Tuesday, November 29, 2016

నేను

కళ్ళల్లో నీళ్ళసరస్సు
గూళ్ళు కట్టుకున్న అనుభూతిపక్షులు
ఈదుతూ అంచుల్లోపలే బతకాలంటుంటే
ఈదురుగాలి అలలుచేసి నడిపిస్తోంది
గూళ్ళు చెదరనీయని జ్ఞాపకాలపుల్లలను
ఏరుకుంటూ
నేను
నేనే అనుకునే నేను!

పైనుండిపడ్డ ఒక నీటిచుక్క
తనను వదిలేసినా మరవని కళ్ళు
సరస్సును రెప్పలపొరల్లో దాచి
పక్షులను కాపాడుకుంటున్నాయి
వాటిని తటీతీరాన
వెతుక్కుంటూ
నేను
నేనూ అనుకుంటూ నేను!

Tuesday, November 22, 2016

బాలమురళి

మురళినిబట్టెడి బాలుడు
సరళముగా పాడుకొనుచు సరగున నెగసెన్
వరముగ దొరికెను తెలుగుకు
సరమే స్వరపేటికంచు సరిగమ మురిసెన్!

నగుమోమున నగుమోమును
జగమున తత్వము తెలిపెడి జతిగొన తానే
వగచుచు శోకము పాడిన
జగదానందకృతివిను జగమున తానే!

థిల్లానల ధీమంతుడు
సల్లాపముజేసె తాను సహవిద్వత్తున్!
అల్లాడించెను యందురు
ఉల్లాసము మదిని జేర నుర్వేమెచ్చెన్!

ఎందరు మహానుభావులు
అందరితో కలిసితాను నందముజేసెన్
వందలలో యొకడందురు
అందని రత్నము తనకును అందగలేదే!

తృష్ణను పాడెను మురళీ
కృష్ణుడు రాముని పొగడెడి కృతులను పాడెన్!
నిష్ణాతుడు భావమునే
విష్ణుపదముజేర్చి తాను విష్ణువుజేరెన్!

Sunday, November 20, 2016

శంకరుజేతిన శరమా?
వంకలు వాగుల దుమికెడి శశిచెలి శరమా?
అంకపు శైలజ శిరమా?
వంకలుబోగోరు యక్షరవంకీ శిగవే !

Friday, November 4, 2016

జెన్ కవిత


1.
ఆరని రాత్రి
నీటిచుక్క చప్పుడు
నేనన్న శబ్దం!
2.
ఏటి తారలు
ధాటి శీతవర్షం
నిశ్చలత మాయం
3.
కారడవి నిశ్శబ్దం
పడిన పండు
నీటి చప్పుడు!
4.
వడగండ్లవాన
అగాధ అనంతాల
ఏకాంతము
5.
చలి నిర్జనత
వాననీటీ తొట్టి
పిచ్చుకల ప్రయాణం!
6.
మసక సంధ్య
మసలిన గతం
మోస్తరు దూరం
7.
జెల్ల పిల్లిమొగ్గ
మేఘం కదలిక
కాలువ పిల్లగట్టులో
8.
పడిన పుష్పం
కొమ్మనెక్కుతుందా?
సీతాకోకచిలుక.