Tuesday, June 27, 2017

శక్తి రూపాలు

గాలిలో ఎగిరే పక్షికి
గమనం గమ్యం యిదని తెలిపే నిర్దేశశక్తి

కాలికి తగిలిన ముల్లుని
కంటికి పరిచయంచేసే అతీంద్రియ వేగనశక్తి!

నీటిలో అప్పుడే పుట్టిన చేపకి
మొప్పలబలం నీదని తెలిపే శైశవశక్తి!

కడుపులో అమ్మపాటలు వినే బిడ్డకి
నీ ఉనికి యిదని తెలిపే చరణాల్లో ఉద్భవపూర్వశక్తి!

ఆకుపై కదలాడుతున్న గొంగళిపురుగుకి
పాకేందుకు సున్నితత్వాన్ని లెక్కచేయని ధైర్యాన్నిచ్చే సజీవశక్తి!

ఎక్కడో నీ ప్రమేయం లేకుండా పెరిగిన కానలచెట్టుకి
అమృతఫలాలనిచ్చి భోక్తలకై వేచిచూడని నిస్వార్ధశక్తి!

తినేబలం తెగువ వున్న వనరాజులకు
తినాల్సినదేదో తెలిపే బుద్ధికి కారణభూతమైన వివేచనశక్తి!

తాకాలన్నా తాకలేనిది ఒకటుందని తెలిపే వివేకశక్తి!
తాకితే తన జ్ఞాపకమేదో మైళ్ళదూరం ప్రవహించి తెలిపే జ్ఞాపకశక్తి!
తాకిన తరంగాలతో మనసును తాదాత్మ్యం చెందించే వినికిడిశక్తి!
తానే సృష్టికర్తగా లయకర్తగా జననావర్తగా నిలిచిన సుమసౌందర్యంలో సమ్మోహనశక్తి!

ఆ చైతన్యాలేవీ మానవనిర్మితాలు కావని
ఆ సుచేతనాశక్తులన్నీ బాహ్యవలయాలను దాటినవని
నీతో చెప్పేందుకు నడిచే దైవత్వం
నీలోనే వేలమైళ్ళు ప్రసరిస్తోంది
నీకన్నా ముందే నీలో పుట్టి పెరిగింది
నీవు వద్దన్నా చాటుగా నేర్పేందుకేవుంది
నీవే చూడగలిగే అదభ్యచక్షువుని తెరిచి చూడు!
నీలోని దైవత్వం వెలిగించి తరించు నేడు!

(జూన్ 27 2017 - చంద్ర రెంటచింతల)

Saturday, June 24, 2017

వెన్నెల తీరాలు

ఎప్పుడో ఎవరితోనో ఎక్కడో
అంకురార్పణకు ఆలంబమైన అభీప్సితబీజం
అభిరుచుల తీగలుగా ఎగబాకి
ఆనంద విహంగతతుల ఎదసడిగా ఎదిగి
పదపుష్పాలు పూయించి
ప్రతిరోజూ వెన్నెల్లో తడుస్తూంటే!

అదే వెన్నెల సిరివరమై
అత్యంతదగ్గరగా ఆత్మీయతతో
కనిపిస్తే వినిపిస్తే కలవనిస్తే కలలిస్తే
కలకాని కాలాన్ని కలంలా కదిలిస్తే
ఆ కలానికి, కలవరంలేని గళానికి
కలలు కనులుతెరిచి చూసిన కలువలై,
మనసుతరగలు ప్రశాంతతీరం తాకిన  నిలకడై,
మరోసారి నన్ను నాకే పరిచయంచేస్తే
మరోసారి గుండెలో వినిపించే పాటకు పల్లవి దారేది?
మరీసారి నన్ను నడిపే త్రోవలో తోడయ్యే చరణమదేది?

వెన్నెలలో తడిసిన తెమ్మెరతో తాకిన సౌందర్యసిరి
ఎదసవ్వడిలో చేరి చైతన్యమై వదలనంటే
ప్రతి ప్రశ్నకు సమాధానం ఎదలయనాదంలా తోచింది!
ప్రతి సమాధానం ప్రశ్నగామారే స్పృహాప్రమోదంగా నిలిచింది!

