Monday, June 13, 2016

ఆకుపచ్చ హృదయాలు

నిటారుగా నిలబడి
పలకరించుకున్న రెండు జీవాలు
మాటలు కలుపుకొన్నాయి

చిన్నప్పుడు భూమికి జానెడెత్తులో
మొదటి సారి పరిచయమైన జ్ఞాపకాలు
మధురంగా నెమరేసుకున్నాయి

చుట్టూ ఆకుపచ్చచాపేసుకుని
వెన్నెల్లో చెప్పుకున్న కబుర్లు,
గాలి గిరాటెయ్యబోతే పడని ధైర్యపు ఆనులు,
చల్లగాలి నవనాడుల్లో చేరిన క్షణపు గిలిగింతలు,
వర్షం తడిసి ముద్దచేస్తే ప్రకృతి ఆచ్ఛాదనలో కౌగిలింతలు

కొమ్మాడించి చెవినేసుకున్నాయి

చుట్టూ పెంచుకున్న కుటుంబం
వయసుతో బలపడి ఎదిగిన స్నేహాలు
అన్నింటినీ ఆ పచ్చని చాపతో
కళ్ళముందే కాల్చేస్తుంటే,
దాహానికి నీళ్ళిచ్చిన కాలువ
నీళ్ళులేక మురికికాలువై
హర్మ్యాల కిందకి పోతే
మనల్ని ఎందుకు వదిలాడు చెప్మా
ఆ పర్యావరణ అధికారి అనుకుంటూ
సమాలోచనంలో పడ్డాయి

అంతలో అటు అంతస్థుల్లోంచి దిగిన
మరమెట్లయంత్రం
ఓ పిల్లాణ్ణి బయటకు పంపింది
ఆ పిల్లాడు బంతినెగరేసి
ఆ రెండింటి నీడపట్టున ఆడటం మొదలెట్టాడు
ఒక మనిషి చేతినిండా సంచీలతో
ఆ నీడలోకే చెమటలు కక్కుతూ వచ్చాడు
బాగా పరిచయం ఉన్నట్లు తలెత్తి చూశాడు
దగ్గరికి రమ్మని ఆడుకుంటున్న కొడుకుని పిలిచాడు
ఓ నిర్లిప్తత లిప్తపాటు చుట్టూరా
రెండు జీవాలు నవ్వుతూ ఊగాయి
ఆ మనిషి తన ఉద్యోగం కబుర్లు చెబుతుంటే విని
మా కుటుంబం ఎందుకు కాల్చేసావని
మమ్మల్ని ఎందుకు వదిలేశావని
హోరెత్తిన గాలితో కలిసి ప్రశ్నించాయి
ఆ రెండు చెట్లు!

No comments:

Post a Comment