Saturday, March 25, 2017

గజేంద్రమోక్షం

1.
ఎవ్వనిచే నేర్చితి గతి
నెవ్వని గోరంగ నేను వెతలను దీర్చున్!
యెవ్వని పదముల మోక్షము
యవ్వాని బదంబులనిడి యర్థింతునిలన్!

2.
ఎందుకు లోపల దిగుటయు
నెందుకు వెలుపలికి జేరనెంతకు దరిలే
దెందుకు? కష్టములంతగ
నెందుకు? మోక్షము జేరమెందుకు సులువున్?

3.
ఎంతగ బుట్టిన వారలు
నంతకు ముందరను జేయునంతటి బనులే
చింతకు సుందరమోక్షపు
చెంతకు గారణము జూపుజెంతగ నుండిన్!

4.
సత్వము రజమును తమమను
తత్వము దెలిసినను కూటతత్వము దెలియు
స్వత్వము యెంతెత్తున్న న
ణుత్వము జీవితముయని గణుతి నింపునదే!

5.
చూడగ సరసీరుహములు
వాడెను కాలముల తోడి వాడనిదేదీ?
కాడిని వెదకని మనసున
గూడగు నేర్పే దెలియదు గూఢార్థమదే!

6.
యోజనమటునిటుగ నిలిచి
రాజసముగ నింగిదాకి రాతిరి వేళన్
తేజోమణిమయ రత్నవి
రాజితము త్రికూటనగము రాజిల్లునిలన్!

7.
పాలసంద్రంబున నెగసి
వాలముదిప్పెడి మృగముల వాసముగాగన్
కాలము నాపిన సరసీ
బాలల వదనంబులందు భాసితనగమే! 

8.
ఏమొన దాకెను నింగిని
నేమొన దాకంగయొచ్చె నేరుగ శశియే
నేమొన లోహపు మెరుపుల
దేమొన గనరాదు నింగిదేహము తడవన్!

9.
పత్రములెక్కిన పికములు
చిత్రముగా నీదగలవు చిక్కునబడకే
చిత్రముగాదిట సరసుల
బత్రములే జేర్చగలవు బక్కనయొడ్డున్!

10.
నాకము నిదియని గనుమను
రాకలజూడంగ జెట్లు రారమ్మనెనే
తాకిన సుగంధమబ్బెను
దాకగ వదలని తమసము తాళగనబ్బెన్!

11.
వనముల ఫలములు మాగిన
ఘనముగ రుచులే గలుగని ఘనతను దెలిసే
మనమును గలిగిన పికములు
యొనరగ దొలిచెడి మధురపు యొద్దిక గనుమా!

12.
రాలెను సుమములు సరసిని
రాలిన మధువులను గ్రోలరాలినవేమో?
మాలిమి సుమధుర సరసుల
వాలిన నీడలట గుసుమవారధులవవే!

13.
సుమముల మధువులు జేరెను
క్రమముగ ఫలముల మధురత గ్రతువై జేరెన్!
రమమగు మరందనిధులే
తమకపు సరసందు జేరి తనువుల జేరెన్!

14.
ఫలములు జీవనఫలములు
జలములు సంసారసుఖము జననమరణమే
కలిసెడి కాలము సరసున
వలదను వారేల నీదవచ్చిరి మధువై!

15.
తేనెలు పూదేనెలవగ
మానక భృంగములవోలె మావను జనులే
కానగ మకరందంబుల
కానలనైనను వెతికిరి కాదది ధర్మమ్!

16.
చేరిన మకరందంబులు
జారిన భూమిని గలిసెడి జాగున దెలిసే
మారని ధర్మంబెరుగని
భారము దెలియంగ కాలభావము దెలియున్!

17.
ఏమానందము జూసిన
నేమాయందము గనులను యేమది జూసే
మోముల నేమా నిజసిరి
లేమా!బదమను విహారులేలా గజముల్!

18.
ఉన్నది త్రికూటమందున
గున్నలు రవినిలను గప్పి గుడ్డిగజేసే
మిన్నగు జీకటి బగలే
గన్నుల జూపెడి వివియని గనుమలు గూసెన్!