(24 జూన్ 2017)

Wednesday, June 14, 2017

పంచామృతాలు

ఆకాశంలో నీలపు నిర్మలత్వాన్ని
రంగూరుచిలేని నీళ్ళకు కలిపితే

భూమిలా తెలీని ఒరుసుపై తిరిగే స్థిరత్వాన్ని
తాడూబొంగరంలేని గాలితో కలిపితే

అగ్నిలా కణకణమండే భగ్నత్వాన్ని
అశరీరజ్ఞానం తెలిపే అంతరదీపపు వెలుగుకై కలిపితే

వాయువులా సర్వవ్యాపితమై పంచే జీవనాధారమూలాన్ని
తుచ్ఛపు పాంచభౌతికసుఖాలకై ప్రోగేసే మనుషులతో కలిపితే

నీటిలా పల్లానికి పరిగెట్టి తీర్చే అర్తిని
పరుల ఓటమి చాటుగా ఎదగాలనే అజీర్తికి కలిపితే
పంచభూతాలూ
జీవనపంచామృతాలే!

Thursday, June 8, 2017

మనోరాగాలు

గాలి నిశ్శబ్దంలో
పక్షుల గానమాధుర్యం
అవిశ్రాంతతని తరలిస్తుంటే
మనసు నిర్మలసంధ్యారాగాల్లో
గానకచేరీలు
జరుపుకుంటోంది

మొయిలు భారంలో
మెరుపు నవ్వులహాస్యం
చెణుకుచినుకులని నీవేనంటే
మనసు రవికిరణాలనీడల్లో
హరివిల్లురంగులు
పులుముకుంటోంది

కిటికీకంతల కాంతుల్లో
కిరణజనితం తిమిరసంహారం
చీకటిదాటిన కాలం నీదేనంటే
మనసు జ్ఞాపకాలనీడల్లో
స్వచ్ఛతకు చిత్రరూపాలు
మళ్ళీ వేయమంటోంది!

దశావతారాలు (సశేషం)

మత్స్యము
--------------
జగతికి జలమే మొదలని
ముగియుట ప్రళయంబుతోటి ముసిరిన ముప్పై
యుగధర్మము సత్యవ్రత
సుగతుల గాచుటయనునది సులభము జెప్పన్!

ఆపద సత్యయుగంబున
చాపగ చుట్టుకొను నీటిచాలంబనగాన్
చేపలు నీటను దిరుగని
మోపుగ మత్స్యంబు  సృష్టిమోక్షము జూపెన్!

ఘునమట ధర్మవ్రతమనుచు
మునులను సత్యవ్రతుడను ముప్పూటలనున్
మనమున సరియగుదానికి
యొనరగ పట్టంబుగట్ట యొచ్చెను హరియే!

మొక్కెను అర్ఘ్యము తోడను
మొక్కుట నాపంగలేడు, మొరలన లేవే!
చిక్కులబడబోవు క్షణ
మెక్కుట కేరూపమొచ్చు? మెట్టననేదీ?

మనమే ధ్యానమున నిలిపి
తనవను చేతులను జాపి తర్పణమియ్యం
గనబడె మత్స్యంబొకటట
వినమనె నాకాశవాణి వివరము దెలిపెన్!

రాజా! రక్షణనివ్వుము
మా జాడల


విలయము ముంచునటంచును
వలయము గట్టిన మిగలని వహ్నికి తానే
జలచరమత్స్యపు నావగ
విలువలు దాటించిగాచె విష్ణువు తొలుతన్!

క్షీరసాగరమథనం (కూర్మము) 
-----------
సుగతుల సుఖమును వెదుకగ
వగచెడి వారికి తెలుపను వరమగు కథలే
సుగమపు సాహిత్యమనుచు
సుగతుల జేర్చిన కవులకు సుమమిడి గొలుతున్!

సరియగు ధర్మంబేదీ?
సరిగను మార్గంబు నేది? సరి గురువెవరున్?
సరిగన దెలియంగ నెటుల?
సరికర్మలు జేయనేల? సరివాడెవరున్?

సురలను సూక్ష్మంబేదీ?
సురలను నసురులను జూడ సుఖమెటు దెలియున్?
సురలకు రక్షణయేలా?
సురలకు శాపంబులేల? సుగతులెటొచ్చున్?

కరముల కార్యంబేదీ?
వరముల నాంతర్యమేది? వరగర్వములే
శరణను యొక్కడు నెవ్వరు?
హరిహర సంబంధమేది? హరియన నేమిన్?

