Tuesday, May 24, 2016

గాలివాటం

"గాలి" వాటంగా హత్తుకునే మేఘాలలో
రాలిన చుక్కల
తోడు పలకరింపులు

"గాలి" వాటంగా పీల్చుకునే శిఖరాలలో
వాలిన గర్వపు ఎత్తుల
తోడు లోయదారొంపులు

"గాలి" వాటంగా ఉరికే లోయలో
రాలిన పూల
తోడు గుబాళింపులు

"గాలి" వాటంగా సడైపట్టుకునే శరీరాలలో
రాలని మిత్రుడిలా
తోడు ఙ్ఞాపకపుగుంపులు

వానచుక్కలు పూయించిన పూలు
పూలు పిలిచిన పలకరింపులు
పలకరింతలు పరచిన దారులు
దారులు చేర్చిన శిఖరలోయల గమ్యాలు
గమ్యాలు మిగిల్చిన ఙ్ఞాపకాలు
ఙ్ఞాపకాలు అమర్చిన జీవితం
ఆద్యంతం గాలివాటం, ఈ హృదయకవాటం !  

Friday, May 20, 2016

నీ వెలుగు

వెలుగులకోసం ఖాళీగా చీకట్లో ఉన్నప్పుడు
సహనపు వెలుగుతో సరిగా నడవటం మొదలెట్టేయ్!

వెన్నెలవేషం నిండారా వేసుకున్నప్పుడు
ఇసుకరేణువుల ఆగని చూపుల క్షణాలను నిలబెట్టేయ్!

నిటారువృక్షం నీఎత్తును నీముందే చిన్న అన్నప్పుడు
నీడను వెతకక గొడ్డలితాకే అహమును తగలెట్టేయ్!

విశాలచెరువు విధిగా వానల నిండున్నప్పుడు
నాథుడులేడని నాదని పాకే ఆక్రమణకామపు బొందినికట్టేయ్!

నీతోవుండే నలుగురితోడుకు నీవే మొదలూచివరైనప్పుడు
నీవూ నేననే నిటారుగీతలు మరినీకెందుకు? అవి తుడిచెట్టేయ్!

ప్రతిదీ నీదే, నువు నేర్చినదే, నీతోడన్నదే,
చూసే కన్నులు, ఏడ్చే కన్నులు, చేర్చే తెన్నులు,
ఎవరి నియంత్రణో, నీకు తెలుసన్నదే
తెలుసుకునేందుకు పదపద లేచి, నీలో రవిని నీవే కనిపెట్టేయ్!

Wednesday, May 18, 2016

సుమశరం

మొన్న వ్యాహ్యళిలో
చల్లటిగాలి పీలుస్తూ
ఘంటసాల పాటతో నడుస్తుంటే
నీకూ నచ్చిందా
అంతలా తలూపావ్
మరీ తాదాత్మ్యంగా

మనసులు కలిశాయని
మరో అడుగు ముందుకేసి
నాతో రారమ్మంటే
ససేమిరా అనేశావ్
మళ్ళీ తలూపి
ఈసారి అడ్డంగా

పోనీ ఓముద్దిమ్మంటూ
నీ రెప్పల దరికొస్తే
ఆ గాలి గోడెక్కి
నీ ముల్లు మల్లుడు
మీ తుమ్మెద బావ
నన్ను దూరంగా తోస్తే
నువ్వేమనలేదేం
తలూపి ఉండొచ్చుగా అడ్డంగా

దూరంగా నడుస్తుంటే
నువ్వూ నీస్నేహితురాళ్ళు
నావంక కొంటెగా చూస్తూ
వదలిన గుంపు గుబాళింపుబాణం
నా గుండె తాకితే
నువ్వేం చూడలేదేం
తలెత్తుండొచ్చుగా ఓరగా

నీవే నాకు భగవత్ప్రసాదితవని
దేవకన్యంత గొప్పవుగనకనే
నీతో కలిసి గుడికెళ్ళాలనుకుంటే
దేవుడికి కలిసి మొక్కాలనుకుంటే
నీవేంటి?
నేను దేవునికై పుట్టానని
నన్నూ ఆదేవుణ్ణే పూజించమని
ఆజ్ఞాస్త్రాలేసి ప్రేమతో బంధించి
ఆదేవుని మెడలో మాలయ్యావు
నన్నేంచేయమంటావు
నిన్నూ నీనాథుణ్ణీ కీర్తించటంతప్ప!