19.
తొలిసడి రవిగని మురిసెడి
నిలకాంతంతయును నిలిచి నివ్వెరబోయే
తొలగని జీకటి జేరగ
వెలినొచ్చె నసితగజములు వెవ్వేలుగనన్!


20.
గిరిశిఖరంబుల జారు
ఝరులను బుక్కిటను బట్టి ఝర్ఝరి జేర్చున్!
తరమగ సింహముల పరుగు
తరమా జూచుటకునంచు తరువులు యనవే!

21.
వినుమా! కరులను గనుమా!
కనుమా! కనుమలను దిరుగ కలతను గనవే!
కన వేగచరుల గననే
గనమా! భయమే కరియనగ కరికరులవే! 

22.
వనచరములు వనమందున
ఘనతరమైయున్ననేమి ఘనమనుకొనెడిన్
వనరాజు గజేంద్రుడొక్కడు
జనబలమును జేర్చి దాను జలముల దిగెనే!

23.
వచ్చిరి సతులును సుతులును
మెచ్చిరి యాటలనుదేల మెప్పుగ దానే
చిచ్చరదొండము నింపి మ
రచ్చిక బుచ్చికములాడ రయ్యని విసిరెన్!

24.
విసిరిన జలములు మహినే
ముసరుచు దాకంగలేదు ముల్లోకములే 
బసలని వెడలేడి జోరుకి 
కొసలెటు నంచు నట నింగి గొమరున జూచెన్!  

25.
తాకిన నాకసమనెనే
మాకిట వానలను రాల్చు మారాజెవరే?
తాకగ పవనంబు గనము
వాకిట మేఘంబులేక వానలివేలా?

26.
కాలము గలిసిన చోటుల
వాలము నూపంగ నేల వాలదె పదముల్
చాలదు బలమెంతున్నను
కాలిడు చోటే వలదను కావరమున్నన్!

27.
ఎవ్వని వాడవు నీవని
గువ్వలు నడగంగబోవు గురుతేయెరిగిన్
సవ్వడి జేసిన జలముల
రివ్వున యొచ్చెను మకరి రిపుదమనునిగన్!

28.
వచ్చిన విడువను నేనని
మచ్చిక తానే దలవదు మకరేంద్రుడటే
జొచ్చిన తటమే నాదని
ముచ్చెమటల దడను జూప ముచ్చటబడెనే!

29.
పట్టిన బట్టును విడువడు
గట్టిగ బట్టెను బలిమిని గట్టడి జేసెన్
గట్టుకు జేరిన జాలని
బట్టుదలను నెట్టు గరి బట్టును మకరిన్

30.
చుట్టూ యున్నను దిగరే
జట్టుగ నాడినను వారు జడిసిరి జలము
న్బెట్టగ పాదములు జడిసె
మెట్టను యుండెడి మదములు మెల్లగ జారెన్!

31.
కరికి సిరులె భరమయ్యె మ
కరిని జలసిరులు బొగడ కరియొకరనిరే!
కరిదరికిని రావు కరులు
కరిగెడి తరుణము దొరకవు కరుణిడు కరముల్!

32.
వరమను భార్యలు బిడ్డలు
భరమను వేళను గనపడు భద్రము దానై
వరముల నిచ్చును గాచును
శరణాగతిజొచ్చునపుడు శమమునుయిచ్చున్!

33.
వరదుడు యెవ్వండనుచును
కరములుబట్టంగ దాను కష్టములున్నన్
వరమగు మార్గము దెలిసియు
శిరమున దలపడు హరియని శిథిలాత్ముడవన్!

34.
పిలిచిన నెవరిని బిలిచెద
దలిచిన యెవరిని దలిచెద దలపులనిండన్
వలిచిన దెలిసిన మెసలిన
చలితాత్ములు గలిసిరాని చరనిమిషములన్!

35.
ఎయ్యది నిలిచిన దొలగదు
తియ్యనివను నేవి దొలగి తిక్కయె గుదురున్
నెయ్యము యెవ్వరి తోడను
భయ్యము యేజోటలేదు భద్రంబేలన్!

