ఎవరో నాటిన విత్తనం
వృక్షమై మనకు నీడ, పళ్ళు ఇస్తోంది
ఎవరో విసిరిన విత్తులన్నీ
విభిన్న ప్రకృతి రూపాల్లో
వనాలై పీల్చేగాలినిస్తున్నాయి
మనమేవీ నాటంటంలేదు
అంతరించిపోయేవి జంతువులేనా,
మన ఆనందం, నీరూ, శ్వాసా కాదా!
చిన్నప్పటి జమ్మిచెట్టుకు
చుట్టూ తిరగటం ఓ పండుగ
ఇప్పుడది గుళ్ళల్లో దర్శనమిస్తోంది పూలకుండిల్లో
ఎంత ఎదిగాం మనం సన్నబరుస్తూ!
పెరిగేప్పటి వేపచెట్టు పూవు
ఎక్కి కోయటం గుర్తోందా? అదీ పండగే
ఇప్పుడది చలిమరగదుల్లో ఉక్కపోతబడి దొరుకుతోంది
పక్కనే ఉన్న పుష్పవిలాపం చూస్తూ!
పల్లెల్లో తిరిగేప్పటి చెరువుపక్క మర్రిచెట్టుకు
దారాలు వేళ్ళాడదీసి ఊగటం అదీ పండగే
ఇప్పుడవి మరుజీవాలై ప్రదర్శనశాలల్లో కనబడ్డాయి
ఎంత వైఙ్ఞానికంగా ఎదిగాం మనం!
మారేడు గన్నేరు దేవదారు
మల్లె మరువం సన్నజాజి మందారం
కానుగ కొబ్బరి చివరికి కరివేపాకు
ఏదీ ఇంటివెనకా ముందూ లేదు
ఇంట్లో ధనాన్నిస్తాయనే తీగలు తప్ప,
మళ్ళీ ఎవరయినా విత్తనాల్ని పైనుంచి చల్లితే బాగుణ్ణు
ఇంకోతరం వనభోజనాలు వనవిహారం చేసుకోవడానికి!
ఆనందం ఆరుబయల్లో ఉంటుందనే ఆలోచన మొలకెత్తుకోడానికి!
No comments:
Post a Comment