Thursday, June 23, 2016

ఉడత భక్తి

కొమ్మల్లో తొంగిచూసి
కోమలిలా ఎదురువచ్చి
కొంటెగా ఓ చూపిచ్చి
కొండమల్లి మొక్కనెక్కి
కొంతైనా చూడమంటూ
కొంపలేం మునగవంటూ
కొంతటు కదిలిందేమో
కొంగొత్తగ పూలన్న్నీ
కొప్పుల్లో మల్లెలల్లే
కొత్తగా జారి పడుతుంటే
కొంకర్లుపోతూ నవ్వుకుంటూ
కొమ్మలుపట్టుకు దూకింది!
కొంచెం సిగ్గుపడి
కొంతైనా మనసుపడి
కొండంత ఆశపడి
కొంచెపడిన గుండెవడి
కొంచెం నిదానించుకుంటూ
కొంగజపం నాదికాదన్నట్టు
కొంపదీసి మనసిచ్చాననుకుంటూ
కొందళించు కనురెప్పలను
కమనీయ రూపంలా దాచి !
కొంటెకోమలిబోలు జీవానికి
కొన్ని పదాల్లో ప్రేమనిలా
కొంతలోకొంత ఉడతా భక్తిగా!

(జన్12 ఉడత కొనసాగింపుగా)

Tuesday, June 21, 2016

విధి విధానం

విధి విధానం
-----------
సూర్య నమస్కారం -
అడిగే ఆస్కారం రానీనంటూ 
ప్రభాతాన్నే దర్శనమిస్తున్నాడు! 

చీకటి భయం -
విశ్రాంతికి అభయం తానంటూ 
ప్రతిరాత్రీ దర్శనమిస్తోంది!

వెన్నెల ధనం  -
చూసేవారి సృజనధనం నేనంటూ 
మాసం చాటున సంపదై కురుస్తోంది!

ఋతువుల పిలుపు -
తామే తిథిఫలాలు చూసుకున్నట్టు
ప్రతి సంవత్సరం అందర్నీ పలకరిస్తున్నాయి!

కాసే ఎండ 
వీచే గాలి
కురిసే వాన
విరిసే పూలు
ఎగిరే పక్షులు
జరిగే రోజులు
సాలీడు గూళ్ళు
గిట్టని రాళ్ళు
ఇవేవీ 
నీతో మొదలవలేదు
నీతో అంతంకావు
అవి నేర్వరాలేదు
నువ్వు నేర్పనూలేవు
నేర్చుకోవటం తప్ప!

కర్మ యోగం 
ధర్మ యాగం
జనన మర్మం
కాల ధర్మం 
జీవితక్షణం 
అమృత కణం
ప్రకృతి పక్కన 
ఉమ్మడి అక్కర
తెలిసిన మనసులు
గడిపే క్షణాల  
విధి విధానం!   

Monday, June 20, 2016

సంధ్యగీతలు

సూర్యుడు వెళ్ళిపోతూంటే
ఆకాశం అడిగిందో ఏమో
ఆనవాలు రేఖాచిత్రాలు
ఎన్నో గీసిచ్చాడు
అరుణారుణ కిరణాల్తో!

గీచేబొమ్మలలా రోజూ మారుతుంటే
పరుగునాపి చూశారో ఏమో
కుంచెవాలకం కుదిరి చిత్రకారులు
ఎన్నో గీసిచ్చారు
సృజనాత్మక వర్ణాల్లో!

రంగులలా నింపుకుపోతే
బడివదలి చూశారో ఏమో
స్వేచ్ఛాపతాకాలై ఎగిరే బాలలు
ఎన్నో గీసిచ్చారు
ఆనందనర్తనా హరిణాలై!

అంతస్తుల గాజుకిటికీ పని దింపుకుపోతే
ఎదర ఖరీదైన చిత్రపటం చూశాడో ఏమో
బాల్యం రివ్వున కదలి ఆ యజమాని
తనలో తానే నవ్వేశాడు
క్షణపిచ్చి వదలిన జీవం తానై!

