తొలిప్రేమ
-----------
ఏమోయ్! నేను నీకు గుర్తున్నానా?
నువ్వు బలపం పట్టి
నల్లటి అద్దంలా వున్న ఆ పలకని
తేరిపారాచూస్తే
నీ కొనవేళ్ళు కదిలి ఒక్కటయి
నన్ను పరిచయం చేస్తే
నీ కనుల మెరుపయ్యాను
గుర్తొచ్చానా?
నువ్వు పెరిగి
ఓ రెండు గీతల్లో ఇమడలేక
ఇంకా వందసార్లు నన్ను చూడాల్సొస్తే
నీకు చేయిసాయం చేసి
నేను వొద్దికగా నీ చేయినొదలక
స్వేచ్చను ఒదిలి, రెండు గీతల్లో ఇమిడి,
నిన్ను గెలిపించాను
చేయొదిలేశావేం?
నేను నీవెంటే వుంటే
నీకు పెట్టే ప్రతిపరీక్షలో
నిన్ను గెలిపిస్తుంటే
పెరిగి పెద్దయ్యావని
పేరు తెచ్చుకు వెళ్తున్నావని
ప్రతి ఊరూ నీతోవస్తే
నీ ప్రతి రాతబల్లతో స్నేహంచేస్తే
ఇనుప అట్టలా మనసులేని దాన్ననుకున్నావా?
తెల్లటి మనసున్న కాగితాన్నీ,
సిరారక్తం ఇంకక తలపులను నిక్షిప్తం చేసిన నన్నూ,
అలా గాలికి వదిలేసి
వెళ్ళిపోయావేం నీకిది తగునా?
ఏదో పదేపదే సన్నాయినొక్కులతో
స్వేచ్చలేకుండా గడిపేస్తున్నావని తెలిసి
నిన్ను కలుద్దామని వచ్చాను
ఓసారి చేయికి పనిపెట్టి
తెల్లటి కాగితపు మనసు తెరిచి
నన్ను ఆహ్వానించు నీ మదినింట్లోకి
నీ వేళ్ళమధ్య కలంజోడీగా
మళ్ళీ ఆడాలనుంది!
నీ స్వేచ్ఛాప్రపంచంలో
నీ తలరాతలు చేరిన తీరం
నాకూ చూపించవా నేస్తం
నేను మధురాక్షరం చేస్తాను,
ఆ యాంత్రిక ఒంపుల్లో మా అందం
నీకెప్పుడు దక్కునోయి!
ఒక్కసారి నన్ను మళ్ళీ ప్రేమించు
నీకు నీ స్వశక్తిని పరిచయం చేస్తాను
నేను!
నీ ప్రేయసిని!
నీ రాతని!
No comments:
Post a Comment