Saturday, March 26, 2016

నీలి అంబరం

నీలపు అంబరమేం గీసింది
గాలీ సంబరమై ఎగసింది
అల మరి వందలలోఒకటై కదిలింది
కలలో తీరం చేరే దారి వెతికింది
ఏమీ ఆగక పరుగున కదిలింది
రానూ రానని అనలేనంది

పదములు కదిలే పూతలమాటలు
పదునున వదిలే పోటులచాటులు
పోరుబాటన పరిగెత్తిస్తుంటే
పొగరులకోటలు కొట్టెస్తుంటే
ఆపకు ఆపకు ఆగకు నేస్తం
ప్రకృతి జతగా చూపె సమస్తం
ఏదీకాదు తొలగని కష్టం
చూపుల బాటది చేస్తే ఇష్టం

Saturday, March 19, 2016

యాంత్రిక మార్గం

యాంత్రిక మార్గం
==============
కొట్టుకు చచ్చే మార్గపు ద్వారం
వెతికేదాక ఆగనివారం
చంద్రుడు బుధుడూ అంగారకుడు
పాలపుంతకై పరుగులుపెడుతూ
త్రిశంకు స్వర్గపు  తలుపులు తడుతూ
ఎపుడూ చూడని, మలుపులు తెలీని
దారులు వెతికే మనములు కొన్ని

చుట్టూ మనుషుల వెతలెరుగమనిన్నీ
ముట్టీముట్టక బతుకుని దున్ని
చేసే కర్షకకర్మల ఫలములవెన్ని ?
రాక్షక బల్లుల అస్థికలెన్ని ?
రావణ కాష్టపు శీర్షికలెన్ని?
యంత్ర కవాతుల మేధలవెన్ని?
ఆకలిచావుల చేతలవెన్ని?
మనిషిగ నిలపని గోడలు కొన్ని
కసిరాబందుల పరిశ్రమంటూ
లోభపు మసితో మలినం చేస్తూ
ఘడియల గడిపే భ్రష్టుల ఆనలె అవన్నీ ?
మనసుల తాకే కథలను అల్లి మరిన్నీ
అసువుల బట్టే కథలను ఎంచీ కొన్ని
రాసే శ్రమతో
తాకే శ్వాసతో
బతుకును నీవే
వెతికెయ్ వెతికెయ్
విడి రహదారుల
గమనమునొదిలెయ్!

అలికిడి దూరం

అలికిడి దూరం
============
ఇల్లు దాటితే నువ్వూ నేనూ
విడగొడుతున్న పక్షులమేను
వీధీ ఊరూ
చివరున పేరు
పల్లె పట్నం
రంగుల రాట్నం
వర్ణపు చట్రం
వాగుల మట్టం
భాష రాష్ట్రం
దేశ విదేశం
వలసలు కొన్ని
విషములు కొన్ని
వడిగా మెదడును వురికిస్తుంటే
వాడిగ వేడిగా మరిగిస్తుంటే
విడి అలజడిగా అగుపిస్తుంటే
మనుగడ ముడులే తొలగిస్తుంటే
ఎక్కడ ఆపాం?
ఎటుకై సాగాం?
ఎక్కడ ఆగాం ?
ఎటుకై లాగాం?

ఆశా సమీరం

ఆశా సమీరం ======== అన్నముపెట్టిన అమ్మల తోడు నాన్నలు గిట్టిన అమ్ముల తోడు ఎవరూలేరను తమ్ముల జూడు అన్నీ తానని కట్టిన జతగాడు కరువై గడిపే క్షణములజోడున ఎవరూలేరని అనుకునే నాడు ఒంటరి గమనపు పాతిక యీడు వెనకొదిలేసిన మలుపు గూళ్లను జూడు కదిలే గమనమే శరీరగోడు వెతలకు వదిలితే వివేకము ఓడు వదలని అమృతఙ్ఞాపకముల తోడు ఎపుడూ విడువని క్షణమవు నేడు నువ్వే కదిలిన నలుగురి తోడు నీబోటోండ్లకు ఎముకై చూడు నడిచీ అలవని శ్రమలలో నేడు నిను బతికించిన ఒక్కొక్కరే నేడు ప్రకృతినొదిగే ప్రతిబింబాలే జూడు నిన్ను కదిపిన నవ్వులతోడు చుట్టూ మిగిలెను ఆపక చూడు మోడులతోడు, గోడులతోడు ఇపుడోమారు సరిచేసి చూడు నీ మనసన్నది - మలుపును చూడు నువ్వే ఓడితే, ఓటమి గోడు వినువారుండరు గెలిచి చూడు ఎవరున్నారని పుట్టిననాడు నీవెవరన్నది చెప్పినతోడు నువుకాదన్నది ఎరిగిన నాడు నీ నిశ్వాసల గమనపు కీడు నడిచే ఆశల గళమై నేడు వెతనెనకొదిలే శ్వాసల తోడు నీవేనీవని తెలిపే కథలో రేడు మరెవరో కాదని తెలిపే వాడు ఎవడో వేరే వేలుపు కాడు నీలో వెలిగే దీపపు తోడు నిలిచే చమురై కదులుము నేడు కనులలో వెలుగులు చిమ్ముతూ చూడు కాంతులు తలరాతల రాయుము నేడు!