Sunday, June 19, 2016

భావనాక్షరాలు

తెలిసినకళ్ళ లోతు చేరాల్సిన అక్షరం
కళ్ళకు తెలిసిన భావాలనే అక్షరాల్లో
భూతద్దంలా వెతుక్కుంటున్నాయి

పూర్వాపర సందర్భాల విశృంఖలబంధంలో
సమయాసుర అహపుసంధ్యల కిరణాలతో
నారింజరంగు పులిమేసుకుంటున్నాయి

పగలంతా పడివున్నా ఎవరూచూడని తారలతో శశి
పాళీనిండా ప్రపంచంలో మరో భావనాక్షరాలతో
స్వేచ్ఛాభావాలు నింపుకుపోతున్నారు

ఆ కళ్ళలోతు భూతద్దాలకందని భావం
గుండెల్లో వెతుక్కుని దీవించింది
అక్షరం క్షరంకాక కదిలించింది

Thursday, June 16, 2016

విత్తులు

ఎవరో నాటిన విత్తనం
వృక్షమై మనకు నీడ, పళ్ళు ఇస్తోంది
ఎవరో విసిరిన విత్తులన్నీ
విభిన్న ప్రకృతి రూపాల్లో
వనాలై పీల్చేగాలినిస్తున్నాయి

మనమేవీ నాటంటంలేదు
అంతరించిపోయేవి జంతువులేనా,
మన ఆనందం, నీరూ, శ్వాసా కాదా!

చిన్నప్పటి జమ్మిచెట్టుకు
చుట్టూ తిరగటం ఓ పండుగ
ఇప్పుడది గుళ్ళల్లో దర్శనమిస్తోంది పూలకుండిల్లో
ఎంత ఎదిగాం మనం సన్నబరుస్తూ!

పెరిగేప్పటి వేపచెట్టు పూవు
ఎక్కి కోయటం గుర్తోందా?  అదీ పండగే
ఇప్పుడది చలిమరగదుల్లో ఉక్కపోతబడి దొరుకుతోంది
పక్కనే ఉన్న పుష్పవిలాపం చూస్తూ!

పల్లెల్లో తిరిగేప్పటి చెరువుపక్క మర్రిచెట్టుకు
దారాలు వేళ్ళాడదీసి ఊగటం అదీ పండగే
ఇప్పుడవి మరుజీవాలై ప్రదర్శనశాలల్లో కనబడ్డాయి
ఎంత వైఙ్ఞానికంగా ఎదిగాం మనం!

మారేడు గన్నేరు దేవదారు
మల్లె మరువం సన్నజాజి మందారం
కానుగ కొబ్బరి చివరికి కరివేపాకు
ఏదీ ఇంటివెనకా ముందూ లేదు
ఇంట్లో ధనాన్నిస్తాయనే తీగలు తప్ప,
మళ్ళీ ఎవరయినా విత్తనాల్ని పైనుంచి చల్లితే బాగుణ్ణు
ఇంకోతరం వనభోజనాలు వనవిహారం చేసుకోవడానికి!
ఆనందం ఆరుబయల్లో ఉంటుందనే ఆలోచన మొలకెత్తుకోడానికి!

Monday, June 13, 2016

ఆకుపచ్చ హృదయాలు

నిటారుగా నిలబడి
పలకరించుకున్న రెండు జీవాలు
మాటలు కలుపుకొన్నాయి

చిన్నప్పుడు భూమికి జానెడెత్తులో
మొదటి సారి పరిచయమైన జ్ఞాపకాలు
మధురంగా నెమరేసుకున్నాయి

చుట్టూ ఆకుపచ్చచాపేసుకుని
వెన్నెల్లో చెప్పుకున్న కబుర్లు,
గాలి గిరాటెయ్యబోతే పడని ధైర్యపు ఆనులు,
చల్లగాలి నవనాడుల్లో చేరిన క్షణపు గిలిగింతలు,
వర్షం తడిసి ముద్దచేస్తే ప్రకృతి ఆచ్ఛాదనలో కౌగిలింతలు

