Friday, October 7, 2016

బల్లలకే కాళ్ళొస్తే

బల్లలకే కాళ్ళొస్తే
మెల్లగబెట్టితి ననుకొను మెచ్చే కాఫీ
చల్లగ జారిటుపడెనే
తెల్లటి కప్పెక్కడనగ తెలతెలబోయెన్!

బల్లలకే కాళ్ళొస్తే
గుల్లగు జేబులు తడిమిరి గుమ్మము బయటన్!
చిల్లర చేతులు తడవక
మెల్లగ జరిగినది ఫైలు మెచ్చరు ఎవరున్!

అరిచే రోజా నిలువగ
చరిచే నాయకుల నిలుపు చలనము లేదే
చరిచిన బల్లలు కదిలిన
విరివిగ దొరుకునవి గనరు విసరగలేరే!

బల్లలకే కాళ్ళొస్తే
పిల్లలు వెంటనె వదలగ పిచ్చివి బడులే!
కల్లలు నామాటలనిన
ఒల్లము రామని పరుగిడ ఒజ్జల గనరే!

బల్లలకే కాళ్ళొస్తే
జల్లను పడతుల మనసులు జరిగిన టీవీన్!
ఇల్లున దేదియు గనినను
చిల్లుల సొట్టల విసిరిరి చివరికి టీవీన్!

No comments:

Post a Comment