శరముల జంపని యసురులు
వరయుత వరులగు సురలును వదలక గలిసే
తరుణపు ఫలమననేదీ?
వరదాభయుడే వదలని వరమగు నెపుడున్?

అమ్మలయమ్మ జనించును
నమ్మకమేయున్న విషము నటరాజు గొనున్!
నమ్మిన సన్మతభక్తియు
సొమ్మగు మోక్షపు తెరగుల సొగసిల గనునే!

కథగన కశ్యపసుతులే
మథనము జేయగ కదిలి రమరులును మరులే!
కథవిన గతిగను రథమును
మథనము జేయుచును నడుపు మహిమల కథయే!


తొలుతను నీరే నిండును
కలియును భువిలో మృతిజల కచ్ఛపమనిరే!
బలమున మోయును కొండను
కలుగును కామితము కోరిగష్టము బడగన్!

పోవును ధనమును గర్వము
పోవును రాజ్యము వినయముబోవగ మతులన్!
పోవనిదేదో తెలిసిన
పోవలసినవాని జేరు పోరచి గనరే!

దనుజుల గెలిచిన విజయము
తనదే మరి గొప్పయంచు తలకెక్కినదే
ధనఘనగర్వము నింద్రుని
వనచరుడే మెచ్చీ నిచ్చు వరమగు శాపం! ||10||

రుద్రుని రూపము వాడును
ఛిద్రపుమది తిరిగి జూచు చిద్రూప ఋషిన్!
భద్రము నేర్పెడి వాడును
నిద్రను మేల్కొలుపువాడు నియతిగల యతిన్!

వచ్చెను దుర్వాసుడచట
మెచ్చిన వాడై మదగజమెక‌్కిన రాజా!
తెచ్చితి పూవులదండని
ఇచ్చెను సురపతికి నిచ్చి ఇచ్చకములనెన్! 

వచ్చిన గర్వపు పొరలే
వచ్చిన మంచిగని దింపు వలలగు నెల్లన్!
వచ్చిన హరిపుష్పములే
విచ్చుకు గనరాని మదిని విరులగు అరులే!

కరమున తాకిన విరులట
వరమని జెప్పంగలేవు వరసురపతికిన్!
కరములు గజమను మదమును
విరులిడి బూజింపనేల విషగతి నెగరన్!

సురపతి సరముని కైగొని
వరగర్వమున నిభరాజు వైపుకు విసిరెన్!
తరుముకు వచ్చెడి కర్మల
భరమా! గజరాజుకైన భక్తిని గనుటన్!

గజమా విరులను గొనెనే
నిజముగ మదమిదని జూపి, నిశ్చేష్టులయే
భజనల మునివర్యులుగన
గిజిగిజి దొక్కేసెనచట గిరిధారివిరిన్!

వచ్చెను కోపము మునికిని
రెచ్చిన సురరాజు సిరులు రెల్లుసమము గా
నిచ్చెను, విమోచన యడుగ
నిచ్చెను కమలభవ మార్గనిర్దేశనన్!

నెపమున నేర్పరి జెప్పెను
తపముగ మంరను దెచ్చి తరగల దిప్పన్
జపముల నక్కరలేకను
రిపులను దునుమకయు పెద్దరికమును యొచ్చున్!

క్షీరములను మందరనిడి
మేరగ మృతపు భాండమేదని యనిరే!
కోరగ కూర్మము తానై
భారము నిలిపిన హరిగన భాండములేలా!

దనుజులకనుజులు వారే

మనుజులు గోరేటి నాకమధిరోహకులే!
జనుమలు లేరను వారే
కను కడగండ్లను పురాణకతలున వారే!    ||20||

క్షీరపు సాగరమందున
బీరపు దేవతలు వెదుక బీదలు కారే!
సారపు యంచే నాకపు
దారను వారలు వెదికెడి దారులు వేరే!

ఉండును దేవతలందును

యుండును దానవులయందు యుండుట తథ్యం
ఉండును నీలో నాలో
యుండుట నంతర్యమనుచు యుండును హరియే!

పుట్టుక కమలభవు వరము

గిట్టుట గిరిజాతమరుని గిరి దాటదనిన్
తట్టుకు జేర్చెడి ధర్మము
పట్టుకు నడిపించువాడు పరమాత్మ గనన్!