కొమ్మాడించి చెవినేసుకున్నాయి

చుట్టూ పెంచుకున్న కుటుంబం
వయసుతో బలపడి ఎదిగిన స్నేహాలు
అన్నింటినీ ఆ పచ్చని చాపతో
కళ్ళముందే కాల్చేస్తుంటే,
దాహానికి నీళ్ళిచ్చిన కాలువ
నీళ్ళులేక మురికికాలువై
హర్మ్యాల కిందకి పోతే
మనల్ని ఎందుకు వదిలాడు చెప్మా
ఆ పర్యావరణ అధికారి అనుకుంటూ
సమాలోచనంలో పడ్డాయి

అంతలో అటు అంతస్థుల్లోంచి దిగిన
మరమెట్లయంత్రం
ఓ పిల్లాణ్ణి బయటకు పంపింది
ఆ పిల్లాడు బంతినెగరేసి
ఆ రెండింటి నీడపట్టున ఆడటం మొదలెట్టాడు
ఒక మనిషి చేతినిండా సంచీలతో
ఆ నీడలోకే చెమటలు కక్కుతూ వచ్చాడు
బాగా పరిచయం ఉన్నట్లు తలెత్తి చూశాడు
దగ్గరికి రమ్మని ఆడుకుంటున్న కొడుకుని పిలిచాడు
ఓ నిర్లిప్తత లిప్తపాటు చుట్టూరా
రెండు జీవాలు నవ్వుతూ ఊగాయి
ఆ మనిషి తన ఉద్యోగం కబుర్లు చెబుతుంటే విని
మా కుటుంబం ఎందుకు కాల్చేసావని
మమ్మల్ని ఎందుకు వదిలేశావని
హోరెత్తిన గాలితో కలిసి ప్రశ్నించాయి
ఆ రెండు చెట్లు!

Saturday, June 11, 2016

అన్వేషణ

జీవితంలో ప్రతిసారీ గమనం వెతికే
రెండు దార్లు
పాతని నిలిపేసి పాదముద్రల మార్గంలో
తెలిసిన నిశ్శబ్దయుద్ధం  !
పదమని నిలదీసే ముద్రల్లేని దారిలో
తెలియని చిరుధైర్యపుటద్దం!

గమ్యం చేరే గమనపు అన్వేషణలో
తప్పిపోయిన నేను
"నన్నే" తెలుసుకుంటున్న నేను!

ఒంటరిగా వెళ్తున్న కారడవి
కదలనీయని అడ్డంగా  పెద్దకొండ
అవతలేముందో తెలీని అమాయకత్వం
దొరకని చేతిసాయంకై ప్రార్థన
వరమయిన ఎగిరే కీలుగుర్రం
గట్టెక్కించిన గుర్రంపై రాజకుమారుడు
కొండపైన ఎక్కిస్తే
కిందంతా
పువ్వల్లే పొలాలు,
గడ్డిముంతల్లే లోయలు
భూమివింతల్ని మించే ప్రకృతినగాలు
కాలిచెంత మేఘమాలికలు
కాలికింద నాతో కొండెక్కిన రేణువు
మనుషులెవరూ కనబడట్లేదు
మాయమయ్యారో ఏమో?
కలకాని జీవితం
కలలా ఎదురుగా
కనబడి కథ నీదంటే
స్నేహంగా శాంతపు హృదయం
సృష్టి ఇచ్చిన స్వచ్ఛపు గాలి
ముందేమో మరి రెండు గమనపుదార్లు
ఎందులోనో మరో అన్వేషణ ?

తెలిసిన పాత కాలిముద్రల్లో
గెలిచిన యుద్ధం రారమ్మంది  !
తెలియని నగాలపై ముద్రేయాలని
ధైర్యపు అద్దం మనసయ్యింది!
ఆగని అనుభూతుల అన్వేషణలో
రోజూ తప్పిపోవాలనుంది!

నువుకోరే, నీవొదిలే
నీ గమ్యం, నీ గమనపు ఆనవాలు
"నీది" అనేదేదంటూ
నన్ను నేనే ప్రశ్నిస్తే
ఆత్రంగా అడుగు కదలి
నన్ను నేను తెలుసుకునే
ముందుమలుపుతో అదే పరిచయం వెతుక్కుంది
ఆగని అన్వేషణ మళ్ళీ పలకరించింది!


