Saturday, May 20, 2017

సిరివెన్నెల

చుట్టూపక్కల చూడరా అంటే
రోజూ దయని కళ్ళల్లో పెట్టుకుని చూస్తునే ఉన్నా!

నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటే
రేయింబగళ్ళ తేడా మనసుతో వింటూనే ఉన్నా!

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటే
సిగ్గుని పెంపొందించుకునే అక్షరంగా మారుతూనే ఉన్నా!

కలలను కళ్ళతో చూస్తూ పదమంటే
వేదంలా రోజూ వింటూ కళ్ళను తెరుచుకు తిరుగుతున్నా!

మునుముందేదో తెలియని చిత్రం అంటే
ప్రతిక్షణాన్ని ఆనందించటం నేర్చుకుని అనుభవిస్తూనే ఉన్నా!

ప్రకృతికాంతకు ఎన్నెన్ని సిరులంటే
నిజసిరులను ప్రకృతి ఆకృతుల్లో చూస్తునే ఎదుగుతూ ఉన్నా!

ఏంటయ్యా! ఇంతలా తిప్పుకు తిరుగుతావు?
పదమై పాదాల్ని కదుపుతావు
మనోవినోదినివై జీవననాదాన్ని వినిపిస్తావు
నీ మయూఖతంత్రులనాదంలో మేమంతా మురిసిపోతుంటే
మామూలుమనిషిలా మరలిపోతావు
ఓ మహర్షీ! నీ దారి మనసులను కదపడం అయితే
ఆ దారివెంట రేణువులలో ఒక చైతన్యం ఉందని తెలిసి
పాదస్పర్శ తాకాలని తపించే అభిమానరేణువుని
కనికరించే వరంకోసం, మనసుపడే జీవితకాలం తపస్సు
వరమిచ్చే దేవుడివి, స్వరమిచ్చే చైతన్యానివి నీవే!
నీకూ ఓ తపస్సుంటే, వరాలతో కరుణించాలని
నీతో అక్షరసుమాలై పూయించే ఆ చైతన్యమూర్తికి వేడుకోలు!
జన్మదిన శుభాకాంక్షలు!

Friday, May 19, 2017

నీ చుట్టూ శరీరం

దుఃఖం ఇంకిపోని కళ్ళలో
తడిస్నానాలకై కాచిన కన్నీళ్ళు!

భారంగా కదిలే గుండెలో
తేలికగా తిరుగాడే రక్తపుధారలు!

శౌర్యంతో గట్టిపడే చేతిలో
భారాన్ని ఒడిసిపట్టే బాధ్యతకండరాలు!

కుంచించుకుపోయే మేనిలో
క్రోసుల దూరపు ప్రవాహనాడులు

ఆర్తికి కీీర్తికి వెనుకమల్లే
శమనస్తుతి నేర్పే దాఖలాలై
నువ్వూ, నీ చుట్టూ శరీరం!

Thursday, May 18, 2017

పంచభూతాలు

నింగిలో చంద్రకిరణాలకై వేచే చకోరపక్షీ!
ఊళ్ళో నీ పుట్టుపూర్వోత్తరాలు ఎవరూ అడగట్లేదేం?

నీళ్ళల్లో ఈదేస్తే గడ్డుకు చేరతాననుకునే ఓ చేపా!
బళ్ళల్లో నిన్నట్టుకెళ్ళేప్పుడు ఎవరూ నీ దారిసొద వినట్లేదేం?

అగ్గిలో బుగ్గైపోతున్నానంటున్న ఓ వెతలమానవా!
ఒగ్గేశాక నిన్నెత్తేవారెవరనే బాధ నిన్ను తొలవలేదేం?

నింగికైనా నిచ్చెనలేయగలననే నిరర్థకప్రయత్నచరమా! 
నీవెక్కాలనే నిచ్చెనమెట్లు నీకై గట్టిపడేదెక్కడో వెదకలేదేం?

మట్టిలో హర్మ్యాలను తవ్వే తరూభక్షకా!
ఆ గుట్టల శిథిలాల్లో విత్తులు నాటిన పూర్వీకులను కనిపెట్టలేదేం?

