Saturday, January 30, 2016

ఒక్క క్షణం

ఒక్క క్షణం వెనక్కి తిరిగితే
ఒక్క క్షణం వెనక్కి తరిగితే!

చెత్త వేసేముందు
చెత్తగా చూసేముందు
చెత్త అనేసేముందు!

ఓటు వేసేముందు
నోటుతో ఖరీదు చూసేముందు
కోటుల్తో ఆ కబుర్లు చూపేసేముందు

నిర్భయజ్యోతుల్ని చూసి కదిలేముందు
అసహాయురాలిగా సతిని వదిలేసేముందు
కోతుల్తో మారు పోల్చుకోలేక మిగిలేముందు

ప్రతిదీ కడిగేసేముందు
ప్రతిగా చేతల్ని వదలకముందు
ప్రతీకగా వేసే  అడుగాపకముందు

బాలల్లో తప్పులు వెతికేముందు
బాల్యపు తిప్పలు ఉతికేముందు
బాసటగా మెప్పు కోరకముందు

ఒక్క క్షణం వెనక్కి తిరిగితే
ఒక్క క్షణం వెనక్కి తరిగితే!

Tuesday, January 12, 2016

ప్రకృతి అందం

మొన్న పొద్దున చూసాను
మొదటిసారి
తను ఆడుకుంటున్నప్పుడు
నిర్మలానందం

అప్పుడే నిద్రలేచినట్టుంది
చక్కటి ఒత్తుజుట్టు
అప్పుడే పుట్టినట్టు
తెలిమంచు తుళ్లింతల్లో
జంకూగొంకులేని కేరింతల్లో
నవ్వుకుంటూంది

ఇది నా ప్రపంచం
నువ్వే పరాయివాడివన్నట్టు
కోపంగా బుంగమూతితో
నా వైపు చూసింది
నీతో కచ్చి అన్నట్టు
పరిగెత్తి వెళిపోయింది

నిన్న హడావిడిలో వున్నానో ఏమో
తప్పక చూడాల్సిన
ప్రకృతి అందం
మళ్ళీ చూసా
పసిమనసు శృతిచేస్తే
పక్కున నవ్వుతూ
సిగ్గుబుగ్గలతో చెట్టెక్కేసింది

ఈ రోజు పొద్దునా
అదే హడావిడి
మితవేగంగా వెళుతున్న కారు
చారల మార్గం దాటేందుకు
దూరంగా బడికి వెళ్తున్న పిల్లలు
రాజమార్గంలా దారిమధ్యలో
పరిగెడుతూన్న తనని
మరలి చూసా 
వడివడిగా వెళుతూ
వెనక్కి తిరిగి
కోపంగా చూసింది
మళ్ళీ ఇది నా ప్రపంచం అన్నట్టు
మనసు చివుక్కుమంది
ముందుకెళితే
చివాలున వేగంతగ్గి
శివాలైన మనసుకు ఒగ్గి
వెనక్కుమరలి చూసి
తనకేమీ కాలేదని తెలిసి
సహజానందంతో
మనిషిగా రోజు మొదలయేందుకు
మార్గం చూపింది
చిట్టి బుడత! ఉడత!

Sunday, January 10, 2016

అమూల్య బాల్యం

అమరకోశం
అల్లసాని పెద్దన
అక్షరమాలిక
అన్నా చెల్లెలు
పట్టుచీరల నేతగాళ్లు
వేపచెట్టులో బంకగూళ్లు
పసుపు గడపలు
చెలిమల కడవలు
పచ్చజొన్న పైర్లు
లెక్కలు నేర్పిన కరెంటు స్తంభాలు, వైర్లు
అప్పిచ్చిన పచారి కొట్టు
సుస్తీ తాయెత్తుల పీరు సాయిబు ఒట్టు
పక్కింటి ఆదివారం దేవసహాయం
పైవాడు తీసుకెళ్లి ఏ సాయంలేని మరో కుటుంబం
అనవసరం తెలీని నెలజీతాలు
అవసరానికి అంతా బంధువులే చిన్న ఊళ్లో!

సెలవులోస్తే ఒకే విడిది తాతయ్య ఇల్లు
జారుడుకుర్చీలో జామపండిస్తూ ఆప్యాయతలు
జడల పద్యాలు చెప్పించుకుంటూ వీధి తాతయ్యలు
జమఖానపై మిద్దెమీద నిద్రలు
జారుతూ వెళుతున్న నక్షత్రాలు
జరిగితే అవి పడతాయేమోనని కదలని జాగ్రత్తలు
ఇంటిముందు కానుగ చెట్టు పంఖా
అందరివైపూ తిరగగలననే రైలు అర్ధరాత్రి ఢంఖా
విగ్రహం నుంచి గుడిగా ఎదిగిన దేవళం
విరివిగా తాతయ్య ఇచ్చిన చిత్రవిరాళం
జేబుల్ని వెక్కిరిస్తున్న హుండీ
చమురువెలుగుల్లో తోడంటున్న అందరితండ్రీ!

పైరవీలు చేరని పల్లెటూళ్లకే పంతుళ్ల మార్పులు
స్నేహితులంటూ మిగలని ఊళ్లలో చేర్పులు
పలకరింతల గాలికేరింతల్లో పచ్చిక పైర్లు
పడేయటం నేర్పని పల్లె మనసులు, గాలులు
కసితో కందుకాల్లా ఎగిరిన తలలు
కనులు చూసినా కలవరపడటం తెలీని కలలు!