Monday, March 14, 2016

ధననిర్మాల్యం

ధననిర్మాల్యం
================
అరకొర దుస్తుల మాసపు ప్రతిమలు
అమ్మికలేమో ఆంగ్లపు మదిరలు
ఆటలవంటే గుర్రపు పరుగులు
దొరకనికొన్ని కప్పుల తప్పులు
ఎగిరిన విమాన అప్పులు తిప్పలు
లకుముకిపిట్టయి ఆడిస్తుంటే
చుట్టూ ఎరుపై ఘోషిస్తుంటే
చట్టపు మొదటిపుటలను పడితే
కొఠీపేఠీబాబుల జతలే చెడితే
ఖర్చులపూడ్పుకై కుదువలుపెట్టి
తన పరపతినే అప్పులబెట్టి
తాళగలేక కొన్నిటి ఖరీదు కట్టి
తందానాలకు విరామమెట్టి
ఆంగ్లపుతోటన పాగాపెట్టి
రోజుకోమారు తలుపులుతట్టి
తనురానందుకు కబురనిపెట్టి
వ్యసనములన్నీ మనసునబట్టి
వ్యాపారములే తనఖాబెట్టిన
మాల్యాబాబుకు సలాముకొట్టే
మూల్యపు వ్యసనపు ఖరీదు కట్టే
షరాబు ఎవడూ ధరణిలో లేడోయ్!

Sunday, March 13, 2016

మధుప్రియం

కన్నవారినే ఖర్మపు కసాయివారని,
కాసులకర్మంబెరుగని భారం తోడవుతున్నా
కాలుదాటెక్కిన ఖాకీగడపే మళ్ళీ ఎక్కే
కాటుకకని కన్నీళ్ళేడ్చెను మధుప్రియంబై.

Saturday, March 12, 2016

ప్రభాతరాగం

అచ్చంగా తెలుగులో వింజమూరి వేంకట అప్పారావు గారి ప్రభాతరాగానికి కవితసేత..

చలనంలేక తొంగొనియుంటూ
కలుపుమొక్కలా తొలిచేస్తుంటే
పచ్చనిస్వప్నం చూసేదెట్టా?

కలుపుగోలు మరి కనబడదంటూ
అడ్డగోలుగా పెరిగేస్తుంటే
మనవను మాటలు తెలిసేదెట్టా?

కౌలుకుగృహమున కట్టడదంటూ
మూలనలాగ మూల్గేస్తుంటే
వాకిలిదారులు కనపడవట్టా!

వీచేగాలులు పీల్చుకుతింటూ
మానులలాగ బతికేస్తుంటే
రాలేఫలాలనన్నా నువ్విచ్చేదెట్టా!

స్వరాలకష్టం ఎవరిదోయంటూ
సవాళ్ళ వెనకదారేదంటే
ప్రగతికిబాటలు తెలిసేదెట్టా!

ప్రభాతభానుడు వచ్చాడంటూ
తిమిరంలాగ పరిగెడకుంటే
చుట్టూచీకటి మిత్రమన్నట్టా? 

పుట్టుకచావులు కదలవవంటే
పారేనెత్తురు పరిగెడుతుంటే
ఆగినగాలీ ఎగిరొస్తుంటే
చరమాంకాలు వెదకకపొడిచే
రవికిరణాలే తలుపులుతడితే
రాతిరికేళి పరుగులబడితే
లేలేలెమ్మని పిలుపులుపెడితే
ఎందుకు నీకీ నిదురలజగతి
ఎందుకు నీకీ ఆవాహనస్థితి

పరుగులు నీవి
పదములు నీవి
పలుకులు నీవి
పని మరి నీది
పాతలవాటులు
పెరటికి నెట్టి
పాటుల బాటలు
పుక్కినబట్టి
పరుపులవన్నీ
పక్కనబెట్టి
ప్రగతికి నీవే
పథములు వెదికెయ్!

Tuesday, March 8, 2016

వనితా ఓ వనితా!

