Saturday, April 30, 2016

ఎండలు! ఎండలు!

(నాకెంతో ఇష్టమైన శ్రీశ్రీగారి గంటలుగంటలు - నేటి ఎండలకోసం)
పట్టణాలలో, అరణ్యాలలో
బట్టబయల్లో, పొట్టభయాల్లో
వనములవెంటా, వాహనమెంటా,
గుడిలోనంతా, బడిలోనంతా
కానగమిగిలే, కానలగదులలో

ఎండలు! ఎండలు! ఎండలు! ఎండలు!
ఎండలు! ఎండలు!
మండే గుండెల మర్రిచెట్లనూ
కనని కానుగ నగరారణ్యపు
గుండెల రాలిన వృక్షపుసమిధల
దారుణ హరణపు యఙ్ఞపుహవనపు

ఎండలు! ఎండలు! ఎండలు! ఎండలు!
ఎండలు! ఎండలు!
కణకణ కణకణ కణకణ మండే ఎండలు!
కణకణ కణకణ
కత్తులనెత్తురు, కలవక రాల్చే
ఎండలు! ఎండలు!

పొలమూలేదు, జలమూలేదు,
ఫలాలనందిన దినమూ లేదు,
పొలాలనన్నీ, దారులనెన్ని,
స్థళాల వేలపు, గళాల నేలను,
నరుకుతూ పోయే,
వేరుల చెట్లకు
నారుల పైర్లకు,
దారుల ఎగిరిన
ఆశాశ్వాసల ఏడ్పులు, గాడ్పుల
ఎండలు! ఎండలు!
ఎండలు! ఎండలు!

కర్మాగారము, కట్టు గృహాలు,
కార్యాలయము, కుల భవనాలు,
దేవుని గుడులు, వ్యక్తుల బడులూ,
ప్రాణము లేని ప్రతియొక స్థలములో
నీ నా ఇంటిలో, కంటిలో
ప్రకృతిప్రతిమలులేని
ప్రతియొక మడిలో
ప్రచార జడిలో
కానగరాని కాలపు వృక్షపు,
కాలమునాగని కరాళనృత్యపు
ఎండలు! ఎండలు!
ఎండలు! ఎండలు!


దిక్కులనందూ, చిక్కులయందూ,
ఉదయమునందు, దొరకని విందు,
పరుగులయందు, పరుపులయందు
చిక్కని గాలేదందు, పంఖా ముందు
వదలక చేరే విభులున్నయందు
తిన్నగ తీరుల తొలగని తెరల
వేడిగ మారిన భూమి తల్లుల
గుండెల మండే, మంటలాగుండే
ఎండలు! ఎండలు! ఎండలు! ఎండలు!
ఎండలు! ఎండలు!
కణకణ కణకణ కణకణ మండే ఎండలు!
కణకణ కణకణ
కత్తుల నెత్తురు కలవక రాల్చే
ఎండలు! ఎండలు!

నా కొవ్వొత్తిదీపం- శ్రీశ్రీ

(నేను పుట్టేప్పటికే ఖడ్గసృష్టి వెలుగుల్లో షష్టిపూర్తి జరిపేసుకుని, చదువుకోడానికి, చెదనుకాకపోడానికి కవితలతో కరిగించి వెలిగించిన నా కొవ్వొత్తిదీపం-  శ్రీశ్రీగారి కోసం)
తలయెత్తుకు వెళిపోయావా శ్రీశ్రీ
పలుకంటూ పెను తుఫానుని మాయెదకొదిలి

తలపెట్టినవన్నీ తుది ఆనకపోగా
తనవేదన ఎద బరువు కరువు కాగా,
అటుచూస్తే ఇటు చూస్తే ఎవరో
విప్లవాలని , విభ్రమలని మాయను చేస్తే
ఉరుకుతనం చెణుకుదనం నీ
పదసుకుమారపు హృదయాన్ని రాయని లేపేస్తే
అటుపోతే ఇటుపోతే అంతా
ఛందస్సుతులతో, ముందస్తుతులతో చేరని నిను
ఒక్కణ్ణిచేస్తే నిరాశచెందక, విరామమొందక
ఖడ్గసృష్టిని  నాకానికి పరిచయంచేయ వెళ్ళిపోయావా, శ్రీశ్రీ!
తలయెత్తుకు వెళిపోయావా శ్రీశ్రీ!