36.
కలుగడు కనరాడంచును
కలుగున కాలము గడుపగ కనరాడనియున్
కలిగిన సుకృతంబునను
కలిగెను సరియైన దలపు కరివరదునిపై!

37.
ఎరిగిన లోకములేలిక
లెరిగిన లోకములయంచు లెరిగిన వారే
యొరిగిన జోటునకావల
కరగని దీపంబొకటని కరిమది వెలిగెన్!

38.
వెలిగెడి వాడే యొకడని
వెలుగును నింపెడి ఘనుడని వెతలను దీర్చే
వెలుగును మనమున నింపగ
వెలుకను జేయంగ వాని వెలుగుకు వేడెన్!

39.
మనమున వెలిగిన వెలుగున
ఘనముగ జూసెను నిలగతి ఘనతరముననే
యొనరగ పాదము కోరిన
కనరాదే భక్తిముక్తి కనులకు వెలుగై!

40.
పిలిచిన భక్తిగను బిలువ
తలచిన తడువను తరమని తరమగ యొచ్చున్!
కలచెడి కలతలను తొలచెడి
యలజడి దొలగించి మనసు యలసట దీర్చున్!

41.
కొలిచిన రాడను కోర్కెలు
కొలవగ నేరడు కరి మరి కొలిచెను దననే
కొలువున కోమలి యున్నను
కొలిచిన భక్తియె తిరమవు కొలదిని యొచ్చున్!!

42.
సిరి తానొచ్చిన నొచ్చును
కరిమొర వినగనె హరికిని కదలిక యొచ్చెన్
కరిగన కారుణ్యాక్షుడు
సిరినే విడిచియు యొచ్చెను సిరియన శరణే!

43.
వెదకడు శరముల వాడిని
వదలడు నెదపై వదలని వసనవిశేష్యం
బొదలగ నొదలరు భటులును
వదలక వెనకనె గదిలిరి వదులుట తరమే!

44.
అడిగిన నేమడుగుదునని
యడుగదు మగడిని యుడుగక యడుగుల నడుచున్!
యుడుగున దెవరని యుడుకుట
నడుగుట జడిమలకు బాడి  నడుగదె లక్ష్మిన్ !

45.
తెలిసిన మనసే తనదని
వెలిసిన రూపంబు దాను వెతగను వేల్పున్!
కలిసిన తోడగు హరికిని
తెలుపుట తెలియుటకు తెలివి తెలిసిన వారల్!

46.
అమ్మట నమ్మిక వారికి
నమ్మకమే యమ్మయన్న నరహరికచటన్
వమ్మును జేయదు యమ్మయు
నమ్మికగా వెంటవచ్చె నరహరి వెనకన్!

47.
కదిలినగన్నుల జేేపలు
వదిలిన మెరుపులిడు జూపు వన్నెల శరమే
పెదవిని వదలవు పికములు
మది భృంగమునకు మరందమధురత యమ్మే!

48.
కరిగోరెను దరిని గలియ
కరికాలి నొదలని మకరి  కరిదరి నుండన్!
కరికిని యరిగాదు మకరి
కరిజేరగ నిలిచినట్టి కరిదరి హరియే!

49.
హరిగన మకరము వెరవదు
హరిగను వరమును కరిగొని హరణము జేరెన్!
హరిగన హరమగు మకరము
భరమగు శిరమున వరమని భయము గనమే!

50.
వచ్చెడి వాడే హరియని
వచ్చిన చచ్చెదనని తెలిసి వరముగ వేచెన్
వచ్చుట నాపడు హరియే
నిచ్చెను మోక్షము మకరికి నిలవేలుపుగాన్!

51.
హరమగునని దెలిసినదను
వరమదియని వేచెనేమి వరదాభయుడే
వరముగ రాడా కరిగని
భరమగు మకరికి దెలుసును భక్తికి మార్గం!

