Monday, June 20, 2016

సంధ్యగీతలు

సూర్యుడు వెళ్ళిపోతూంటే
ఆకాశం అడిగిందో ఏమో
ఆనవాలు రేఖాచిత్రాలు
ఎన్నో గీసిచ్చాడు
అరుణారుణ కిరణాల్తో!

గీచేబొమ్మలలా రోజూ మారుతుంటే
పరుగునాపి చూశారో ఏమో
కుంచెవాలకం కుదిరి చిత్రకారులు
ఎన్నో గీసిచ్చారు
సృజనాత్మక వర్ణాల్లో!

రంగులలా నింపుకుపోతే
బడివదలి చూశారో ఏమో
స్వేచ్ఛాపతాకాలై ఎగిరే బాలలు
ఎన్నో గీసిచ్చారు
ఆనందనర్తనా హరిణాలై!

అంతస్తుల గాజుకిటికీ పని దింపుకుపోతే
ఎదర ఖరీదైన చిత్రపటం చూశాడో ఏమో
బాల్యం రివ్వున కదలి ఆ యజమాని
తనలో తానే నవ్వేశాడు
క్షణపిచ్చి వదలిన జీవం తానై!

No comments:

Post a Comment