Saturday, December 31, 2016

2017

నూతనవత్సర మన్నను
పాతను తరముటయె గాదు పాఠము గొనియున్
జోతలువెట్టెడి శుభముల
చేతలనే జేయగలుగ చేరును శుభముల్!

కోతల కోరికలున్నను
జాతకరీతులు గదలవు జాముల నడిమిన్
చేతగు మంచిని పంచగ
చేతులు గదిలెడి మనసులు చేరును సుగతుల్!

Monday, December 26, 2016

దంగాల్

దంగాలంటూ పిల్లలు
కంగాళముజేయరంట కంచే గొనరే!
బంగారము దేశమునకు
నంగనలకు ధైర్యమిచ్చునంతగ గనరే!

పరుగున కూతురి జూడను
కరిగెను గుండెలు గనగను కరతాళములే
సరియను శబ్దములీవని
పరుగిడి మోతన కలిసెను ట్టులుబట్టన్!

అమ్మా! చేయగలేమని
చెమ్మను జార్చుటనునాపి చెవులను వినిరే
అమ్మానాన్నల మాటల
నమ్మిక నిలపగ గదిలిన నవయుగ వనితల్!

జాస్తిగ జేసెడి నటనను
కుస్తీపడి జూడు జనత కుశలము గావన్
కుస్తీయాస్తిగ గలిగిన
బస్తీవనితల గెలుపును బలమై గనరే!

Friday, December 23, 2016

అనాతపసుధాకోశం

ఆకాశంలో సూర్యకిరణాలు
చేరే వేలమైళ్ళ కోణాలు
నువ్వూ నేనూ
నీడన నడిచే జీవితకాలం పచార్లు!

రాత్రంటే వెన్నెలరేలా
జార్చే అమృత ప్రకృతివనాలు
నువ్వూ నేనూ
నీడలజాడన వెలుగుగాలం జాలర్లు!

ఎత్తైన పర్వతం
పైనెక్కడో మేఘాలు
పెరిగేసిన చెట్టూగుట్ట
ఎదిగానను ఆకాశహర్మ్యాలు
వెలుగు తలల వంచి
చూపే నీడపట్టు మంచి
మేమిచ్చాం బదులేదంటే
మనసంతా వెలుగును వెదికి
మనదనే నీడనుజేసి
మనుగడనే చదవమనింది!
అన్యోన్యాశ్రయ విడిదుల్లో
ప్రకృతి ప్రభాతభాసం
సహధర్మ సావాసం
అనాతపసుధాకోశం!

Sunday, December 11, 2016

భావశిల్పాలు

జారుతున్న నక్షత్రం
చేరుతున్న వానచుక్క
పారుతున్న నది
ఇవేవీ నావి కావు
కానీ ఆనందాన్నిచ్చేవే!

ఎత్తుని తక్కువచేసే చెట్టూ
చిత్తుగ ఓడించే పర్వతం
కొత్తగ అందంజూపే హరివిల్లు
ఇవేవీ నా అసూయకు చేరవు
కానీ ఆనందాన్నిచ్చేవే!

మైళ్ళు పైకెడుతున్న నీరు
మళ్ళీ నీకే అంటున్న మేఘాలు
కుళ్ళు తాకనీయని పసిరూపాలు
ఇవన్నీ నా కనుభావనలే, మారవు
అన్నీ ఆనందాన్నిచ్చేవే!
అన్నీ
చేరినకాలం
చేరేగమ్యం
చేవను మర్మం
చేసే భావశిల్పాలే!

Friday, December 9, 2016

రెండాకులు

కొమ్మపై రెపరెపలాడుతున్న రెండాకులు
అమ్మను తలుచుకుని విడివడక ఊగాయి!

కన్నీరు పన్నీరుగా మారి
శశివదన వైపే చూస్తోంది

కరుణవదిలి నిధికి దారేదంటే
కావలి స్టాలిను దారెతుకుతున్నాడు!

వెనక శశివదనే శశివదనే
ముందు చిన్నమ్మా చిలకమ్మా
పదేపదే వినబడుతున్న పాట
వదలని అదే పూనకపు ఆట!

పాట మారి ఒక రోజయ్యింది

అంతకుముందు
ఎవరికెవరు ఈలోకంలో
తర్వాత లలిత ప్రియ కమలం
అమ్మంటే అమ్మరా
వస్తునేవున్నాయి

మధ్యలో
ఒక గుండె ఆగి
రెండాకులు మళ్ళీ చెట్టెక్కాయి!
పాటలు మరొక్కసారి!