52.
తిరిగెను సుదర్శనంబును
కరిగెను గంధర్వగర్వకరణము కరిగెన్
సరిగొనిన మకరిని యొదిగి
సరివాడొచ్చెను వరమని శరణాగతితోన్!

53.
కరుణను బతికిన కరియే
తరుణము వీడదు మనసున తమమే లేదే!
వరమని హరిపాదంబుల
సరసున కమలమును దీసి సమయమునిడెనే!

54.
తాకిన భార్యల బిడ్డల
దాకిన భవబంధములను దాకని తృప్తే
తాకగ యొచ్చెను హరియే
దాకగ నిభరాజు జన్మదాటెను హరితోన్ !

55.
భరమను బాధలు లేవు
వరముగ హరినామముండ వరదాభయుడే
పరిణతి నిలగతి జూపును
పరిశుద్ధాత్మకు దెలిసిన పరిధే మోక్షం!

56.
మునిగన డింద్రద్యుమ్నుడు
దనదై వెదికెడి వరమగు తలపుల నిండా
మునగగను గజేంద్రునిగా
జనుమను శాపమును బొంది జగమున మిగిలెన్!

57.
చేసిన పుణ్యంబు నిలిచి
చేసెను శుభములు దనకును చేయరె చేతల్
చేవగ నేవియు జేసిన
చేరెడు దారికి సమయము చేరును శాంతిన్!

58.
సురలే వేడిరియనుకొన
కరిమకరములే గనుమను కథలును గనుమా!
వరమది హరినే తలచుట
శరణాగతిజొచ్చువారి శక్తే హరియున్!

59.
కరుణను దొరికిన సుధయే
సురలకు వెతలగు కథలున సూక్ష్మత తెలిపెన్!
తరుణోపాయము హరియే
మరణపు తలుపుల నిలిచెడి మనుషులకిలలోన్!

60.
ఎవ్వని బుణ్యము వారికి
యవ్వనగర్వంబుదాటి యముడొచ్చుగతిన్
తవ్వగ తరుణోపాయము
నివ్వును మార్గంబుజూపి నిలకడమీదన్!

61.
సరసులు సంసారంబులు
వరసల నిభరాజు చెలులు వసితపు చరులే!
మెరయుచు మురిసిన మరవవు
మరలవు మకరంబులైన మదికష్టములే!

62.
రారే సతులును సుతులును
రారే రాజ్యమునవారు రాగలవారే?
మేరల బలిమను గర్వము
కోరగ దొరకునొక కొలువు కోతల నొదలన్!

63. 
కనబడునదేది మనసున
గనరాక వెలుగునదేది గనగను వెలితే
గనరానిదట్టిది వెదికి
గన వెలుగు మనసు వెతయనక గొలవదె నిలన్!

64. 
హరిగొను మనసే తిరమని
కరియే జెప్పేటి కథలు కమనీయంబే!
హరి కరిమకరుల నుండును
హరిపద కమలములనిడను హరి నీవాడున్!

65.
భగవంతుడు నాకేమని
భగవతికై కనులుమోడ్చి భగ్నతలేలా?
భగవంతుని కైమోడ్చిన
భగవతియే తరలెననుట భగవత్తత్వమ్!

66.
కరియే తమస్సు వర్ణము 
సిరియే క్షీరము గనుగొన, శితమను గతియే
హరియను తిరమగు మదిలో
నరముల సత్తువ కడుమను నరహరి గనరే!

67.
పవనము నెవ్వని శక్తియు
భువనము లెవ్వని చిటికెల బుద్ధిగ దిరుగున్!
శ్రవణము లెవ్వని సవ్వడి
కవనము లెవ్వని మధురత కమనీయ గతిన్!

68.
వదిలిన విడిపోదు సిరియు
కదిలిన కలిసొచ్చువారగన సేవకులే!
మెదిలిన నీరథమౌనని
వదలక యొచ్చేటివాడు వరఖగరాజున్!

69.
వదిలిన హరినే గననని
వదలక బట్టెను మకరము వలదను కరినే
వదలని జీవరహస్యం
బెదగను శరణాగతుడిని ఎరుకన గనగాన్!