Tuesday, May 17, 2016

తథాస్తురూపం

నేనని భ్రమించే
ఈ నా నేనూ మేనూ
నువ్వు శ్రమించి
కొత్తని సృజించి
కెవ్వను పాపలా
అమ్మకు దండలా
నాలా చూపిస్తే
నను వదిలేప్పుడు
నువు రాల్చిన
బంధం కోసేప్పుడు
నీ కన్నుల్లో నేచూసిన
ఆ పేగురక్తం
ఆనందార్ణవమై
చుట్టూ నవ్వులని నింపేస్తే
నువు చెప్పిన తథాస్తుదీవెన
నన్ను వదలలేదు తెలుసా!

నేను పెరిగేప్పుడు
నేను గాల్లో విసిరిన బంతి
నువు ఆడావేమో అటువైపు
కిందకు వచ్చి నాతో ఆడటం గుర్తు

నా ఆటల ఒంటరితనంలో
నేను చాచిన స్నేహపు హస్తం
నువు గాలై తాకావేమో అటువైపు
బంతిలా దొర్లివచ్చి నాతో ఆడటం గుర్తు

నా గీతల నిండుదనానికై
నేను కుంచెను ముంచిన క్షణం
నువు నింగిలో గీచావేమో హరివిల్లు
మదిలో నీసృజన నా చేతుల్లో కదలాడటం గుర్తు

నా భయం మునగడానికై
నేను నీటిపంచన పిల్లిమొగ్గేసినదినం
నువు నీటిలో ఎత్తావేమో అటువైపు
గాలిబుడగలా పైకొచ్చి నాభయం పోవటం గుర్తు

నా చదువుల పెంచడానికై
నేను బుడ్డి అగ్గిదీపం చూసిన రాత్రి
నువు వెలిగి నను వెలిగించావేమో అటువైపు
నీ కాంతితో నాచీకటి వెతలు బాపుకోవటం గుర్తు

నువు నాతోనే ఉన్నా
నా చుట్టూ వ్యాపించున్నా
నిను తెలుసుకునేందుకు
నిను కలుసుకునేంతవరకు ఆగాలా!
నిను వదలిన రోజే
నువు నేనైతే పోలా!

నేను నువు సృష్టించి
నువు రోజూ దీవించే
నీ ప్రతిరూపాన్ని!
నీ తథాస్తు రూపాన్ని!

Friday, May 13, 2016

అన్నదాత - ఆర్తరక్షణ

నువ్వెవరో ఎలావుంటావో
నాకు తెలీదు
నీ కుటుంబం ఏమనుకుంటుందో
నాకు తెలీదు

నేనెవరో ఏంతినాలనుకుంటానో
నీకు తెలుసు
నా కుటుంబం తినేదొకటుందని
నీకు తెలుసు

నీరు తడిసిన మట్టివాసన
వేరు కదలని మట్టినిచూసిన
మేరునగమును మట్టిపైచూపినా
నువ్వెవరో నాకు తెలీదు
అనేసి అడుగునుతీసే శక్తిచ్చావు
నువ్వు అడుగడుగడున గుర్తొచ్చావు
దేవుడిని వెతికే దారిలో నాతోడయ్యావు  

కనబడని గాలీ దేవుడైతే
కాల్చేసే అగ్నీ దేవుడైతే
కానల జాబిల్లీ దేవుడైతే
కిరణాల సూర్యుడూ దేవుడైతే
కనబడక కదిలించే కరుణించే
కానుపు కాటికి మధ్యన బతికించే
నువ్వూ దేవుడివే అంటోంది మనసు!  
నువ్వెక్కడున్నా దేవుడిలా దీవించి
నలుగురికి ఆరూపాన్ని నీలో చూపించెయ్
నేనడగకున్నా నువు చూసేది అదేనని
నాకు నేర్పిన మెదడు నీ చలవతో పెరిగిందే!
ఆర్తరక్షకా! శరణు శరణు!

(రైతుకోసం -  Sandhya Gollamudi, గోపీనాథ్ పిన్నలి గారికి కృతఙ్ఞతలతో)

కొండపల్లిబొమ్మ

చేతులలాగ ఊపేస్తుంటే
చేరగరమ్మని చూపిస్తుంటే
చక్కనియందము కన్నులబడితే
బొట్టూకాటుక వదలకపెడితే
పరకిణికోకల పరపతిచుడితే
పాదపుయంచున పారాణిపెడితే
పూసిగదాటు పొడుగుజడకడితే
అంచులవాలే ఘంటలతడితే
గొంతుకనూగే దండలజుడితే
పొందికగలిగిన కొండపల్లిపడతి
పండగరోజుల కొలువవుతుంది
పాటలమాటల కథచెబుతుంది
బొమ్మనిలాగే నిలుపంటుంది!