Friday, April 22, 2016

భూమి చప్పుడు

(భూమి దినం కోసం గుండెచప్పుడు) కనిపించని చెట్లు ఆకాశ హర్మ్యాల వంక వేళ్ళూనుకుని కోపంగా చూస్తున్నాయి మరకుళాయిలను ఆపేసే ఆసక్తి శక్తిలేని ఇళ్ళు ఎండల్లో నీళ్ళు కొనుక్కుంటున్నాయి పచ్చని పైర్లు పల్లెలు నేలమట్టం కావాలని పట్నపు రంగువేషాలేసుకుని భూమినమ్ముకుని నిమ్మకుంటున్నాయి అప్పుడేనాటిన రాజకీయమొక్కలు ఖనిజమూలాలనీటితో బారసాల జరుపుకుంటున్నాయి రోజూ పౌష్టికపానంలేక నేలరాలి ఉసూరంటున్నాయి ఆకుపచ్చ మన రంగేకాదన్న పచ్చకామెర్ల ప్రపంచం పచ్చటి నేలకోసం స్వచ్చపు గాలికోసం సెలవుల్లో ప్రయాణాలు సిద్ధం చేసుకుంటొంది మామడి వేప కరివేపాకు మరువం ధవనం పుష్పాలు చలిమరగదుల్లో స్వేచ్ఛనుకోల్పోయి పెరడులో నేర్చుకున్న పాతపాటలు పాడుకుంటున్నాయి బట్టసంచీ చిట్టిచెట్టు మోటుబావి ఘాటుపచ్చడి రోలు రాయి చింత తొక్కు పసుపు వాకిలి మెంతి కూర తేనె పట్టు పుస్తకాల్లోచేరి అయోమయంగా చదివేవాళ్ళ వంక చూస్తూ నాలికపై వల్లెవేస్తున్నాయి వెర్రిజనాలకి వికృతి తరిగేదెలాగని ప్రకృతి పాతకాలందని పదేపదే మళ్ళీ చెబుతున్నాయి!

Monday, April 11, 2016

తోక - గాలి - పటం

||కందం||
వాలము పైబడి ఆశల
గాలము మదినిడి దారపు గాలుల చెంతన్
వాలము వంకర మాదిరి
మూలములను వీడి తిరగ మూర్చిల తోకన్
కానని జతగాయున్నది
తానని గానక, మానును తాకగ ఆగెన్,
ఆనక తెలిసిన తటపట
నేనను చప్పుడు వినమనె నాయెద, పటమున్!
-----------------
గాలిపటం-తోక
-----------------
ఎగిరేప్పటి ఆశలగాలం
వదలని దారపు శరాలు
తగిలే గాలుల సరాలు
తలవని దారుల తోడొస్తుంటే
అడుగుల వెనకన 
ఆడుతూ తిరిగి 
ఎపుడూ వదలని
అందెల వాలపు
గుండెల చప్పుడు,
వంకర చూపుల 
కనబడకుంటే
వాలిన చూపుల 
వాలపు కోరిక
వడిగా పట్టిన
ఊడల మానున
ఆపిన చోటన,
దారము దారిని వెతుక్కుపోతే
గాలీ కదిలి మరుజతకడితే   
గుండెల లోతున
పుటలను తాకిన 
సన్నని సవ్వడి
విడివడకున్న
వెనకొస్తున్న
ఆశల వాలపు
గుండెదా చప్పుడు
వదలని తోక
వెనకే కనుక
ఊగుతూ వదిలిన
మన్మథ బాణం  
తాకి తెలిపెను 
తోడని అప్పుడు
ఆగక కలిసెను 
ఊసులు గుప్పెడు!

ఒకే భావాన్ని రెండురకాలుగా రాసిన ప్రయత్నం - 
(Poem on kite and its tail realizing their feelings with sounds after getting stuck on a tree branch)


Sunday, April 10, 2016

మనిషీ! ఓ మనిషి!

నిరాశని దూరంగా నిలిపేసే ఆశ
ఆశని ఎగరేసే దారమంత ఆత్మవిశ్వాసం
ఆత్మను అమ్మకుండా నిలిపే నిబద్ధత
నిబద్ధతని అపనమ్మకంచేయని మొండిధైర్యం
మొండినీ ధైర్యంగా మార్చే నమ్మిన విలువలు
విలువల్ని అరువడగనవసరం నేర్పని చదువు
చదువుకునేందుకు
చెమలుగనేందుకు
పైవాడిచ్చిన పైనవవన్నీ
ప్రేరణనిచ్చే పైసలవన్నీ
బతుకని గడిపే
బతుకుని నడిపే
పూరణ కాలం
పూర్ణ గోళం
జతగలిపేందుకు
చెడతిరిగేందుకు
చమురులుగా చమరునవన్నీ
అమరికచేసే అమరములన్నీ!
నిరాశాపరుల్ని నీరసంగా నిలిపేస్తే
దారాన్ని దూరాలకు ఎగరేస్తూపోతే
నమ్మకాల అమ్మకాన్ని ఆపేయిస్తే
విలువల్ని వలువల్లా మార్చేయటం వదిలేస్తే
చదువుల్ని చలువల్లా ప్రేమగా మదినేస్తే
తరాలతీరం కనగలిగేట్టూ
తరతరాలదూరం మనగలిగేట్టూ
తెరలనుతీసే తొలివెలుగే
తమరిని బోలిన మనిషీ! ఓ మనిషి!
(My weekend poem written on Optimism and Positive Values - inspiration from K Balagopal's Democracy Dialogues Video)