70.
చాచిన వానికి ఆర్థము
దాచకనిచ్చెడి కర్మల దారట ధర్మమ్!
కాచెడినింద్రియ గతులను
గాచుటకే కామమండ్రు కారణజన్ముల్!

71.
నీతో వచ్చినదేదని
నీతో చచ్చునదియేది? నీవారలనన్
నీతో పయనంబునెవరు?
నీతోడనువాడొకండు నీతిని గనరే!

72.
హరిగన భక్తియుజాలును
హరియన తిరమగును జన్మ హరిణంబాపున్!
హరిహరి యనినను మనసే
హరితంబౌననిరి నరహరిగతి భక్తిన్!


Friday, March 24, 2017

జెన్

1.
Midnight
No waves, No wind
the empty boat
is flooded with moonlight

- Dogen
***

నడిరేయి
అల జడి లేదు
గాలి సడి లేదు
ఖాళీ నావ
శశిరేఖల మాళిగ
***
3.

Drink your tea slowly and reverently
as if it is the axis on which the world earth revolves
- slowly, evenly without rushing toward the future

Live the actual moment
only this moment is life

-Thich Nhat Hanh

***

తేనీరు తాకేప్పుడు
కుదురుగా నిష్ఠగా
అదే అఖిలజగము వదలక తిరిగే కక్ష్యలా
అదే వదలని కదలని తెలిసిన భవిత గతిలా

ఆ క్షణపు ప్రాణం నీవు
ఆ ప్రాణపు క్షణమే నీవు
****

Wednesday, March 22, 2017

బతుకు చదువు

పెరిగిన పల్లెటూరంటే
నావెంటే ఉండి
నాకన్నీ పరిచయం ఉన్నట్టు
నేను నయాపైసా అక్కరలేకుండా
నడిచి తిరిగే కలలప్రదేశంలా
అందరూ నావారే అన్నట్టు
భయంలేకుండా బతుకునేర్పిన
చెరువు పక్కన చెలిమల నీళ్ళు
బంకచెట్ల కింద దూరగలిగే గూళ్ళు
చేత్తో కుట్టుకున్న కాగితం పుస్తకాలు
చెట్టుబంకతో అతికించుకున్న తొడుగునగిషీలు
చేత్తో తిప్పని పొద్దుతిరుగుడు పూలు
కత్తితో చెక్కుకున్న పెన్సిలు ముక్కులు
పూడిక తీయని గుడివెనక బావి
ఏదో ఉందంటూ పరుగెత్తి తాకిన కొండపై రాయి
చదివితేనే వచ్చే ఎంతో ఙ్ఞానం
చదవకుండా చుట్టూ యిచ్చిన ప్రకృతిఙ్ఞానం

దూరంగా ఏదో ఉందని
తెలియని ప్రతీదీ
చదివిన ఏడువింతల్లా అందంగా వుంటుందని
పక్కన కూర్చున్న స్నేహితుడు పల్లెకబుర్లు చెబితే
తను వచ్చేది ప్రయాసపడే కుగ్రామమైనా
తెలియని ప్రతిదీ తెలుసుకోవాలనే చింత
బస్సెక్కితే అన్నీ చూసెయ్యొచ్చు అనే రోజుల్నుంచి
భాషికాలకై ఎయిర్ బస్సు ఎక్కేవరకు
అది ఎంత ప్రయాణమైనా చింతలో అంతే వింత!

వదలక వేచిన తపాల మనిషి సందేశాలు
ప్రతివాడికీ రాసేసిన పోస్టుకార్డులు
ప్రతిగా చేరిన ప్రదేశాల పుస్తకాలు
మెదడును కదిపి తెలియని ప్రపంచాన్ని
వదలని కళ్ళకు పరిచయం చేస్తే
వదిలిన కవరుపై స్టాంపుల్ని భద్రంచేస్తే
తెలిసిన కొత్తని కథల్ని చేసి
తెలియని అన్నాచెల్లితో పంచుకున్న
తేలిక ప్రపంచం -  తెలిసిన బాల్యం
బరువే ఎరగని, బడలికలేని
బతుకును చదివిన బాల్యమమూల్యం!
(మార్చి 22 2017)

