Sunday, August 31, 2014

వెళ్ళిపోయావా బాపూ

తలపెట్టిన వన్నీ టపటపా చేసేసుకుని,
కుంచెపట్టిన ఎన్నో బుడుగుల అడుగులెనకేసుకుని,
అటుచూస్తే, ఇటుచూస్తే, ప్రతి ఒకరూ,
చిరునవ్వూ, చేయూత నిస్తారని,
అనారోగ్యపు ఇరుకుతనం నీ 
రమణలేని కనులకు భారం చేస్తే,

అటుపొతే ఇటుపొతే అంతా
జంటలోని నిన్నొదిలేసి
ఒక్కడివే అని అడుగుతున్నారని, బాధించారని
కుంచెని విసిరేసి వెళ్ళిపొయావా బాపూ!

పెళ్లి పుస్తకం తెరిస్తే పత్రిక అచ్చులా పొందిగ్గా,
జంటసవరాల జడగంటలా నిటారుగా,
బతికేసి, తిరిగేసి,
రమణతో వాలుకుర్చీ కబుర్లకై
వెళ్ళిపొయావా బాపూ!

అందెల గోరింటాకు పారాణిలో,
అందాల రాముని పాదాలలో,
అచ్చతెనుగు అందాల వంకల్లో,
కుంచె జీవితమంతా గీసేస్తుంటే, అలసిపోయి
వెళ్ళిపొయావా బాపూ!

ఇంటిముంగిట రామాయణపు ముత్యాల ముగ్గులేసి,
ఇంతులముంగిట రయ్యిమనే మాటల మిస్టర్ల నిగ్గుతీసేసి,
సాహితి సంపదని పొదుపుగా బొమ్మల్లో తీర్చి,
చలనచిత్ర సంపదలా కళ్ళల్లో చెమర్చి,
వెళ్ళిపోయావా బాపూ!
వెళ్ళిపోయావా బాపూ!