ఉల్లిపొరలా నా తెరలను నేను తీసుకుంటూ
నిన్ను చేరాలని నీకెంతో ఆశ
మల్లెతొనలా నీ స్వచ్ఛమైన తెల్లని గుభాలింపు
నన్ను చేరాలనా నీ నిశ్వాస
గడ్డిమొనలా నీకైన గాయలతో ఆ పొడుపు పలకరింపు
నన్ను తొలచాలనా వదలని ఙ్ఞాపకాలు !
గుడ్డివలల్లో నే పడకూడదనే నీ అంతఃకరణ శుద్ఢి
నన్ను గెలిచావనే నీ అద్దంలా చూపిన బుద్ఢి !
గరికపూలలా నే వదిలేస్తే నీవు పడిన కష్టాలు
నన్ను వదలకుండా నాతోనే నువ్వు గడిపిన మధురక్షణాలు!
నువ్వూ నేను - శ్వాసా నిశ్వాస
నాలో నీవు -నీ కవచమై నేను
నా ఉనికై నీవు - నీ కనులయి నేను
ఇద్దరం ఒకరమనే నడత
నువ్వున్నావని తెలిసిన రోజునుంచి
నాతో నీ తోడై సహగమిస్తోంది!
నాలోనే ఉండే నిన్ను
నీతోనే ఉండే నేను
తనివితీరా చూద్దామంటే
తనువొదిలి మాటాడదామంటే
బాహ్యప్రపంచం కప్పిన తొడుగొకటి
భారంగా అడ్డుపడిందా!
నీ జతగా ఉండాల్సిన నన్ను
నా లతగా ఎదగాల్సిన నిన్ను
నా వెతికే వెతగా మలచానని తెలిసేప్పటికి,
నా అడుగును వదలని నీ అడుగులు చూసేప్పటికి,
జీవితం శరీరంలా వయసుడుగుతోంది!
అలాంటిదేదీ నీకు తెలియదుగా?
నువ్వు నిత్యయవ్వనురాలివి!
నీకూ నాకే తెలిసిన మిత్రుడితో
నా నీ ఆలొచనల మేఘదూతం
అక్షరమై మెలిపెట్టాలా!
నువ్వే గుండెలని మీటి
ఎదసడివై వినబడితే పోలా!
అలా స్వచ్ఛంగా నీలా
"నేను" అనేది ఏదీ తాకని
నిరహంకారివై నీవున్నావనే
భగవత్ సాక్షాత్కారంలా
నాతో ప్రతిక్షణం ఉండిపోవా!
నా స్తుతి నీకే! నీకే!
నా నిరతి నీవే! నీవే!
నా గతి నీతో! నీకై!
నా సహజీవనచరీ!
నా మనసా! మనసా!
(మనిషి మనసుతో మాట్లాడుకున్న మాటలు)
No comments:
Post a Comment