Sunday, March 19, 2017

తెలిసిన రూపాలు

మనిషిని నిండా ముంచేసేంత దైన్యం
మనసునిండా మంచినింపేంత ధైర్యం

మట్టిలా పిసికేయబడుతున్న స్థైర్యం
గట్టిపడటానికి నీళ్ళను వదిలేస్తున్న మట్టితనం

కష్టం ఒక అనుభూతయితే
ఇష్టంగా నేస్తాన్నంటూ వెంటేపడితే
స్థైర్యానికి బీటలువారని కోటల్లో
స్వైరవిహారం చేస్తున్న సైన్యంలా
ధైర్యంగా గోడ వెనుక
జీవితకాలం యుద్ధం చేసే నువ్వు
అంతే కాలం వద్దనే చెరగని నవ్వువ్
నీలోని నువ్వని నీకు తెలిసేలోగా

నువ్వే నవ్వుని నీదికాదని వదిలేసేలోగా
నిన్ను నీకే పరిచయం చేసి
నిన్నను నీకే ప్రతిబింబమై చూపి
నీతో నడుస్తున్న నీ నీడ
ధైర్యం దైన్యం కలిసి నడిపే బతుకుఓడ
దారిచూపే పై చుక్కానివీ,
దాటగలిగే కింది నీటిచుక్కవీ
ఆధారమయ్యే చేతిలో తెడ్డువీ,
ఆశగా చేరాల్నుకునే ఒడ్డువీ
అన్నింటి మనసులో నీవే!
అన్ని మజిలీలూ నీవే!
అన్ని అనుభూతులూ నీవే!
అన్ని రూపాలూ నువు పోల్చుకునేవే!

(మార్చి 19, 2017)

Monday, March 13, 2017

తెగులు

తెలుగన తెగదిరిగి తడిమి
తెలియనిదని తెలుపు తెగులు తెలివనుకొనిరే!
తెలిసినదే తెలియదనుట
తిలలుగ తడిసే తడవను తిమ్మిరిసుమ్మీ!

Sunday, March 12, 2017

అడుగిడి

అడుగిడి జడియని బడినిట
డిగినఁ ముడులను మిడిమిడి నడకన ముడిచిన్
వడివడి బడిమరి తడఁబడ
డుగడు నడుగిడడు గడుమ నడిగిన  జడియున్!

Thursday, March 9, 2017

భాగీరథీసమానం


మన పుట్టుకలో వారి ఆనందం
మన ఎదుగుదలలో వారి ఆనందం
మన ముందే వెళిపోతుంటే
మనకు ఆగని దుఃఖం
మన సమయానికి మనమెళుతుంటే
ఇంకెవరికో ఆగని దుఃఖం
అంతా జరగాల్సినట్టే జరిగితే
అంతలో ఆనందం దుఃఖం ఆనందం!

ఎవరో మళ్ళీ పిలిచినట్టు
ఎవరో మనతోనే ఉంటున్నట్టు
ఎవరూ మనల్ని విడిచిపోనట్టు
అందరూ మనకు అన్నీ అయినట్టు
ఎవరూ మనకు ఏమీ  కానట్టు
కలిసి చేసే ప్రయాణాల్లో
కళ్ళు తెరుచుకుని చూసే కలలా
కళ్ళు మూసుకుని చూసే ఇలలా
కళ్ళకే తెలిసినా చేరే వలలా
కళ్ళు తడిమి చూసుకుని కలకాదనే
ప్రభాతప్రపంచం కదిలిపోతుంటే
కళ్ళల్లో సాంద్రతను వెదికే కన్నీరు!