Sunday, May 8, 2016

అమ్మానాన్న

అమ్మానాన్న
===========
దూరంలో చూస్తుంటే
కళ్ళు దగ్గరగా వెతుకుతాయి!
దగ్గరవాలని లేస్తుంటే
క్షణాలు దూరంగా తోసేస్తాయి!

దూరానికి ఎగిరిన నేను
దగ్గరవాలని మొదలెడితే!
దగ్గరచేరే మార్గం
దూరంగా మరలిస్తోందా?
దూరంచేరననే మారం
దగ్గరగా తరలిస్తుందా ?

ఏదైనా అల చేరే తీరం
ఇదీ అనే జీవితదారపు దూరం
కొణ్ణాళ్ళు దారాన్ని అట్టే పట్టు
బరువుని మోసేందుకు నను కనిపెట్టు
బరువవని నేర్పును నేర్పి మీరెక్కే మెట్టు
బాధ్యతని నేర్పిన మంత్రంలా ఒదలని ఒట్టు!

(మాతృదినోత్సవంలో మరచిపోని బాధ్యతరాగం)

Friday, May 6, 2016

వడగండ్లు

వడగండ్లు
oooooooo
నీలాకాశంలో కోపపుపూలు
భగభగమండి
బాగోకుండి
తుషారాశ్రువులై
తామే జారి
గుండ్రపు గండ్లయి
భూమ్మీద పడ్డాయి!

ఒకపక్క పసిపాప
అందులో దేవుణ్ణి చూస్తూ
ఆడుకుంది గుండ్లను తీస్తూ!

ఇంకోపక్క కుర్రకారు
అందులో దాడిని చూస్తూ
మాడిపోతొంది గంటల కార్లనులెక్కిస్తూ!

మరోపక్క ముసలితనం
అందులో దారిని చూస్తూ
పరుండిపోయింది గతాలు నెమరేస్తూ!

మధ్యలో పేదతనం
అందులో నీటిని చూస్తూ
పట్టుకుకూర్చుంది గుడిసె  పైకప్పునిమోస్తూ!

