరికే యొచ్చున్!
అరిచిరి సురలుయరులు చా
వరయగ చేరన్! గరళము వరముగ గనగా
మరచిన వానిని కొలిచిరి
హరహరయని సురలసురులు హరమును గావన్!
రక్షణకును రావాయన
తక్షణమే హరుడుజేరి తమమును గొనడే!
మోక్షపు దారుల మొదలని
రక్షణకును కోర రాడె రమముగ హరియున్!
వచ్చిన యమృత భాండము
చచ్చుట నాపుట పిదపని చవిగొన చిచ్చే
యొచ్చెను మొదలై, కావగ
నొచ్చిన మోహినిని కనులనోపగ జిచ్చే!
రాహూకేతుల జిత్తుల
బాహూలందిన శరీరభాగము లీలా
మహిమల ఖండము కావగ
ఆహా! ధర్మము తెలియగ సాహోయనమే!
ధర్మము అర్థము కామము
కర్మల జూపగ సురలను కథలుగ జూపన్
మర్మము జీవనమందున
ధర్మము నిలుపుట ననుకొన ధన్యతనొందున్!
మోక్షపు దారుల వెదికే
రాక్షసవర మార్గమంతను రావే వరముల్!
చక్షువులెక్కడ జూసిన
శిక్షణమక్కడ దొరకును శిరములయొంచన్!
మనమున ముదమును గానక
వనమును చరమును చలువను వదలకుమనియే
ఘనముగ నేర్పిన కతలివి
కనగను గరళము వెనకను కనుగొన సుధలే!
No comments:
Post a Comment