కనుచూపు మేరలో లేని పాఠశాల
కూడదీసుకుని పరిగెత్తుతున్న పాదాలు
కంచుకంఠంతో సమయానికి చేరాలనే ఆఙ్ఞ
కంచు ఘంట కొడుతూనే సాగే ప్రతిఙ్ఞ
తెల్లచొక్కాపై విసిరిపడిన బురద గాట్లు
వరిలో పడేస్తున్న వాగు, మట్టిగట్లు
పట్టుకుని నడిపిస్తున్న నాన్న
పదుగురిలో పరువునిలవాలనే అమ్మ
ఇనుపగుండు విసిరితేనే ఆటల సమయం
ఇరుకు గదుల్లో చదువులు
విశాల మనసులతో పంతుళ్ళు
ఒరవడితో  సాగే పరీక్షలు
ఒక్కటైనా వదలని ప్రశ్నలు
ఒకటిగానే నిలవాలనే పట్టుదల
ఒంటరైతే వెళ్లిపోయిన స్నేహవర్గవిచక్షణలు
ఒక్కటైనా ఆసరాకాని వందల్లో బంధువులు
వందమార్కులతో వేచిచూసిన ప్రవేశ నిరీక్షణలు
గడియకో సలహాల ఉద్యోగ గవాక్షాలు
గమ్యంతెలీని దారుల్లో గమ్మత్తులు!

ఏదైనా చేయగలననే మొండిధైర్యం
ఏదొ ఒకటి  అవుతాననే చిన్న ఆశ
ఏదీ కాలేరనే బంధువుల నిశ్వాస
కావాల్సిన ప్రతిచదువూ చేరలేని మూల్యం
కథల్లా కనులముందే వెళ్ళిపోయిన బాల్యం
తిరిగిచూస్తే అదే కూర్చి మిగిల్చిన అమూల్యం!

Saturday, January 9, 2016

సంస్కృతీ సంపద

గజేంద్రమోక్షం
ద్రౌపదీ మానసంరక్షణం
నేర్పిన ఆర్తరక్షణం

గజముఖ ప్రసాదఘట్టం
శ్రీరామపాదుకా పట్టం
చూపిన భక్త విచక్షణం

భస్మాసుర కైబలిమి
కీచకాది మద దునిమి
తెలిపిన దురాశా శిక్షణం

అమృత జీవన శోధిక
హాలాహల గరళ అరోచిక
కల్పతరూ ఐచ్ఛికకూర్చిక
కామధేను అగత్యతీర్చిక
శశి శ్రీ శాంతిఅవతారిక
రాహుకేతు అంతిమ మరీచిక
దొరికిన మోక్ష ప్రశిక్షణా క్రమణిక 

వేదవేదాంగ అక్షర స్వరశృతి
ఖండాలగీతలు ఆపని గీతాధర్మనిరతి
మనిషిని అనిమిషునిగా చేసిన మహతి
మరచి మంచికై మరోలా వెదికే జగతి
నిముషమైనా మరలి చూడుము ఈ గతి
నీకున్న పదుల వేల వత్సరాల సంస్కృతి
మరవకోయీ మనుగడకై నీవు ఏ రీతి!

Saturday, January 2, 2016

2016 ఆహ్వానం

తొలిపొద్దని లేచి
ఙ్ఞానసముపార్జనకై
తొలిపాఠకుడనై
ప్రపంచపుటల తలుపు తెరిస్తే
అక్షరపు అచ్చునుంచి
మదిని తట్టిలేపి తొలచివేసే
దృశ్యాల పార్శ్వాలలో
ఎటుచూసినా
అమానుషత్వపు మస్తిష్కాల హేల
ఆరోపణలు అగ్నిపరీక్షల లీల
ఇంగితంలేని ఙ్ఞానబోధన
ఈసడింపుల గళాలరోదన
ఉన్మాదుల నీచశక్తి
ఊకదంపుడు సినీసుత్తి
ఎంతుందనే ఆర్భాటపు చిత్రీకరణలు
ఏం జరుగనుందో ముందు తెలీని శంకుస్థాపనలు
ఐదుపదులైనా యువకులమనే ఆటవికులు
ఒట్టులు పెట్టుకునే వాగ్ఘటికులు
ఓటుల్లా అవి చేరే ప్రజాస్వామ్య గట్టులు
ఔషధాల ప్రకటనల మెరుపుపొట్టులు
అంతర్జాలపు క్లుప్త గాలికబుర్లు
అంతఃకరణశుద్ధి లేని ప్రవచనాలు
రాబోయే పొద్దులో
గొడ్డులం కాదని ఉలికిపడే అనుభూతుల్ని
కాసింత మనుషులమని గర్వపడే అధ్యాయాల్ని
కూసింత మనసులతో ఎదురుపడే ఆప్యాయతల్ని
కాలంతో మరచిపోలేక మదినివడే ఆలోచనల్ని
అమృతాక్షర నిలువల విలువల జగతిని
మానవాళికి ప్రసాదించుము ప్రభూ!