విధి విధానం
-----------
సూర్య నమస్కారం -
అడిగే ఆస్కారం రానీనంటూ
ప్రభాతాన్నే దర్శనమిస్తున్నాడు!
చీకటి భయం -
విశ్రాంతికి అభయం తానంటూ
ప్రతిరాత్రీ దర్శనమిస్తోంది!
వెన్నెల ధనం -
చూసేవారి సృజనధనం నేనంటూ
మాసం చాటున సంపదై కురుస్తోంది!
ఋతువుల పిలుపు -
తామే తిథిఫలాలు చూసుకున్నట్టు
ప్రతి సంవత్సరం అందర్నీ పలకరిస్తున్నాయి!
కాసే ఎండ
వీచే గాలి
కురిసే వాన
విరిసే పూలు
ఎగిరే పక్షులు
జరిగే రోజులు
సాలీడు గూళ్ళు
గిట్టని రాళ్ళు
ఇవేవీ
నీతో మొదలవలేదు
నీతో అంతంకావు
అవి నేర్వరాలేదు
నువ్వు నేర్పనూలేవు
నేర్చుకోవటం తప్ప!
కర్మ యోగం
ధర్మ యాగం
జనన మర్మం
కాల ధర్మం
జీవితక్షణం
అమృత కణం
ప్రకృతి పక్కన
ఉమ్మడి అక్కర
తెలిసిన మనసులు
గడిపే క్షణాల
విధి విధానం!
No comments:
Post a Comment