Tuesday, May 3, 2016

నిరాళపుదయం

Zen Poems తెలుగు అనువాదం
1.
Like the little stream
Making its way
Through the mossy crevices
I, too quietly
Turn clear and transparent
పచ్చని నాచును
పరుగిడి తాకి
పరవడుల కడిగిన
వరమగు తేటల
జలమయ్యాను
నను నేనేర్చాను
2.
Enlightenment is like the moon reflected on the water
The moon does not get wet, nor the water broken.
Although its light is wide and great,
The moon is reflected even in a  puddle an inch wide.
The whole moon and the entire sky
Are reflected and dewdrop on the grass.
సిరివెన్నెలలే
చిరుజలాన పడితే
ఇంచుకమైనా
ఎంచేదైనా
అంచులులేని
అంబరమైనా
గరికనపడిన
ఇంకని చుక్కన
కాంతెంతైనా
కనుమరుగవని
బింబం తానై
వెలుగున ఒదిగీ తెలిపే
నిర్మల హృదయం
నేర్చే ఙ్ఞానపు
నిరాళపుదయం
నీకింతేనని
3. Drink your tea slowly and reverently
    as if it is the axis on which
    the world earth revolves - slowly, evenly
    without rushing toward the future
    Live the actual moment only this moment is life
- Thich Nhat Hanh
***
తేనీరులపానపు
తేరుల వేగం
అల జడి నొదిలిన
అలరునాభావం
ఇలయను ఇరుసున తిరిగే
నిలకడ తెలిపెను
ఈ జగమునో భావం
జరిగే నిముషపు
జీవన రాగం
జతగా వదలక
జనుమను మార్గం!
***
4.
A tree in the wind
The wind in a tree
All in me
***
సుడిగాలిని ఆపే చెట్టు శౌర్యం
గడిదాటని చెట్టును కదిపే గాలిధర్మం
రెండూ నాలోనూ వున్నాయి
***
***
గాలికి అడ్డంగా నిలిచే ధైర్యం
గాలిలా అతలాకుతలమయ్యే అంతరాళం
అన్నీ నావే, నాలోనే వున్నాయి
నీవు పీల్చే పవనాన్ని
నీకు దాన్నిచ్చే వృక్షాన్ని
నేను నీ ప్రకృతి రూపాన్ని!
***
5.
Midnight
No waves,
No wind
the empty boat
is flooded with moonlight
- Dogen
***
నిర్మల అంబుధి
నిశ్చల రాతిరి
గాలీ అలలు తాకని ఊపిరి
ఖాళీ గుండెల పడవన
దండిగ నిండిన వెన్నెల మాదిరి
6.
జరిగినదేదీ వెతికిన మారదు,
మార్చాలనే మాటలనొదిలెయ్
జరుగునదేదీ అలాగె నిలవదు,
చేయార్చాలనే చింతలనొదిలెయ్
భవితను క్షణాలు రానేలేదు,
తగలకముందే తాకటమొదిలెయ్
కనులను తాకిన ఒక్కో ఖరీదు
దాచాలనే పొదుపులనొదిలెయ్
నిను నను కట్టిన కట్టడిలేదు
కడగాలనేది కానవదొదిలెయ్
ఖాళీ పాకిన మెదడునే జవాబు,
చలనములేని ధర్మమునలేదోయ్
నీలో నిశ్చల నిసర్గ తాఖీదే
నీవే నిజమను నిశ్చయమౌతుది  తెలుసోయ్! 
The past is already past.
Don't try to regain it.
The present does not stay.
Don't try to touch it.
From moment to moment.
The future has not come;
Don't think about it
Beforehand.
Whatever comes to the eye,
Leave it be.
There are no commandments
To be kept;
There's no filth to be cleansed.
With empty mind really
Penetrated, the dharmas
Have no life.
When you can be like this,
You've completed
The ultimate attainment.
Layman P'ang (740-808) 
*********************************
7.
నువు కోరే నీ విడుదల రోజు
నిను నువు తెలుసుకోగోరే ఎదుగుదల రివాజు 
తన రూపురేఖలు, మూలపు దారులు,
వేరూ ఊరూ, వెతికిన దొరకవు
కానీ అయ్యది చలాకి చిన్నది
తానే ఉల్లాసోత్సాహాల ఉత్సవమన్నది
సుళువు చొరవన బదులిస్తుంది
పనియేమంటే పద లేనంది
చూడలంటే సరి?
నువ్వేలే తనతో దూరం జరిగింది
కావాలంటే మరి?
నీలోనే తనకు దూరం పెరిగింది. 
If you want to be free,
Get to know your real self.
It has no form, no appearance,
No root, no basis, no abode,
But is lively and buoyant.
It responds with versatile facility,
But its function cannot be located.
Therefore when you look for it,
You become further from it;
When you seek it,
You turn away from it all the more.
- Linji
**********************
8.
ధర్మము జీవిత బంధకమైతే
దైనికకర్మల ధర్మము చూడకు
ధర్మపు చారికలద్దని కర్మలు
ధరిత్రిలోనే కనబడవందుకు
Those who see worldly life as an obstacle to Dharma
see no Dharma in everyday actions.
They have not yet discovered that
there are no everyday actions outside of Dharma.
- Dogen
9.
ఎవరు వింటున్నారని?
నిన్ను విననిది నీ భౌతికయునికి
నిన్నే కననిది అలౌకికవెలితి
వినేదదేదని నిను ప్రశ్నిస్తే?
కదిలే అడుగుల కావడిదారులు
పక్కన వదలెయ్ ప్రజ్ఞలబారులు
పరిత్యజించెయ్ పద్ధతిచారలు
విముక్తినిచ్చెయ్ నేనను మేరలు.

Who is hearing?
Your physical being doesn't hear,
Nor does the void.
Then what does?
Strive to find out.
Put aside your rational Intellect,
Give up all techniques.
Just get rid of the notion of self.
- Bassui

10.
ఎగిరే రెక్కలు నీకుంటే
నెమ్మది సొత్తుల పరుగవ్వు!

ఉరికే సత్తువ నీదంటే
నెమ్మది నడకకు గురుతవ్వు!

నడిచే గురుతుల నీవుంటే
నెమ్మది నమ్మిన అడుగవ్వు!

When you can Fly..
Just Run.
When you can Run..
Simply Walk.
When you can Walk...
Keep Walking..