Sunday, January 29, 2017

వేటూరికి నీరాజనం

పాటలకవు లేపాటని
గాటను గట్టంగజూడు గావరజగతిన్
తేటతెలుగాటమాటల
బాటన వేటూరియొచ్చి బాసట నిలిచెన్!

భావపుదారిని దాగు ము
భావపు మనసుగరిగించు భావకుని గనన్!
చేవగు భాషనుబట్టుకు
తేవగనొచ్చి పదయోగి తేనెలనిచ్చెన్!

రాముని బంటే తానై
గోముగ సీతమ్మ చెంత గోధూళనుచున్
పాముకు బోయిన వర్ణము
జామున దొలగించినారు జానపదంబున్!

భక్తిని రాసిన వారలు
రక్తిని రాసిరి కలమున, రక్తము మరగన్
శక్తిని జూపిరి మహిళకు
యుక్తినెరిగి రాయగలరు యుద్ధము మదిలోన్!

వందలపాటలు యందున
చిందుల జీవులకు రాసె చింతలనొదిలిన్!
సందడి మధ్యన పదముల
నందము విడవకనురాయ నందము గాదే!

ఇందువదన కుందరదన
మందగమన మధురవచన మంతయు దానే
నాదవినోదపు నాట్యము
వేదపు యణువణువు నాదవేదన తనదేన్!

శంకర నాదశరీరా
యంకపు జేయే యడిగిన యంతనె రాసెన్
వంకల బోయే చెలి గొర
వంకకు ప్రేమదెలుప తనవంతుగ లేఖల్!

Saturday, January 28, 2017

ధర్మయోగిని

నిన్నటివరకు
చలిలో వణుకుతూ
ధైర్యం తొణుకుచూ,
వానకు తడుస్తూ
ఆ నీటిలో దాహం తీర్చుకుంటూ,
ఎండకు ఎండుతూ
కిరణాలతో హరితచామరాల చేసుకుంటూ,
నిన్ను నీవుగా
ధీరోదాత్తగా
ధర్మపు కర్తగా
మోక్షవిహితగా
పరిచయం చేసుకున్న
గులాబీ మొగ్గా!
ఈ రోజు సూర్యుణ్ణిచూస్తూ
రెక్కల్ని విచ్చుకుని
గాలికి పరిమళాల్ని అద్ది
బాలికలా నవ్వుతూ
నేస్తంవా కనబడితే
ఇంటికి తీసుకెళ్ళి
పెంచుకోవాలని
చిట్టితల్లంది!
నువ్వొస్తే
నాలుగురోజుల చుట్టానివంటున్నా
నిను పిలిచే ధైర్యం చేయలేనంటున్నా
పసిమనసు వదలక పిలిస్తే
పెద్దమనసుతో చక్కగా వచ్చి
పాపకు నేస్తమయ్యావు!
దేవుడికి పుష్షమయ్యావు!
నాకు అక్షరమయ్యావు!
నీ స్నేహంతో మాలో ఒకటయ్యావు!
మా స్నేహంలో దైవత్వంనింపి దేవతవయ్యావు!
మోక్షసంప్రాప్తి తెలిసిన సత్యయోగము నీదే!

Friday, January 13, 2017

మకర సంక్రాంతి

తెలిసిన తెలుగను సంస్కృతి
తెలిసీ తెలపక నడిచిన తెలవారగనే
తొలిజామున కీలలనే
కలిపి ప్రజల కలుపుగోలు కనమనె భోగిన్!

బాగుగ చలియని వణికిన
పోగుగ మంటేసి జనులు పోగవరె నిలన్!
భోగపు బసవన్నొచ్చెడి
భోగిని రేగులనుబోయు భోగము మనదే!

వచ్చెడి హరిదాసుగనము
నెచ్చెలి హరిదాసుకెద్దు నెమ్మిక గనమే
ముచ్చెమటల పరుగులిడను
వచ్చెడి ముంగిలిన మంచి వలదన గలమే!

