Friday, September 30, 2016

దారపాధారం

దారాన్ని పట్టుకుని
ఎదిగిన
ఒక తీగ
తీగతో పచ్చని ఆకులు
ఆకులతో ఎదిగిన పూవు
పూవుతో తియ్యని మకరందం
మకరందంతో స్నేహపుభృంగం
భృంగంలో ఓ నిశ్శబ్దచలనం
ఆ చలనం చూస్తూ నేను!
నిశ్శబ్దంలో తడుస్తూ నేను!
దారం కనబడలేదు
చలనం చూస్తూంటే!
నిశ్శబ్దంలో తడుస్తూంటే!
మళ్ళీ వెనక్కితిరిగి
అన్నింటినీ
ఒక్కటొక్కటిగా చూస్తూ
అనుభవిస్తూ
ఆనందిస్తూ
పరవశిస్తూ
కదిలేవరకు
మదిలో సుధల
ఆధారపుదారం
వెదికేవరకు!

Wednesday, September 28, 2016

దారి జీవాలు

దారినిండా ఎన్నో జీవాలు
కొన్ని జీవంలేనివి కూడా!

ఆగిపోవడం తెలీని చుక్కలు
అంతేచేరాక నేలమీద నాట్యాలు!

ఆకాశానికి ఎదిగామనే వృక్షాలు
తల వంచిన జాబిలి నీడల కొనలు!

నీళ్ళల్లో గాలిలో మంచులో భూమిలోఎన్నో జీవాలు
అన్నీ జవాల్ని నింపుకుని బతికేస్తున్నాయి!
కొన్ని జీవాన్నొదలి భూమిలోకెళుతున్నాయి!

మనం అనుకునే మనంకూడా వాటిలో!
మనమే అనుకునే మనంకూడా వాటిలో!

నేను అనుకునే నేనుకూడా వాటిలో!
నేనే అని తెలుసుకున్న నేనుమాత్రం ఆ తృటిలో!

ఆనందం అన్నింటా దైవిక రూపాలను చూస్తూ!
ఆనందం అన్నీ దైవతరూపాలలో నేరుస్తూ!

ముందే నిర్ణయించిన దారినిండా ఎన్నో జీవాలు
అన్నింటా జీవం తెలిసిన నాడులే!

Sunday, September 25, 2016

మత్తకోకిల

చిత్తమేమనె చిత్రమేదనె చిత్తుచిత్తుగ నోడగా
మెత్తమెత్తటి ముత్యమీదనిన మెట్టులే యిల జూపగా
విత్తనంబుల విద్యనేర్వగ విచ్చుమోదము నేర్చెగా
మొత్తమీవని మొట్టికాయల మొండినొంచిన నీవెగా!

మనసుగతి

మనసే మాటలు వినదని
మనసును జంపుకు దిరిగిన మనిషనలేమే
మనసా మనిషిని కదిపే
మనలోనేదో సుగతని మనిషిగ గనరే!

గుణ మంజరి

గొప్పలు పోయెడి సమయము
మొప్పల చేపను గనినను మొత్తము దెలియున్!
తిప్పలు తట్టుకునీదను
నిప్పగు నోరును తెరవవు నిలకడ నేర్పున్!

ఎప్పుడు నేనెంతన్నను
తప్పక జూడంగవలయు తరువులయనెదన్!
తుప్పల కాయలు గాసిన
తప్పకయణిగే గనబడు తత్వము దెలిపెన్!

చెప్పుడు మాటల వినుటను
తప్పుడు తలపుల తలుపులు తమవని తెరిచే
టప్పుడు, వినబడలేదా
చప్పుడుజేసే యెనకటి చర్నాకోలా?

ఎదిగిన మానును జూసిన
నొదిగిన విత్తనమనేది నొకపరిగనమే!
ఒదిగిన మేలగు నెత్తుల
నెదిగెదమనుమాట నీవె నేర్వగరావే!