అడిగిరి బలిగని సామ్యత

నడిగినదేదన కడుమల నడతయె ఘనమై
యడిగిన దిరువురి కెరుకని
జడియుట తరమా తమకని జతగొనిరరులే!

చిలికిరి పాలసముద్రము

చిలికిన కామితములొచ్చు చిరమాయువనిన్
కలిమిని కనులను గలిగిన
బలిమికి వయసనునదేది బలికర్మకిలన్!

కావలె కవ్వము జిలుకను

కావలె దిప్పంగ తాడు కావలె జనముల్
కావలసినన్ని దెలుసని
కావలినేమరిచి గదుల కావరమనరే!

తోకను బట్టిన వారలు

మూకగ గూడిన యసురులు మూఢులు తామై
నాకము జేరను పడగను
తాకగనే గోరినారు తాపమదేలా!

ఎవ్వడు నెత్తెడి వాడట
నెవ్వడు యెత్తంగ దెచ్చు నెలవుల తావున్
ఎవ్వడు నిలిపెడి వాడు మ
రెవ్వడు దిప్పెడి ఘనుడును నెవనికి దెలియున్?

కమ్మిన జీకటియు దొలగి
నమ్మిక గలిగించు వాడు నమ్మకపు దొరన్!
పొమ్మిక యనలేని ఘనుడు
తమ్మిక పాదములనిడను తమమును దీయున్!

ఎత్తెను పర్వతమును హరి
సత్తువ గలిగిన గరుడుని సహితము నెగరెన్
సొత్తును జూచిన చందము
మొత్తము తాజూచెనచట మొత్తము తానే!      ||30||

చూచిరి గిరినీ హరినీ
చూచిరి గాచేటి అహిని జూపే వానిన్
కాచిన పరమాత్మ దెలుప
వేచిన వాసుకిని జూచి వేడిరి తోడున్!

తిప్పిన తనకే మగునని
ముప్పని యడుగనిది సర్పము హరిని గననై
యొప్పుకొనెను కవ్వముగను
తప్పులు నేముండు హరియు తమతోడుండన్!

జారెను గిరియే దిరిగిన
కోరిన నాపంగలేరు కోరిక ఘునులే
పారము బొందగ జూచిన
సారము పమాత్ముడనుచు సాగిలబడిరే!

పెరిగెను పరమావధులను
బెరిగెను సంద్రంబుయంత పెద్దయు తానే
పెరిగిన తానే నీటను
యొరిగిన పర్వతమునెత్తె యొద్దిక తనపై!

నీటను తిరిగెడి కూర్మము
మేటను దిరుగాడుచుండు మేధిని దిరుగున్
గాటను గట్టని తానా
చోటను భగవానుడంట చోక్షము గనినన్!

మోపున నిలిపిన మందర
యూపున దిరిగెను తనపరి యూధము కరమై!
కాపుగ నిలిచిన దనుజులు 
చూపుల గానంగ హరిని చూచిరి వరుసన్!

పట్టని సర్పంబు తలను
పట్టగ, పట్టిన బలిమిని పట్టుదలిదనిన్
జట్టుగ నరిచిన దైత్యుల
పుట్టెడు బలమంతబోయి పుట్టెను జెమటల్!

భారము మందర మోసెను
కోరల వాసుకి వినెమరి కోపము లేకన్!
భారము నీదే యనుచును
కోరగ కూర్మంబు మోసి  కోర్కెలు దీర్చున్!

చల్లని వాడట హరియే
పల్లము బడబోవు గిరిని పట్టుకురాడే
ఉల్లము కూర్మంబైనను
మెల్లగనటు పక్కనుండు మెచ్చెడి దొరయే!

తిప్పిన యొచ్చెడి తరగల
యొప్పిన వారచటలేరు యొక్కక్క తలం
దిప్పిన వెనుకాడు జనుల
తప్పక తప్పనిదియొచ్చు తప్పనిదొచ్చున్!        ||40||

ఎత్తిరి దిప్పిరి దిరిగిరి
నెత్తిన మరణపు బరువును నెత్తగ దిప్పే
చిత్తము లేపరి జూడం
గొత్తగు కర్మల ఫలమది కోరిక విషమే!

ఎంతటి సుఖములనైనను
సుంతగ కష్టములె మొదలు సుందరమునదే!
వింతగ యున్నను తదుపరి
కంతల దాటంగవలయు కంకటము గనన్!


