Saturday, December 9, 2017

శైశవరోదన

నీలో నాలో పసితనముందని
నవ్వే పిల్లల అమాయకత్వం!
నచ్చే పిల్లల నవ్వుల అర్థం!
నమ్మకమంటే నమ్మినవారై
నమ్మినమనిషితో నడిచేతత్వం!
అన్న నాన్న బావ మామ
అన్నీ కలిపిన ఒకటే అర్థం
తెలిసిన కలిసిన కుటుంబధైర్యం
తమదే తమదే అనుకునే తత్వం!
అటుగా తెలియని
ఎదగని మనసుల
ఎదిగిన వయసున
ఎదుగూ బొదుగూలేని శరీరం
చదువూ గిదువూలేని సమాజభారం
కసివేస్తుంటే
మసిచేస్తుంటే
మొగ్గల్లోనే తొలిచేస్తుంటే
పువ్వులగానక బలిచేస్తుంటే
క్రిమిసంహారం చేసేదెవరని
రసాయనానికై వెదికే సంఘం
చూసి చేసే పనియే లేదని
పలాయనమై నిదరోతుందా?
జనారణ్యమే మృగమౌతుందా?

దరిద్రమంతా తమదే కాదని
దరిద్రవీరుల దారికొదిలేసి
వీధికొకణ్ణి
సోదికొకణ్ణి
వార్తలివేయని చదువుకుపోతూ
ధూర్తసమాజమని ముడుచుకుపోతూ
సమూహక్షేమం వేడిని వదిలి
స్వార్థపుదుప్పటి కప్పుకుపోతూ
చలికాలాన్ని దాటేస్తూందా?

నవ్వులపూల తోటలకోసం
పువ్వులబాలల రక్షణకోసం
విలువలకంచెల ధరిత్రికోసం
ఒక్కోదారం కట్టేవారం
మేమూ మేమని తామే తాడై
శైశవరోదన ఆపిస్తుందా?
పట్టిన చీడని పీకేస్తుందా?
అమానుషత్వం అరికడుతుందా!
పూలనిపట్టి నిలబెడుతుందా!

(చంద్ర రెంటచింతల -డిసెంబరు/9/2017 - నిర్భయ పిల్లల వార్తలు చూస్తూ)