Friday, September 8, 2017

నిలిచే నాలుగడుగులు

గాల్లో ఎగిరొచ్చే కాగితంలా
ఆశావహియై తరలుతున్న ప్రాణాన్ని
తీగతెంపి కళ్ళముందే తీసుకెళుతున్నారు!

దార్లో పలకరింపుల మొక్కల్లా
నిస్వార్థ సేవాదృక్పథులను
చదునుచేసి నల్లదారేస్తున్నారు!

అడవుల్లో అమాయకపు మూలికల్లా
అమాయకంగా పెరిగే ఆనందవనచరుల్ని
కుయ్యనని మందుల్లా కొనుగోలుజేస్తున్నారు!

ఎదిగి ఒదగాల్సిన పసిపూలతీగల్ని
ఎదలయ మీటక మునుపే అశక్తశరీరుల్నిజేసి
జీవితాంతం రక్తపుమరకల్ని పులిమేసుకుంటున్నారు!

పక్కనున్న ప్రతిరూపం
మన రూపంలాంటిదేనని

పూర్తిచెయ్యాల్సిన జీవితకాలం
తగ్గించ మనమెవ్వరని
హృదయంతో ప్రశ్నించలేని
బాష్పంతో వర్షించలేని
చదువుకున్న సమాజం ఎక్కడో
వందమార్కుల అక్రమమార్గంలో
మనికిపడని, మనిషితనమేలేని
మకిలిపడిన చదువుల్లో
ఎదుగుతూ ఒరుగుతూనేవుంది!

నేలంచుకు దగ్గరగా
నిలబడిన నాలుగడుగుల చోటే
నేనుచూసే నా ప్రపంచం అంటూ!