భుక్తియు ఖర్మల బోయిన
భక్తియె కరుగక నిలిచియు భగవాను గనున్!
యుక్తిగ మథనము జేయును
ముక్తిని కంటకగరళము ముక్కంటిగనున్!

విషమను విషయము హరిగని
మిషగొని హరుడిని గనమని మిక్కిలి జెప్పెన్!
విషమే మరణపు కరణము
విషమును జేపట్టువాడు విశ్వాత్ముడనెన్!

జగముల మూలము తానై
యుగముల దాటించు చరణయుగ్మము తనదై
భుగభుగ గరళము యొచ్చిన
నగవున నారాయణుడట నభవుని జూపెన్!

హరుడన మురహరి మనసే
హరిణపు మనమే వెదికెడి హరియును యొకరే
హరణాభరణము దాల్చిన
హరునికి హరియే గురువన హరిహరులొకరే!

పోవగ పొగిడెడి వారల
కావగ వచ్చేటివాడు కావటివాడున్!
చావగ నాపేటి హరుని
సేవకు తామేలబోరు శేషాత్ములిలన్!

వచ్చిరి బొగిడిరి మెచ్చిరి
నిచ్చికముల నాడలేరు నిచ్చోటనినన్
వచ్చిన వారే పిల్లలు
మెచ్చగ రక్షింతునంచు మెరిసెను హరుడే!

శివుడే భవుడను వరుడని
రవములు గలిపిరి హరమున రక్షయు నీవే
జవములు యుడుగును రమ్మని
శివమే భవతారకంబు శితమని వేడన్!

అడిగిన యతడే గొడుగని
నడిగిన మరుతడవ దాను యడుగుల గదుపున్!
అడిగిన వెనుకాడడనుచు
నడిగెడి వాడు భవహరుడ నడిగిరి రక్షన్!
||50||

నారాయణి నారాయణు
డేరీతిని పతిని గాంచి నేమనుకొనెనో!
కోరిన కంఠాభరణపు
కోరిక తీర్చుట గనెనట కోమలిగాదే!

అడుగుట నాపడు గిరిజను
నడుగుట ధర్మంబనియును నడతని యడుగున్
అడిగిన వద్దని యనదే
అడిగెడి వాడే హరుడని నమ్మకమేమో!

మంగళకరమౌ మంగళ
అంగనయైయున్నవాని కందరివానిన్!
మాంగల్యంబును గాచెడి
మంగళమగు తోడు సర్వమంగళ గాదే?


చేయుము మంచినటంచును
చేయిని యందింపునమ్మ చేతగు శుభమే
చేయగ వెడలెడి మరునికి
చేయందించుట సతులకు చేవగు బలిమే!

చచ్చుటనాపుట చాలని
వచ్చుటనాపని వరముల వదులుటనేలా!
వచ్చును గరళము చావై
మచ్చుక ధైర్యము సడలి చెమరికే యొచ్చున్!

అరిచిరి సురలుయరులు చా
వరయగ చేరన్! గరళము వరముగ గనగా
మరచిన వానిని కొలిచిరి
హరహరయని సురలసురులు హరమును గావన్!

రక్షణకును రావాయన
తక్షణమే హరుడుజేరి తమమును గొనడే!
మోక్షపు దారుల మొదలని
రక్షణకును కోర రాడె రమముగ హరియున్!

వచ్చిన సురగని యొదిలిరి
మెచ్చెడి అప్సరసలగన మెచ్చియొదిలిరే!
నచ్చిన కౌస్తుభమొచ్చిన
మచ్చిక జేయక విడిచి రమరతను గొనగన్!

కోరికల గుర్రమొచ్చెను
కోరికలనుదీర్చు జంట కోరంగొచ్చెన్ !
కోరికల నైరావతమును
కోరికగా మోయరాగ కోరికలేలా!

వచ్చెను శ్రీదేవి సిరిగ
యొచ్చెను సంద్రంబునందు మొక్కెను జగమే
మెచ్చెను పరమాత్ముగని
నెచ్చెలి హరివిడువబోని నెపమయ్యొచ్చెన్! ||60||

హరియే సిరికంటి మరుడు
సిరియే హరికెడదరూపు సితమది జగమున్!
వరుడే హరియయ్యుండగ
సిరియే వధువాయెనంట సిరిగనిరచటన్!