వనితా ఓ వనితా
తొలి పేగుబంధంలా
చెల్లి స్నేహచందంలా
చెలి ఏడడుగులందంలా
చిన్ని కుటుంబానందంలా
ఎన్ని రూపాంతరాలైనా
ప్రతి అతుకు దారం నీవై
ఎన్ని అవాంతరాలున్నా
ప్రతి వెతుకు మారం నీవై
నను కదిలించిన
నను నడిపించిన
నను నిలిపుంచిన
సంస్కారాఘ్రణీ
సంసారాగ్రణీ
కరుణరసాగ్రణీ
స్నేహపు ధరణీ
మోహపు తరుణీ
ఊహల జననీ
నా ఇందుమణీ
నా అగ్నిమణీ
నా అభ్రమణీ
నా అహర్మణీ
గృహమణీ
రమణీ
వనితా ఓ వనితా!

Saturday, March 5, 2016

ప్రగతికి మెట్లు

Morning poem after watching the intelligent going on brain drain, brainless exploiting the system,  so-called experts tweaking news, common man lacking questioning in four pillars of society :

నిదురలు ఓడిన ప్రశ్నార్థాలు
మదుపుల మోడున పొదుపర్థాలు
అపజయం అవసరం
కలవని పాట్లు
విజయం దూరం
కలిపిన చోట్లు
దూరపు వలసల మేధో మార్గం
దారపు మెలికల మదినో దుర్గం
ధరాతలంలో ద్రవ్యోల్భణంలా
దరికీ దారికి చేరువకాక
దొరికే దారుల చరియిస్తుంటే
దాటని భారపు చరియౌతుంటే!

సంక్షేమంలో ఎదిగిన స్వరాలు
సమూహ క్షేమం ఎదగని తరాలు
సమాజ అక్కర మెదలని చరాలు 
స్వార్థపు సంఘం వదిలిన శరాలు
సంధిస్తుంటే 
శోధిస్తుంటే
సొదలా ఎదలో 
రోదిస్తుంటే
ఇవి నీకథలని
బోధిస్తుంటే!
ఇజాలజాలపు విద్యాలయాలు
భుజాలగాలపు రాజ్యాలయాలు
బాజాలగోలల ఆద్యాలయాలు
పాలితబలాల విషవలయాలు
నిజాలు కొన్నే
భజనలు అన్నీ
మరువనివెన్ని?
బరువనేవెన్ని?
బదులని కొన్ని
వదులని కొన్ని
వదలని కొన్ని
గదులను ఎన్ని
తిష్టాగోష్టులు ఎంచుకొనిన్నీ
దుష్టారిష్టులు పెంచుకొనిన్నీ
కన్నయ్యలలా గొడవలుపన్ని
అంతర్జాలపు తోడునకొన్నీ 
మార్జాలంలా తోడిమరిన్నీ
మృతజీవాల కథలు ఇవన్నీ
మనుగడ చేరే మజిలీలెన్ని?
తెలియనివన్నీ
చదువని దున్ని
శరీరకష్టం పరిప్లవించే
ఎవరికి తెలియని కథలు ఇవన్నీ?

ఇదా కథంటూ వింటూపోతే
ఇదే కళంటూ తలంటిపోసే
వృధార్థ రాతలే 
ఉదంత వ్యధితలే
కోట్లకు కోట్లు, 
ఓట్లకు నోట్లు
ఒట్టుల గాట్లు,
కాట్లు  చివాట్లు,
లోటలవాట్లు
అక్కున చీట్లు
అరి సిగపట్లు 
ఇలాంటి రాతలే మనకున్నట్లు  
సూట్లు బూట్లతో  
నోటిలో తూట్లు
తొక్కే చోట్లు
ఎక్కే మెట్లు
కతికే నోట్లు
బతికే చోట్లు 
స్వామ్యపు వెన్నున 
వదలక పోట్లు
సవాలు పెన్నుల
మొదలున తూట్లు
వార్తల పేరిట ఉతికెయ్యాలని
బర్ఖా బాటన బాతాఖానీ
అర్ణబు నోటన ప్రతిదీ ఖూనీ
నటనల చాటున దాటే గట్లు
తెగుతూపోతే ప్రగతికి మెట్లు
నీకూ నాకూ  పట్టదన్నట్లు
ఎలాగ ఉంటాం, చెప్పేదెట్లు?

దైన్యపు ధైర్యము దాటని గడపలు
గాలుల పయనపు వాటపు పడవలు
దారే వెదకక కదలకయుంటే
ఏదీ పట్టని మనసుకు తూట్లు
పొడుస్తూ వెళ్ళే మాటలవాట్లు
చెప్పేవారు ఎవరన్నట్లు
చుట్టూచూడక వెయ్యుము నాట్లు
నీదే జగతని చాటేటట్లు
అడుగేయ్ అడిగేయ్!
వడిగా జడిగా
గడులని వదిలేయ్!
అడుగుల సడిగా
తడులని చెరిపేయ్!
మానుల మనసుల
కథలని మార్చేయ్!
మనసులు కదిపే
మనిషిగ అడుగేయ్!