Saturday, February 25, 2017

వింతమనిషి

గాలి అనేది నీ నా చుట్టూ అన్నింటావున్నా
దేవుణ్ణి విగ్రహాల వరసల్లోచూసి
వెతుకుతున్నాడు మనిషి!

నీటికి నీ నా దాహం తీర్చే శక్తున్నా
గంగమ్మని కొందరికే పరిమితం చేసి
గిరిగీతల ఆనకట్టలు కడుతున్నాడు మనిషి!

భూమికి చెట్టుకి నిన్నూ నన్నూ నిలబెట్టే ఓర్పున్నా
హర్మ్యాలకోసం తూట్లు పొడిచి
హరితవస్త్రాపహరణాలు చేస్తున్నాడు మనిషి!

ఆకాశానికి నీకూ నాకూ అందాన్నిచూపే నేర్పున్నా
కిటికీలకు గాజుల్ని పరదాల్ని కప్పేసి
ప్రకృతిఅందాల్ని కృత్రిమగాజుగోడలపై వేస్తున్నాడు మనిషి!

అగ్నిగా మండే గుణం గుండెల్లో దుమికేస్తున్నా
సొంత ప్రాంత వింత ముంతల్లో విభేదవిద్వేషాలను రాజేసి
మాటల్లేని నిర్జీవభస్మానికి దగ్గరగా కాల్చేసుకుంటున్నాడు మనిషి!

పంచభూతాల కలయిక తానై పుట్టిన ప్రపంచంలో
ఇంచుకైనా సార్థకత వెదకనంటే
మానవత్వం మనిషి సొత్తని
మనసుకరుణ మహికి విత్తని తెలిసే
తనకుతెలియని తెలివినే మరి
వెదకలేడా వెన్నుకాడా వింతమనిషి!

Friday, February 24, 2017

గొలుసు

మరుడే మదిగౌరి గలుప
హరుడై తుదిజేర్చువేళ హరమే సురలన్
వరుడై వనజను జేరెడి
హరుడా హరుడనరె సురలు, హరహరదేవా!

భారము నీదేనంచును
భారతిపై భారమిడగ భావము దానై
భారతమే బలుకగలదు,
భారము గాదు మొదలెట్ట భావకవితలోన్!

బుడతల తలలోని దపన
బడలిక నెరుగక వెతికెడి బడి మనబడియే
నడతను భాషను కథలను
గడపల సంస్కృతిని దెలిపి గమనము నేర్పున్!

కమ్మటి మాటల యమ్మను
గమ్మున ప్రేమలిడు మాటగతిలో నాన్నన్
తెమ్మని గలిపిన తేటద
నమ్మిల తెలుగనగ జదువు నమ్మిక దెలియున్

Thursday, February 23, 2017

మహా శివరాత్రి

హరుడన శివుడన సంభవ
హరుడన భరుడన భవపాపహరుడన కాళే
శ్వరుడన శరుడన విష
హరుడన భైరవుడన, మలహరుడా!  నీవే!

బొమ్మను దునమగ నెంచియు
నమ్మకు తుదగంటినీరు నమ్మిక దీయన్
బొమ్మను దనయుని జేసిన
నమ్మిక కథలెన్ని నీవె! నటరాజప్రభో!

దక్షుని శిక్షించ నీవే!
శిక్షగు వరములను యొసగు శివుడవు నీవే!
రక్షయన రాక్షసులైనను
రక్షణని వరమిచ్చు నార్తరక్షకుడ వీవే!

వదిలితి వాడంబరతను
వదిలిన సతినే వదలక వదిలిన వేళన్
వదిలితివే మోహంబులు
వదిలెడి బంధంబులకును వసువైనావే!

తమకము లేదన్న దొరవు
సుమశర బాణంబు దాకి సుమమగు మనసున్
రమమగు భస్మంబు గనులు
భ్రమరాంబ గనెడి సమయము భ్రమజేసితివే!

పుట్టుటకు బ్రహ్మ ప్రభువని
గట్టున వేయుటకు విష్ణు ఘనపాలకుడున్
గిట్టిన లయకారకుడన
పట్టుగ నీకేమి ముట్టె పర్వదినంబున్!

రాతిరి దినకనె యుండుట
పాతకమను జనులకీవు పాపము నేర్పన్
జాతకమే బాగున్నను
కుతకుతలౌ కడుపునేర్పె కుక్షికిని లేమిన్!

శివుడా! శరణని వేడగ
భవుడై వెన్నంటియుండు భవబాధలనున్
కువకువ లీరవమై నీ
రవమై నాయందునిండు మ్యపు లయతోన్

Tuesday, February 21, 2017

తెలుగువెలుగు

తెలుగును వెలుగని దెలిపిన
తెలివిదొరలు తెలిసిదెలిసి తెలివని దీయన్
తెలుగేదని దెలవకడుగ
తెలుసుకు బతకంగ తెలుగు తెరగుల గలుపున్!

తెలుగే తొలిభాష యనుచు
కల వలె యరిచిన జనులకు కనులే లేవా!
కలలూ బోవును గనులను
నిలలో రవిగాంచు తృటిని, నిక్కము నదియే!

రాయక జదువక జెప్పక
రాయిని దలపైనగొట్టి రాదే యనగన్
రాయే దేవునిరూపై
రాయును బీజాక్షరములు రావని నీకున్!

సంకర యాంకరుభాషల
వంకరబోయేటి తిక్కవంగడములవన్!
చంకలుగుద్దుకు యరచిన
కింకరులే యొచ్చువరకు కించిత్ రాదే!