Friday, June 10, 2016

మనసుతో మాట

ఉల్లిపొరలా నా తెరలను నేను తీసుకుంటూ
నిన్ను చేరాలని నీకెంతో ఆశ

మల్లెతొనలా నీ స్వచ్ఛమైన తెల్లని గుభాలింపు
నన్ను చేరాలనా నీ నిశ్వాస

గడ్డిమొనలా నీకైన గాయలతో ఆ పొడుపు పలకరింపు
నన్ను తొలచాలనా వదలని ఙ్ఞాపకాలు !

గుడ్డివలల్లో నే పడకూడదనే నీ అంతఃకరణ శుద్ఢి
నన్ను గెలిచావనే నీ అద్దంలా చూపిన బుద్ఢి !

గరికపూలలా నే వదిలేస్తే నీవు పడిన కష్టాలు
నన్ను వదలకుండా నాతోనే నువ్వు గడిపిన మధురక్షణాలు!

నువ్వూ నేను - శ్వాసా నిశ్వాస
నాలో నీవు -నీ కవచమై నేను
నా ఉనికై నీవు - నీ కనులయి నేను
ఇద్దరం ఒకరమనే నడత
నువ్వున్నావని తెలిసిన రోజునుంచి
నాతో నీ తోడై సహగమిస్తోంది!

నాలోనే ఉండే నిన్ను
నీతోనే ఉండే నేను
తనివితీరా చూద్దామంటే
తనువొదిలి మాటాడదామంటే
బాహ్యప్రపంచం కప్పిన తొడుగొకటి
భారంగా అడ్డుపడిందా!

నీ జతగా ఉండాల్సిన నన్ను
నా లతగా ఎదగాల్సిన నిన్ను
నా వెతికే వెతగా మలచానని తెలిసేప్పటికి,
నా అడుగును వదలని నీ అడుగులు చూసేప్పటికి,
జీవితం శరీరంలా వయసుడుగుతోంది!
అలాంటిదేదీ నీకు తెలియదుగా?
నువ్వు నిత్యయవ్వనురాలివి!

నీకూ నాకే తెలిసిన మిత్రుడితో
నా నీ ఆలొచనల మేఘదూతం
అక్షరమై మెలిపెట్టాలా!
నువ్వే గుండెలని మీటి
ఎదసడివై వినబడితే పోలా!

అలా స్వచ్ఛంగా నీలా
"నేను" అనేది ఏదీ తాకని
నిరహంకారివై నీవున్నావనే
భగవత్ సాక్షాత్కారంలా
నాతో ప్రతిక్షణం ఉండిపోవా!
నా స్తుతి నీకే! నీకే!
నా నిరతి నీవే! నీవే!
నా గతి నీతో! నీకై!
నా సహజీవనచరీ!
నా మనసా! మనసా!

(మనిషి మనసుతో మాట్లాడుకున్న మాటలు)

Thursday, June 9, 2016

తొలిప్రేమ రాత

తొలిప్రేమ
-----------
ఏమోయ్! నేను నీకు గుర్తున్నానా?

నువ్వు బలపం పట్టి
నల్లటి అద్దంలా వున్న ఆ పలకని
తేరిపారాచూస్తే
నీ కొనవేళ్ళు కదిలి ఒక్కటయి
నన్ను పరిచయం చేస్తే
నీ కనుల మెరుపయ్యాను
గుర్తొచ్చానా?

నువ్వు పెరిగి
ఓ రెండు గీతల్లో ఇమడలేక
ఇంకా వందసార్లు నన్ను చూడాల్సొస్తే
నీకు చేయిసాయం చేసి
నేను వొద్దికగా నీ చేయినొదలక
స్వేచ్చను ఒదిలి, రెండు గీతల్లో ఇమిడి,
నిన్ను గెలిపించాను
చేయొదిలేశావేం?

