Tuesday, July 25, 2017

నీటిప్రమిదలు

నిన్న చూసిన మందారపువ్వుని
మరునాడు దేవునికి సమర్పించాలని
ఆ రాత్రి అనుకున్న స్వార్థపువిషయం
చిమ్మచీకట్లో ఎలా తెలిసిందో ఏమో!

పొద్దున్నే చూస్తే వాడిపోతూ మొరాయించింది
నీరసంగా నిట్టూరుస్తూ చేతుల్లోవాలి తలవాల్చింది
తలెత్తమని బతిమాలిన నా హృదయం
అక్కడే వదిలేసి రావాలి అనిపించని మనస్సూ,
చేతుల్తో నిస్వార్థంగా దండంపెట్టుకుని
బతకమని అభ్యర్థిస్తూ నీటితో తడిపింది!

ఆకుకన్నులు చెమ్మగిల్లాయో ఏమో
ఆగని ధారల్లో తడిసి పునీతం అయ్యాయేమో
రవికిరణాలతో నీటిచుక్కల్ని వెలిగించుకుని 
ఆకుప్రమిదల్లో వెలుగునింపి
అసలు దైవత్వమిదని దగ్గరగా చూపాయి!

ఆ వెలుగును చూసిన మనస్సూ, చేతులూ
అవిటికలలు కనడం మానేసి
పొద్దున్నే చుట్టూ పూలను చూస్తూ
నవ్వులతో నందనవనపు పిల్లగాలికచేరీల్లో
తొలుత వెలిగించిన ప్రమిదలవరుసల్లో
ప్రతి ఉదయం దీపావళి చేసుకుంటున్నాయి!

మొన్న తలవాల్చిన మందారం
బలమైన నిస్వార్థపు భక్తికి మెచ్చిందేమో
నిన్న మరో పువ్వురూపంలో దర్శనమిచ్చి
నీ వరం నన్ను చూడటమే అంది!
నీలోనే వెదకాల్సిన వాడికోసం 
నేనే తలవాల్చాలా అని ప్రశ్నించింది!

సృష్టిలో అందం ఆనందం
విడిచిన మందారం పక్కన
నీటిప్రమిదలా తోచింది!
చూసేమనసుకే కనబడే ఆనందరూపం
నే చల్లిన నీటిచుక్కల్లో వెలుగల్లే
మనసుదివ్వెని వెలిగించింది !

(చంద్ర రెంటచింతల - జులై 26, 2017)

Wednesday, July 12, 2017

సరిహద్దులు

ఆకాశం నిర్మలంగా ఉంది
గాలి ముంగిలిమకిలిని సరిహద్దుల్లోనే తుడిచేసినట్టు!

దూరంగా కాపాడే  హద్దులేవీ కనబడటంలేదు
మనమే చేసుకున్న హర్మ్యాల అగడ్తలు ఆపేసినట్టు!

గాల్లో విమానం వేగంగా వెడుతూనేవుంది
దార్లో ఎగిరొచ్చేపక్షి తాకుతుందేమోననే భయం వదిలితే ఒట్టు!

ఎక్కడో సైనికులపహారా చలికొండల్లో తరగని పట్టుదలతోవుంది
ఇక్కడవేవీ పట్టని మాదకద్రవ్యాల అగ్గిలో జనం చలికాచుకుంటున్నట్టు!

గాల్లో శవాలు తనవాడనుకునేవాడి రక్షణకై లేస్తున్నాయి
పట్టణాలహేలల్లో తన గాడి యిదనే శిక్షణలేని ప్రాణాలు బుడగలైపోతున్నట్టు!

అందరినీ వదిలిన కొన్ని నిస్వార్థజీవాల్లో కర్తవ్యయోగం గమనంగా చూపెడుతోంది
ఎవ్వరినీ వదలననే ఎన్నో స్వార్థజీవాల బతుకంచున సరిహద్దే ఇదన్నట్టు!

(చంద్ర రెంటచింతల జులై 22 2017)

Sunday, July 9, 2017

ప్రేమోన్మాదం

ఇంకెన్నాళ్ళు
ఇంతికన్నీళ్ళు?

ప్రేమనే ఉన్మాదంలో
ప్రేమన్న మనిషే పోతే
ప్రేమించినదెవర్నో తెలియని
ఆమ్లజనిత అమానుషహృదయాలను
క్షారమయమైన కర్కశస్వప్నాలను
చెయ్యెత్తి కాల్చేసే సమూహమే నీవై
చెయ్యంటక కడిగేసెయ్ సమాజమా నీవే!

అందానికి అణకువ ఉందంటే
బంధానికి బదులే లేదంటే
అంతమయ్యే రోజులనాపి
అసమ్మతం తమ హక్కంటూ
అర్భకము తమకేలంటూ
అంతంచేసే గులాబిరూపం
అంతికలను వెలిగించేసి
అగ్నిహోత్రమై సర్పయాగాలు చేస్తూ
అంతటా కాల్చే కణికలుగా కనబడదేమి?
మంటల్లో పడిపోకుండా మంటపెట్టదదేమి ?

ఉన్మాదం ఉరితాడంటు
తమస్సుకు సరిజోడంటు
సరినేర్పే సమయపు పాఠం
సిరిమూలపు సహాయభావం
సమయమిదను సంస్కారాలు
సరి వయసులొ నేర్వకపోతే
కరుణెరుగని విషపు నాగులై
బుసకొట్టి చంపిన పడతుల
ఆత్మలన్నీ ఘొషిస్తాయా?
అంతుచూడ గర్జిస్తాయా?

అందరిలో తమనే చూస్తూ
అంతపు దారుల మూయండంటూ
సుంతైనా మారండంటూ
గుండెనిండి రోదిస్తాయా?
గండికొట్టి ముంచేస్తాయా?
అతివబలం చూపిస్తాయా?
అతివగళం వినిపిస్తాయా?
అగ్నిగోళమై చుట్టేస్తాయా?

(చంద్ర రెంటచింతల - 09 జులై 2017)