హరినే కూర్మము జూచును
సిరియే సరిజోడటంచు శిరమును గదుపున్!
హరియే రూపములన్నిట
సిరియే నడిపేటి శక్తి సిరిసంపదయున్!
 

నారాయణి నారాయణు
నోరగనుల జూచువేళ నోపగ లేడే!
నారాయణి రూపంబని
నారాయణునకు దెలుసును నాథుడు తానే!

వరమాలవేయు తల్లిని
వరమని గాంచంగ నొచ్చె వనజభవుడునున్!
కరముల కమలములను గొని
సురమునిగంధర్వులెల్ల సుగతుల గనిరే!

సిరి కరముల వరమాలయె
హరికంఠము తాకగోరె హరిభూషితమై
హరితాకిన పూమాలయె
సిరిగళమున సొబగులబ్బె సిరి శ్రీహరిదిన్!

చలువల శశినీ విడిచిరి
విలవగు మాయమ్మ లక్ష్మి విడిచిరసురులే!
జిలుగుల కోరికలావును
వెలుగగు కల్పతరువొదిలి వెదికిరమృతమే!

వచ్చిన యమృత భాండము
చచ్చుట నాపుట పిదపని చవిగొన చిచ్చే
యొచ్చెను మొదలై, కావగ
నొచ్చిన మోహినిని కనులనోపగ జిచ్చే!

చరముల గోరికల తుదను
వరమనునటు మోహమొచ్చు వదలని మనసే
శిరమును తిరముగ నిలిపిన
శరణాగతిజేయుచు కలశపమృత మొచ్చున్!

మనసున సాధుతనుంచుకు
మనదను పోరొకటి నడుప మనసు వెదికినన్
మనతో నుండును దైవము
మనసున నిండును సుధలని మహతిని దెలుపున్!

జగదోద్ధారకుడు ప్రభువు
జగముల సంపదల రాణి జననిగ యున్నన్
జగమున సర్వంబెరిగియు
జగజంతపు మోహమలర జడి నాపుటెలా?      ||70||

కలశపు ధన్వంతరిగని 
నిలకడ మరిచియును దూకి నిస్సిగ్గమరన్!
కలశమునే దీసికొనియు 
సలసల బరుగెత్తినారు సహజత నసురుల్!

చూచిరి ధర్మపు వానిని 
జూచిరి దారేదటంచు చూపుల భయమున్!
నోచిన నీదే శరణని
గాచు జగన్మోహినిగను కాపరి హరియే!  

రాహూకేతుల జిత్తుల
బాహూలందిన శరీరభాగము లీలా
మహిమల ఖండము కావగ
సాహాధర్మము దెలియగ సాహోయనమే!

ధర్మము అర్థము కామము
కర్మల జూపగ సురలను కథలుగ జూపన్
మర్మము జీవనమందున
ధర్మము నిలుపుట ననుకొన ధన్యతనొందున్!

మోక్షపు దారుల వెదికే
రాక్షసవర మార్గమందు రావే వరముల్!
చక్షువులెక్కడ జూసిన
శిక్షణమక్కడ దొరకును శిరములయొంచన్!

ధీరంబగు భర్తయె గిరి
భారంబగు కాలమందు భావగతుల సం
సారంబను సాగరమున
జారంగను వదలనీక జారక నిలుచున్!

జీవితభారము మందర
జీవనమును బడకయుంచు జీవాత్ముడిలన్!
జీవన సాఫల్యమునకు
జీవితకాలమ్ము జూపు జీవకమథనం!

సతిగని హరిగను దూరము
జతగొని సాగరమునంత మథనము జేయన్!
ఇతములు వెతలును జతగా
సితముగ నొచ్చేటి వేళ సిత్రమదేలా!

మనముుున యొదలని మహితను
 
వనమును వరమును చలువను వదలకుమనియే
ఘనముగ నేర్పిన కతలివి
కనగను గరళము వెనకను కనుగొన సుధలే!

ఆశలపాశము లొచ్చును
కోశము నింపెడివి కొన్ని కోతలుగొచ్చున్  
కాశువు విడువక చిలికిన
వాశిగ దహనంబు వెనుక వాసియునొచ్చున్!             ||80||

అఙ్ఞానము కోరికలిల
విఙ్ఞానము గతిదెలిసిన విడువక జనుటన్!
సుఙ్ఞానము సూక్ష్మపెరుక
ప్రఙ్ఞానము జేయుబనుల ప్రకటితధర్మం!