నేను నీవెంటే వుంటే
నీకు పెట్టే ప్రతిపరీక్షలో
నిన్ను  గెలిపిస్తుంటే
పెరిగి పెద్దయ్యావని
పేరు తెచ్చుకు వెళ్తున్నావని
ప్రతి ఊరూ నీతోవస్తే
నీ ప్రతి రాతబల్లతో స్నేహంచేస్తే
ఇనుప అట్టలా మనసులేని దాన్ననుకున్నావా?
తెల్లటి మనసున్న కాగితాన్నీ,
సిరారక్తం ఇంకక తలపులను నిక్షిప్తం చేసిన నన్నూ,
అలా గాలికి వదిలేసి
వెళ్ళిపోయావేం నీకిది తగునా?

ఏదో పదేపదే సన్నాయినొక్కులతో
స్వేచ్చలేకుండా గడిపేస్తున్నావని తెలిసి
నిన్ను కలుద్దామని వచ్చాను
ఓసారి చేయికి పనిపెట్టి
తెల్లటి కాగితపు మనసు తెరిచి
నన్ను ఆహ్వానించు నీ మదినింట్లోకి
నీ వేళ్ళమధ్య కలంజోడీగా
మళ్ళీ ఆడాలనుంది!

నీ స్వేచ్ఛాప్రపంచంలో
నీ తలరాతలు చేరిన తీరం
నాకూ చూపించవా నేస్తం
నేను మధురాక్షరం చేస్తాను,
ఆ యాంత్రిక ఒంపుల్లో మా అందం
నీకెప్పుడు దక్కునోయి!
ఒక్కసారి నన్ను మళ్ళీ ప్రేమించు
నీకు నీ స్వశక్తిని పరిచయం చేస్తాను
నేను!
నీ ప్రేయసిని!
నీ రాతని!  

Tuesday, June 7, 2016

లండను యాత్ర

ఓ రాణీ జన్మ పురాణం
ఆమె ఇంటికి అయిన ఖర్చులు
ప్రాకారాలు, ఆకారాలు
నౌకామార్గపు  రాజ్యాక్రమణలు
కొట్టుకొచ్చిన ఎన్నో శిల్పాలు
పట్టుమనిచ్చిన కొన్ని వజ్రాలు
దొరల్లా ప్రదర్శించే సంగ్రహాలయాలు,
దోచుకుపోకుండా రాజ్యపుకాలం భటులు!
దేవుడిని గుర్తుచేసే ప్రార్థనాలయాలు
శిల్పశౌందర్యం తగ్గని గాజూఅలయాలు!
విరులు, విరితేనియల ఉద్యానవనాలు
మధ్యలో విడిదిని పోలే కోటలు,
యువరాణుల ఆటలు పాటలు,
ప్రతిదీ వార్తగ తెలిపే  పర్యాటక నిర్దేశకులు !
భూమిని చీల్చుకు వెడలే ధూమశకటాలు
ఇంచుకు కనబడకుండా సొరంగదారులు
దిగితే గాలికై పరిగెత్తేందుకు మెట్లు, గట్లు!
యుద్ధాలు చూసిన నేల మాళిగలు
ఆ వేళ యుక్తులు చూపే నేత వాడుకలు !
ఊరిపై తలెత్తుకు తిరిగే గుండు కన్ను
కన్నుమెదపక ఆడే వందేళ్ళ గడ్డిబంతి మన్ను!
రాజ్యాలు పోయినా రాచరిక గూళ్ళు
ఆ మర్యాదలు చూపే కవాతు సన్నాయి వాళ్ళు!
ఊరంతా నదిపై వంతెన దార్లు
అవి తెరుచుకుని తెలుపుకునే కథల బార్లు !
మధ్యలో రొజుని పరిగెత్తించి,
పారిసుకు పదపదమని పరుగులంఘించి,
ఒక కొననవ్వుల జవ్వని కొరకై
మరొక త్రికోణబురుజుల ఐఫిలు మెరుపై
తిరుగాడి వెనకొచ్చేస్తే
చరిత్రమొత్తం చిత్రంగా చిత్రాలలో తెలిసే!