Saturday, June 11, 2016

అన్వేషణ

జీవితంలో ప్రతిసారీ గమనం వెతికే
రెండు దార్లు
పాతని నిలిపేసి పాదముద్రల మార్గంలో
తెలిసిన నిశ్శబ్దయుద్ధం  !
పదమని నిలదీసే ముద్రల్లేని దారిలో
తెలియని చిరుధైర్యపుటద్దం!

గమ్యం చేరే గమనపు అన్వేషణలో
తప్పిపోయిన నేను
"నన్నే" తెలుసుకుంటున్న నేను!

ఒంటరిగా వెళ్తున్న కారడవి
కదలనీయని అడ్డంగా  పెద్దకొండ
అవతలేముందో తెలీని అమాయకత్వం
దొరకని చేతిసాయంకై ప్రార్థన
వరమయిన ఎగిరే కీలుగుర్రం
గట్టెక్కించిన గుర్రంపై రాజకుమారుడు
కొండపైన ఎక్కిస్తే
కిందంతా
పువ్వల్లే పొలాలు,
గడ్డిముంతల్లే లోయలు
భూమివింతల్ని మించే ప్రకృతినగాలు
కాలిచెంత మేఘమాలికలు
కాలికింద నాతో కొండెక్కిన రేణువు
మనుషులెవరూ కనబడట్లేదు
మాయమయ్యారో ఏమో?
కలకాని జీవితం
కలలా ఎదురుగా
కనబడి కథ నీదంటే
స్నేహంగా శాంతపు హృదయం
సృష్టి ఇచ్చిన స్వచ్ఛపు గాలి
ముందేమో మరి రెండు గమనపుదార్లు
ఎందులోనో మరో అన్వేషణ ?

తెలిసిన పాత కాలిముద్రల్లో
గెలిచిన యుద్ధం రారమ్మంది  !
తెలియని నగాలపై ముద్రేయాలని
ధైర్యపు అద్దం మనసయ్యింది!
ఆగని అనుభూతుల అన్వేషణలో
రోజూ తప్పిపోవాలనుంది!

నువుకోరే, నీవొదిలే
నీ గమ్యం, నీ గమనపు ఆనవాలు
"నీది" అనేదేదంటూ
నన్ను నేనే ప్రశ్నిస్తే
ఆత్రంగా అడుగు కదలి
నన్ను నేను తెలుసుకునే
ముందుమలుపుతో అదే పరిచయం వెతుక్కుంది
ఆగని అన్వేషణ మళ్ళీ పలకరించింది!


No comments:

Post a Comment