Wednesday, April 5, 2017

సీతారాములు

రాముని కర్మల మర్మము
రామాయని దలచినపుడె రాజిలునయ్యా!
రామా! నీవే శరణను
జామున బ్రోవంగరాడె జానకితోడన్!

ఎక్కడి సరయూనది? మ
రెక్కడి దక్షిణపుజలధి? నెక్కడ నడవం
గొక్కొక్కరు దరిని గలియు?
టెక్కడ జెరలందు సతి? యిదెక్కడి మాయో?

అంతయు నీవని దలచిన
నెంతటి కష్టములయున్న డెందము నీదై
నంతట గరుణామూర్తిగ
చింతల దీర్చంగరావె చిద్రూపుడవై!

నీ కొనజేతిని దాకిన
నాకము జూసెను జటాయు నాతియు హనుమన్!
నా కనురూపము నీవై
నీ కొనజేతిని విడవని నీతము జూపుమ్!

నీతో గలిసిన నీ సతి
నీ తోడను తల్లిదండ్రి నీ భ్రాతలిలన్
నీ తోటి వనచరంబులు
మా తోడగు నడతనేర్ప మాతో నీవే!

చక్కగ గొట్టెడి వానికి
చిక్కగ రాసినను హలునిచిత్తము వానిన్
దిక్కులు దోచని దాసుని
నెక్కడ జూచినను నీవు నెమ్మికదొరవే!

నీవాదర్శము జగముల
నీవే సకలపు వెలుగును నీడయు నీవే!
నీవే నెగిరెడి వానర
జీవము సార్థకముజేయు జీవాత్మభవున్!

అమ్మా! తాకగ రమ్మనె
నమ్మా! నగుమోముజూడ నవ్వినయంతన్
నమ్మకమై రాలె విరులు
చెమ్మయె దాకిన కనులను చెట్టే నిలిచెన్!

శోకము తల్లికటంచు న
శోకము శోకమును దాచి శోభిల్లు లతల్
శోకాతీతను సీతను
యేకాకిని జేయలేక యేపుగ బెరిగెన్!

రాలెను సుమములు శుభమని
వాలెను తరువులు లతలును వారిజములతో
గాలియె తిరుగాడి నలియు
సోలదు సీతమ్మ తానశోకము దిగువన్!

వచ్చెడి వాడే రాముడు,
జచ్చెడి వాడిలను గరికజట్టని దెలిపెన్
ముచ్చెమటలు బోయించుట
నచ్చెరువా తల్లికనగ నచ్చెరువేలా!