పంచభూతాల్లో వెదుక్కోలేని మూలాల్ని
పంచభూతాలై నీకొచ్చిన శక్తి నిలిచే కాలంలో
పాంచభౌతిక శరీరాన్ని అడ్డం పెట్టుకుని
పంచుకు తిరిగేంత మంచితనం చేయడం వెతకక
పంచుకు బతికేంత గోడల్ని కట్టేసుకుంటావేం?

నీకున్న శక్తి నీకు ఇచ్చిందెవరని
నీదన్న భుక్తి నీకు దక్కించిందెవరని
నీవున్న నేలను నిలవక తిప్పేదెవరని
నీపైని నీలాకాశం నిలిపే గొప్పెవరిదని
నీకే తెలపని వయసులగాలము
నీడన నడవకు కోసులదూరము
నీదని బతికే నిమిషపుకాలము
వీడని నడకే కర్మలజాలము!
వాడని నడతే ధర్మపుమూలము!

ప్రశ్నలమూటల బరువులు దించి
జవాబుబాటల తరువుల పెంచి
మంచికి నీడవు నీవే అయితే
పంచన పగులును పేర్చిన గోడలు!
పంచిన పెరుగును నీవను జాడలు!
పంచభూతాలే నీతో తిరిగెడి నీవగు నీడలు!  

Friday, May 12, 2017

మిత్రుని తీరాలు

నిన్న తలిస్తే, చుట్టూ వాళ్ళే
ఇంటా బయటా,
గాలితో నిను తాకేంత దగ్గరగా!

నేడు కలిస్తే, చుట్టూ వాళ్ళే
ఇంటిబయట,
గాలైనా నిను తాకలేనంత బిగ్గరగా!

కళ్ళు మూసే ఉన్నాయి
ఎవరూ లేపటంలేదు
ఎవరికీ లేపటం తెలీదు
ఎవరైనా లేపాలని చూసే ఎన్నో కళ్ళు
ఎదురుచూపుల కన్నీళ్ళలో మునిగి
ఙ్ఞాపకాలు వెతుక్కుంటున్నాయి!

సూర్యుడు వచ్చి నీ సూర్యకాంతాలని తిప్పి వెళ్ళాడు
చంద్రుడు వెన్నెలతో అవే పూలను తడిపేస్తున్నాడు
పవనుడు నువు పెంచిన పూలసువాసనల్ని పంచుతున్నాడు
నీళ్ళు నువు లేవని, కన్నీళ్ళై మొక్కల్ని చేరుతున్నాయి
ఇవన్నీ నువులేవని రేపు వెళ్ళిపోతే
మళ్ళీ రావని నీతో కలిసొచ్చేస్తాయేమో!

నింగిలో నీలం, భూమిపై పచ్చదనం,
నీ నిర్మలత్వాన్ని చూపెడుతున్నాయి
ఆకాశమంత దూరం వెళ్ళలనున్నా
నేలపై నిలిచిన
నీ మనసు నిబ్బరత
నీ కుటుంబప్రేమ
వెళ్ళింది నువు కాదేమోనని చూసుకోమంటే
మరలి మరలి ఆలోచిస్తోంది మనసు
నువు వెళ్ళాల్సిన రైలు ఇంకా రాకూడదే అనుకుంటూ!

ఇంట్లో నువు నిలిపిన రెండు కమలాలు
నీడలా కాపాడేందుకు కమలాక్షునికి
కరాలు మోడ్చి, కనురెప్పలు మూసి,
ధ్యానంగా కదిలే అక్షరాలు
నువు చేసుకునే పూజల్లా వినబడుతూనే ఉన్నాయి!
నీ స్నేహం స్వచ్చతను, ఆప్యాయతను
మనికిపడే శ్వాసలో వెతుక్కుంటున్నాయి!
మంచిజరగాలని కోరుకోమంటున్నాయి
 
(పైలోకాలకు వెళ్ళిన మిత్రుడు వ్యాస్ చివరిచూపుల తర్వాత)