Saturday, September 24, 2016

సైనికుని కాళ్ళు

కాళ్ళు నడుస్తున్నాయి
మంచు కప్పేస్తుంటే
మనసు నడిపిస్తోంది
ఇంకేదో ఉంది ఆ నడకలో
చరిత్ర తాకిన అడుగులు

దూరంగా ఏదో చప్పుడు
భయాన్ని పరిచయం చేసేది
ఇంతకుముందు
ఇప్పుడదంతా దినచర్యలో భాగం

కాంతిపుజం విసిరిన కనులకు
నల్లగుడ్లు చిల్లుతూటాలు
కనబడ్డాయి వినబడ్డాయి

కాళ్ళు కూరుకుపోతున్నా
నోళ్ళు పెగలకపోతున్నా
చేతిలో మరతుపాకీ
పనిచేసుకుపోతోంది

ఒక తూటా ఎక్కడో దిగింది
తెలిసేందుకు కర్తవ్యం అడ్డొస్తే
అడ్డు తొలగించుకుని కాల్చేస్తుంది
నల్లసిరాలా ఎదుటివాడిరక్తం
తెల్లటిమంచుపై రాసేస్తుంది
చీకటి చరిత్రని

ఆ చరిత్రలో నాకూ కొన్ని అక్షరాలని
తూటాలకు కారిన రక్తపుకాళ్ళు
అడుగుల గుర్తులేసి
జారగిలబడ్డాయి
ఆఖరిశత్రువు అంతంచూసి

ఆ అందెలని వెతుక్కుంటూ
అలాంటి వాళ్ళే వస్తున్నారు
అదే తపన
అవే గుర్తులు
సైనికుల కాళ్ళు!

Tuesday, September 20, 2016

చైతన్య ప్రసాదు గారు

మాటల మనోహరిగనెడి
నాటల కూర్చుండబెట్టి నాకముజూపన్
పాటల చైతన్య పదము
బాటన ప్రసాదమిదనె బాగోయనిరిన్!

కాంక్షల ధోనికి తానా
కాంక్షల తీర్చగ వెలుగగు కాంతుల దీపా
కాంక్షలు రాలినవి శుభా
కాంక్షలుగ ప్రసాదుగారి కాంక్షల దీర్చన్!

Saturday, September 17, 2016

అట్టాగట్టాగే

అట్టాగిట్టాగను పద
మెట్టాగోట్టా గొనవలె నెట్టుకొనట్టా
అట్టట్టే యన్నట్టే
నిట్టుగ కట్టలుగపట్ట నిట్టే గిట్టున్!

మెలకువలు

తెలుగుకలల గలగలలు లు
కలుకలు చిరుమెలకువలను  కలవరములనే
చిలుకపలుకుల వినమని
మలుపుల దాగిన శశిగను మసకను కలలే!

క్షీరసాగర మథనం

క్షీరపు సాగరమందున
బీరపు దేవతలు వెదికిన బీదలు కారే!
సారపు యంచే నాకపు
దారను వారలు వెదికెడి దారులు వేరే!

భారపు మందర వినెను
కోరల వాసుకి వినెమరి కోరిన ధర్మం!
భారము నీదే యనుచును
కోరగ కూర్మమును మోసి  కోర్కెలు దీర్చున్!

చలువల శశినీ విడిచిరి
విలవగు మాయమ్మ లక్ష్మి విడిచిరసురులే!
జిలుగుల కోరికలావును
వెలుగగు కల్పతరువొదిలి వెతలను గొనిరే!

చచ్చుటనాపుట చాలని
వచ్చుటనాపని వరముల వదులుటనేలా!
వచ్చును గరళము చావై
మచ్చుక ధైర్యము సడలి చెమరికే యొచ్చున్!

అరిచిరి సురలుయరులు చా
వరయగ చేరన్! గరళము వరముగ గనగా
మరచిన వానిని కొలిచిరి
హరహరయని సురలసురులు హరమును గావన్!

రక్షణకును రావాయన
తక్షణమే హరుడుజేరి తమమును గొనడే!
మోక్షపు దారుల మొదలని
రక్షణకును కోర రాడె రమముగ హరియున్!

వచ్చిన యమృత భాండము
చచ్చుట నాపుట పిదపని చవిగొన చిచ్చే
యొచ్చెను మొదలై, కావగ
నొచ్చిన మోహినిని కనులనోపగ జిచ్చే!