విశాలవిశ్వంలో పుట్టుక అర్థం తెలుసుకోవాలని
స్వర్గంనుండి జారిన తీయని భాగీరథిలా
మార్గంగుండా మారిన రుచుల వేగపుగతిలా
నిసర్గంలోకి చేరిన లవణపు భారజలధిలా
మళ్ళల్లో సాంద్రతన మనికే ప్రాణపునీరు!
ఆనందం దుఃఖం ఆనందం అనుభూతులహోరు!
(రాధ మండువ, రాజశేఖర్  గారికి సవినయంగా)

Monday, March 6, 2017

మహిళ

అమ్మా! యనగా నేనని
చెమ్మను తన కళ్ళనుండి చెక్కిలి జార్చే
కమ్మని మృదుభావననే
సమ్మతమై బ్రహ్మజేసె సతులైనిలలోన్!

నినుగావగ బెంచు మనిషి
నినుగానగ యొచ్చు మనిషి నినుగని నడిచిన్
నినువదలక నిలుచు మనిషి
నినుజూపెడి బసిమనసుల నిచ్చెడు మనిషిన్!

అక్కా అమ్మా వదినని
చిక్కుల గాచెడి నడతను చిన్నదనంబున్
చక్కగ జెప్పిన జగతిని
యెక్కడ వదిలెను జాతి యెడ్డెమునెదగన్!

నవ్విన నాకేనందురు
రువ్వగ నవ్వులనుయొదిలి రుధిరముగనిరే
యెవ్వరు నాటిన పువ్వులి
వివ్వగ జచ్చెడివి యామ్లవిషచారికలే!

ఇంటను బయటను గెలిచిన
కంటను చూడవను మనసు గంతలుబోయెన్!
తంటయె యెక్కడయన్నను
కంటకమౌ యెదుగుదలయె కంపరమయ్యెన్!

ధైర్యము నివ్వగ నాన్నయు
శౌర్యము భ్రాతగ నడిచియు శౌరిగ గననౌ
దార్యము జూపను మామలు
క్రౌర్యము జూపంగనేల క్రౌంచపుజపముల్!

లకంఠి కంట నీటిని
వలలని జూచుటయునాపి వలదను మనసే
సలసల కాగగ నాపును
విలవిలలాడేటి గరళవిలయపు విగతుల్!

ఎవరో వచ్చెడి సమయము
వివరములే వెతకకుండ విధియనకుండన్
సవరలజుట్టున సర్పము
యవగతమై దేల్చుకొనరె యవనీమణులే!

వాణివి రుద్రాణివి భూ
రాణివి రాక్షసహరిణివి రాజ్యపుశౌర్య
శ్రేణివి యక్షౌహిణివై
బాణిని బట్టవె శరములు బాపము దునుమన్!

Sunday, March 5, 2017

మూగ స్నేహాలు

నువ్వూ నేనూ
ఎప్పుడూ కలవని రెండురూపాలు
వయసులు వేరు
మనసులు వేరు
పెరిగింది వేరు
ఎరిగింది లేదు
తిరిగిపోయే మార్గం తెలీదు

నువ్వూ నేనూ
ఇప్పుడే వదలనన్న చీకటి రాత్రిలో
పక్కపక్కనే రెండు కదలని పాన్పులపై
ఉన్న ఒకే కిటికీలోంచి
బయటపడుతున్న చిన్న వానచుక్కల్లో
స్వేచ్ఛను ఆనందాన్ని ఆరోగ్యాన్ని నెమరువేసుకుంటూ

నువ్వూ నేనూ
తప్పక వస్తానన్న సూర్యుని ప్రభాతంలో
పక్కపక్కనే ఎన్నో కదలికల మార్పులతో
ఉన్న ఒకే కిటికీలోంచి
మదినితడుతున్న సన్నని భానుకిరణాల్లో
స్నేహాన్ని ఆహ్లాదాన్ని ఆత్మీయతల్ని కలిపేసుకుంటూ

నువ్వూ నేనూ
ఈ రోజు ఇక్కడ కలిసిన మూగజీవాలే!

నువ్వూ నేను
మరో రోజు ఇక్కడే విడిపోయే కాకతాళీయస్నేహాలే!

నువ్వూ నేనూ
ఆ వానచుక్కా భానుకిరణాల్లా కలిసిన సప్తవర్ణచిత్రాలే!

(చంద్ర రెంటచింతల - మార్చి 5 2017)