అమ్మను గాటికి జేర్చగ
దిమ్మరులై దిరుగువారు దిమ్మను లేకన్
కమ్మగ బుట్టిన భాషను
చెమ్మలబుట్టిన కథలను చెరనేసితిరే!

ధర్మము జెప్పుటకు భాష
కర్మము నేర్పంగ భాష కడజూపుటకున్!
కర్మల గలవగ భాషని
మర్మము దెలిసిన, మనుజులు మరియొదులురటే!

అమ్మా! వదలములెమ్మా
లెమ్మా! దశదిశల దెలుగులెక్క గనమ్మా!
నమ్మకమమ్మములెమ్మా!
లెమ్మా! మమ్ములను నడుప లెస్సగరమ్మా!

తెలుగే తెరగని తెలిసిన,
తెలుగును తెలుపని తరుణపు తెరలును తొలగిన్
తెలుగును తెలచెడి తపనల
తెలుగే తలయెత్తుననుచు తెలిమది తెలిపెన్ !

(చంద్ర రెంటచింతల - 21- ఫిబ్రవరి-2017)

Sunday, February 19, 2017

ఆవకాయ

అమ్మా! తినుటకు నేనన,
లెమ్మా! రుచులను గలుపుట లెస్సగదమ్మా!
తెమ్మా తుడిచిన ముక్కల
క్రొమ్మావిని గలుపునంత క్రొంతయు బోదే!

మామిడికాయే జీడిని
భామినికై వదిలియొచ్చె భారతమహినిన్
గోమున గలిపిన కారము
కామితమై నావకాయ కావాలనిరే!

నువ్వులనూనెను బోసిన
కెవ్వనలేదేమిటనగ కెమ్మోవి గనన్
జివ్వనదే మేననుచును
నవ్వెడి పూబోణిజూచి నవనవలాడెన్!

కమ్మని మెంతిని చూర్ణము
గమ్మని, నావాలగలిపి ట్టిగ నూరన్
చెమ్మలబట్టిన మేనే
తెమ్మని జాడీలగలుప తేమొలదనెనే!

ముక్కల జేయుద ననుచున్
బక్కటివారిని వలదని బలవంతులిలన్
చక్కగనెత్తిన గత్తిని
పక్కకు బడకుండ కాయపట్టున గొట్టన్!

ఎక్కడి వారలు వీరే
ముక్కలు జేయంగ బెంచి ముద్దులివనరే!
చిక్కను నేనే యనుచును
పక్కకు నెగిరెను తాను పట్టున గొట్టన్!

ముక్కలు జేయంగనొకరు
ముక్కలు గొనంగనొకరును ముచ్చటలొకరున్
ముక్కల గూరంగనొకరు
ముక్కల దాచంగనొకరు ముచ్చట గలవన్!

కళకళలాడే యింటను
తళతళ యన్నమును జేసి తరుదళములన్
ఇళనెయ్యి గలిపి వేసిన
భళభళ దినియావకాయ భళిభళి యనరే!

కలిపిన జాడీ నిండును
కలిపిన జేతులును పండు కదనపు రంగై
కలిపిన అన్నము పండును
కలిపిన పొడులన్నియుండు కసి కారముతో!

కాయన కానిదిదనిరే !
వేయగ వలదన్న నిలను వేషములనిరే!
రాయగ ఆవకాయనునది
కోయగ బొడిచేటి పొడుపు కోమలిక మిలన్!

శిరమున గంగమ్మ గదిలి
పరమాత్మా యనిన జనుల పరిరక్షణకై
పరమశివుడు కందిపొడిని
వరమివ్వగ నావకాయ వహ్నికి దిగెనా!

అన్నము బ్రహ్మకు రూపము
కన్నుల నెర్రావకాయ కలిసిన దైవం
బన్నను కందిపొడి గలిసి
యున్నట్టి క్షణము లక్ష్మియున్నటులయ్యెన్!

Saturday, February 11, 2017

ఉగ్గాణి

నీటను ముంచుటదేల్చుట
చాటున నూనెలనుగాల్చి చాలనుకొనుటన్
ఘాటగు మిరపనుజల్లుట
మోటగు శిక్షయునుగాదు మోహన సీమన్!

కరకర పెనమున నెగిరెను
వరమని యింటికిని తేగ వద్దనకొచ్చెన్
బిరబిర స్నానము జేసెను
మరమర పోపుల గలిసిన మనసులు మెచ్చెన్!

అమ్మలు తిప్పగ నవ్వెను
కమ్మంగ పసుపునుజల్ల కరముల మెరిసెన్
నిమ్మను పులుపునకీయగ
నమ్మకమౌ రుచులనిచ్చె నచ్చెడిదిదియే!

ఉల్లిని గలిపిన చోటను
పల్లీలను గలుపు చోట, పచ్చిమిరపలన్
జల్లెడి చోటను, బొరుగుల
మెల్లగ గలిపెడి మనసులు మెచ్చరె రుచులన్!

చురచుర కత్తుల బోరెడు
సురలును జూడని రుచులను సుఖముగ సీమన్
బొరుగులు యుగ్గాణవ్వగ
వరమని దినరే మనుషులు వద్దనగలరే!

కరముల నిండుగ దొరికిన
మరమర మనలను గలిపెడి మర్మము నేర్పెన్
బరబర నరికెడి జనములు
వరమని యుగ్గాణి గొనరె వడ్డన సీమన్!