రాహూకేతుల జిత్తుల
బాహూలందిన శరీరభాగము లీలా
మహిమల ఖండము కావగ
ఆహా! ధర్మము తెలియగ సాహోయనమే!

ధర్మము అర్థము కామము
కర్మల జూపగ సురలను కథలుగ జూపన్
మర్మము జీవనమందున
ధర్మము నిలుపుట ననుకొన ధన్యతనొందున్!

మోక్షపు దారుల వెదికే
రాక్షసవర మార్గమంతను రావే వరముల్!
చక్షువులెక్కడ జూసిన
శిక్షణమక్కడ దొరకును శిరములయొంచన్!

మనమున ముదమును గానక
వనమును చరమును చలువను వదలకుమనియే 
ఘనముగ నేర్పిన కతలివి
కనగను గరళము వెనకను కనుగొన సుధలే!

Friday, September 16, 2016

వినయ వంశీయం

జనులా కవితను పొగడగ
కనులే ఎక్కవు తలమరి కతయన యదియే!
మనకే దొరికిన మద్దెల
మనమే వాయించుకొన్న మనసుకు హాయే!

Wednesday, September 14, 2016

గణేషుడు అతడు

ఖైరతాబాదు పెద్దవాణ్ణి వేసేందుకు ఒకరిద్దరు సరిపోరేమో, అందర్నీ మోసేందుకు ఒక ఇరవై రాయలసీమ సుమోలు, పది లాతూరు లారీలు, పోలవరం ప్రొక్లెయిన్లు, కొల్లేరు క్రేన్లు తెప్పించండి. 500మంది తో ప్రతిచోట మనుషులు వెనకే ఉండి వదలక పొజిషనింగ్, అలసిపోకుండా సింగింగ్ డాన్సింగ్ వెనక  పెట్టండీ, సింగ్ నింగ్ అన్నానని వాళ్ళు పంజాబీలు చైనావాళ్ళు కారు సుమీ! గల్లీ గల్లీకి గలభాచేయటానికి రంగుల్లో జనం, ఎవ్వరినీ గుర్తుపట్టలేనంత రంగేయండి, హుసేన్ సాగర్ దగ్గర ఇంకో యాభైమందిని పెట్టండి. ఎవ్వరూ దాటడానికి వీల్లేదు. ఎవరన్నా దాటితే వేసేయండి వాళ్ళని (లెక్కెట్టుకునే). పెద్దాయన్ని దండంపెట్టుకుని వేసేశాక పెద్ద సౌండొస్తుంది, అది ఎప్పుడొచ్చేదే భయపడమాకే. మరో దండంపెట్టుకుని నాకు మిస్‌డ్ కాలివ్వు, అలజడి తగ్గాక వచ్చి డబ్బులు పట్టుకుపో. (వినాయకుడు అతడు ప్లాన్)

Monday, September 12, 2016

కేక లైకు

సీ:
కేకలైకులు లేక లైకుకేకల కేక
కేక కేకే లైకు కేకలైకు   
కేక లైకులులేక లైకు కేకల కేక
కేక కేకే లైకుకేక లైకు
కేకలైకులులేక లైకు కేకలకేక
కేక కేకే లైకు కేక లైకు
కేకలైకులు లేక లైకుకేకల కేక
కేక కేకేలైకు కేక లైకు
గీ :
కేక కొకలైకు లికలేక కేకలైకు
కేకకొక లైకు లికలేక కేకలైకు
కేకకొకలైకు లికలేక కేకలైకు
కేక కొకలైకు లికలేక కేక లైకు

లైకు కేక

సీ:
లైకు కేకకు లేక కేక లైకుకు లేక
లైకు లేకా కేక లైకు కేక   
లైకు కేకకు లేక కేక లైకుకు లేక
లైకు లేకా కేక లైకు కేక 
లైకు కేకకు లేక కేక లైకుకు లేక
లైకు లేకా కేక లైకు కేక 
లైకు కేకకు లేక కేక లైకుకు లేక
లైకు లేకా కేక లైకు కేక 

గీ :
లైకులొకకేక కికలేక లైకుకేక
లైకులొకకేక కికలేక లైకుకేక
లైకులొకకేక కికలేక లైకుకేక
లైకులొకకేక కికలేక లైకుకేక

(Ganeswar Rao గారికి మేకతోకను గుర్తుచేసినందుకు కృతఙ్ఞతలతో)

Saturday, September 10, 2016

పవన కళ్యాణం

పవన కళ్యాణం
వేదిక : కాకినాడ
సమస్త జనులకక్షింతలు జూసి కందాక్షతలు(గుంపులో ఎవరిపైబడ్డాయో తెలీదు):

నామము కళ్యాణపుత్ర
నామము మారి చిరుగాలి నామము గొనగన్!
నామము రక్తపు యువకుల
నామము తానైన పంగనామము దెప్పెన్!