చిలికిన మనముల ధర్మము
బలమును అబలులను గాచు పరితాపమవన్!
జలజల గరళము యుబికిన
కలకలమున కణితి దెలియు కలితాత్మభవున్!

కనులను దెెరిచిన కలయగు
కనులను మూయని వరులకు కష్టములేలా?
కనుటకు కాననిదేదన
కనుగొను కథనంబు దొరుకు కరములలోనే!

పుట్టుట గిట్టుట తప్పదు 
ముట్టని వెతలెక్కడుండు? మురిసేదెవరే? 
జట్టగు ప్రార్థన తెలిసిన
గట్టుకు జేరేటిగతుల గమనము దెలియున్!

సురలసురు లాశ్రిత రహిత
మిరుగడ జనులై వరముల నిమ్మను వరులే
మరుగడ ధర్మము దప్పగ
నరులై నహితమును జంప నరహరి యొచ్చున్!



కనుగను మోక్షఫలంబుల
వినినను విశదంబు వెదుకు విఙ్ఞానమునే
మననపు పదపద్మంబుల
మనసున భారతికి నిడితి మది పదమయ్యెన్!

వరాహము
-----------
భువినే దిరిగెడి చరములు
రవిగన మొదలగు జనితపు రక్షణగాగన్
భువిపై వేదంబులనెడు
భవతారక మంత్రములకు భర్తగ నిలిచెన్!

హరియన వరాహరూపుడు
హరియన వేదముల రక్ష! హరినే గనగన్
అరుల వెతికి రనిమిషులే!
హరిగన పెదవులనెనె నరహరియను పదమే!


నరసింహుడు
-------------
నరుడే హరియై యున్నను
హరమునకు చరము నగునడదనహంకారమునన్
చరముల నగుపడని చర
హరవరమొంద, నరసింహమయ్యెన్!

నర చరములగను హరియే
హరము  నహంకారమునన్
వరముగ వందల ఆంక్షల
హరమేదని ఖలుడన నరహరియే గదిలెన్!

బాలుడు ప్రహ్లాదుడుగనె
సోలి హిరణ్యాక్షుడును సోమకుడన గనిరే
జాలిని నీవే కనవని
పాలిత జనులంత యేడ్చు పాలకుడేలా!

Monday, June 5, 2017

సరిగమపదని

సరిగని నిగమాగమమని
మరి పదమాపని దరిగని మమపదమమరీ
గరిమ నిగనిగని పరిదని
సరిమగమన మరి సమాసగరిమ సగమా!

Saturday, June 3, 2017

ఋతుశ్చక్రాలు

శిశిరం వచ్చెళ్ళింది
నిన్న కనులకివేవీ లేవు!
వసంతం సృష్టించింది
నేడు, కనువెలుగుల తావు!

పగటివేగం పరిగెత్తించింది
చతుశ్చక్రాలు కనులకే కనరావు!
చీకటి శాంతితో నిలిపింది
అచేతనారీతి కలలరూపాల వెలిమావు!

చుట్టూ కదలకపోతే కదిలాననుకునే నీవు
చుట్టూ కన్నులనార్పని కమలాలనేల కనలేవు?

తొలిచే ప్రతివిషయం
తెలవారుపున తెలుపు కథంటే!
తెలియని ప్రతి సమాధానం
తిరిగే ఋతుశ్చక్రగతి నీదంటే!
తెరగు తెలిసిన జ్ఞానాంకురాన్ని
వయసువసంతంలో పెంచి
శిశిరగమ్యానికి చేర్చే
సజీవమూర్తి చేతనతో
సృష్టి అందంగా నిన్నే మలచుకోవడం, నీవు!

పిపీలికంలా  ప్రపంచం నాదేనంటూ
ప్రతిసృష్టికి పరమావధిమంత్రాలు సృష్టించానంటే
కదలదనుకున్న ప్రతిదీ ఒక్కక్షణం కదిల్తే
ప్రళయమనే పెనుభూతానికి పుట్టుకవు, పరిధివే నీవు!

(చంద్ర రెంటచింతల - జూన్ 3 2017)