గొంతున్నందుకు అరిచెను
వంతల అభిమానులజూచి వంతని యరిచెన్!
కొంతను కొంతయు అరిచిన
గంతల మాటున బతికెడి గండము వదులున్!

అరిచిన అరిచెను యందురు
అరివిరుల గొనగను పవనుడరిచిన దేమో!
అరిగని అరవక యున్నను
కరిగని కాచెడి దెవరని కదలగ నరిచెన్!

అన్నను గావగ యుండక
మన్నున మామిడిని పెంచు మన్నుల మనిషే
వెన్నుగ మనుషుల జేరిచి
వెన్నుల మిథ్యని మనమను వెతలను మనిషే!

బొట్టుల పెట్టియు నెట్టిన
కొట్టుట తిట్టుటయు పుట్టిగొట్టుట గుట్టై
గట్టుల పెట్టిన యొట్టుల
కొట్టులు పెట్టుకును పొట్టగొట్టగ నెవరే!

పుట్టుట గిట్టుట ముట్టక
మెట్టల బతికేటి వారు మేదిని లేరే!
గుట్టల మూటల రట్టుకు
బుట్టల కోరికల గోర బుట్టుక మేలే!

Monday, September 5, 2016

గణపతి పూజ

రాముడు కొలిచెను యందురు
భామలకృష్ణుడు కొలిచెను భార్యలబొందెన్!
ఏమివి ఏడేడుకతలు
మేమిని మేధిని పిలిచిన మేలై రావా!

రారా! వినయకుమారా!
ఏరా! నీయాకలి గననేరా యన్నన్!
తారాపతియే నవ్వెను
భారోదరముగన, శివుని భాసితశిరమున్!

సత్రాజిత్తుకు చేరెను
చిత్రాల శమంతకమణి చిత్రముగాదే!
పొత్రాన్ని లాగిన బలుడు
చిత్రానపనింద బొందె చిత్రమదేలే!

యుగములు దాటిన హరిగన
యుగములనొక ఎలుగు దాటియున్నది వరమున్!
మొగములు చూడని యుద్దము
జగముల జూపిరి యిరువురు జనమలు దాటిన్!

సూతుడు చెప్పిన కతలవి
పాతుకుపోయెను మనసున పారముజేరన్!
మెతుకులుబట్టుట నేర్చుచు
వెతుకుట మరచిన మనసుకు వెతలే సుధలున్!

ఎక్కడి వాడీ గణపతి
పక్కకు జూడక చదివిన పలితములేనా!
మొక్కిన మరకట శిరమును
చక్కగ నిలిపే వరముల చలివిడినిమ్మా!

(వినాయకచవితికి కథలు విని రాసుకున్న కందాలు)

Thursday, September 1, 2016

క్షీర సాగరం

క్షీరములను మందరనిడి
మేరదునుమమృత భాండమేదీ యనిరే!
కోరగ కూర్మము నీవై
భారము నిలిపిన హరిగన భాండములేలా!

నర చరములగను హరియే
హరము  నహంకారమునన్
వరముగ వందల ఆంక్షల
హరమేదని ఖలుడన నరహరియే గదిలెన్!

హరియన వరాహరూపుడు
హరియన వేదముల రక్ష! హరినే గనగన్
అరుల వెతికి రనిమిషులే!
హరిగన పెదవులనెనె నరహరియను పదమే!

బాలుడు ప్రహ్లాదుడుగనె
సోలి హిరణ్యాక్షుడును సోమకుడన గనిరే
జాలిని నీవే కనవని
పాలిత జనులంత యేడ్చు పాలకుడేలా!