వచ్చెను పంటలు నింటను
మెచ్చెను ప్రకృతీపురుషుని మెచ్చెను జగతిన్
నచ్చిన వారికి బట్టలు
వచ్చిన ధాన్యమును బంచ వచ్చెను బుణ్యమ్!

పశువే తలనే యూపిన
శిశువే మరినవ్వునంట శితమన నదియేన్
పశువేయని జూడగనము
శిశువుకు తిండివ్వమనుచు శివుడే బంపెన్!

గుడిలో దేవునికిచ్చుట
నడగని పూజారికివ్వ నడతని నేర్పెన్
నడచిన నలుగురి గలియుట
గడచిన రోజులను మెచ్చు గమనము నిధియే!

మకరపు సంక్రమణంబని
చకచక బనులింట జేసి చక్రములాపిన్
పకపకనవ్వుల దినియెడి
సంకటి రైతుల భిక్షనుచు సంక్రాంతొచ్చెన్!

వనభోజనంబు లంచును
జనమును రుచులను గలిపెను జఠరము నిలిపెన్
కనుమనె దానము ధర్మము
కనుమని కలయగనుయొచ్చి కనుల దెరువనెన్!

Sunday, January 8, 2017

చిట్టి తల్లి

చిట్టి తల్లి
========
పొట్టిబట్టలు
కట్టిరంటూ
నట్టనడిమిని
జట్టులంటూ
కట్టుబడియని
కొట్టుకుంటూ
పట్టుకున్న
చట్టుచేతుల
పట్టడానికి
గట్టిగొకరిని
పుట్టించలేని
తొట్టిజనమున
చిట్టి తల్లే
పుట్టి ఏడ్చిందా?

గుట్టలల్లో
పుట్టలల్లో
చెట్టుతొర్రన
మట్టి పాముల
మట్టుబెట్టక
ముట్టిరంటూ
ఒట్టులంటూ
కొట్టమంటూ
గిట్టమంటూ
చట్టమట్టుకు
చుట్టిరమ్మను
మెట్ట సంఘం
నెట్టుకొచ్చి
బట్టలీడ్చి
చిట్టి తల్లిని
రట్టు చేసిందా?

చిట్టి తల్లే
గట్టి నేనని
పుట్టలన్నీ
కొట్టబట్టే
గుట్టు నేర్చి
చట్టుబండల
సొట్టనోళ్ళను
కట్టగట్టి
చుట్టబెట్టి
మట్టి తలల
జుట్టు కోసిందా?
పుట్టుకెదికిందా?

పట్టు ఎదనిండా
పట్టి ఎదిగిందా!
 (బెంగళూరు అకృత్యాలపై

రక్షణ

కష్టము వచ్చిన యొచ్చును
నష్టము గుచ్చినను దిరిగి నగుమోమొచ్చున్
దృష్టిని గదపక కదిలిన
సృష్టిని సమగూరు పనులు సృజనది దేవా!

శిక్షణ లేవను శిలలే
రక్షరక్షయన మాధవుండు రమతో రాడే
లక్షణతిడి రూపమవ్వగ
రక్షణగొన జను వరమిదనెడి

Sunday, January 1, 2017

సీమ

కురవని వానల జూడని
నరవరు లందందరున్న నరకము సీమన్
కురవగ వానలు తమవని
నరహరులే కోతలిడరె నమ్మికనదియే!

గలగలబారెడి నదులను
విలవిలలాడంగజేసి విద్యనుగొనగన్
బిలబిల నేగిన బాదుల
కలతను కలరవమునంప కలలే దీరున్!

అడవులు తడవకు గొట్టిరి
కడకును ఖనిజమనిగొట్టి కనుమలజేయన్
జడయుట నెరుగని మేఘము
వెడలెను తన తల్లిసీమ, వెతలే వహ్నిన్!

రాయల వారేలిరిచట
పోయగ కనకంబుగుట్ట పోలిక యిదటన్!
బాయగ తిరుమల దేవుడు
సాయము రాడేల సీమ సాగుకు నిపుడున్!

నేతల మగ్గములాగెను
కోతల కొడవళ్ళునాగె కోతలు నాగెన్
చేతగు చుట్టపు జూపున
చూతము వానలనింక చూకురు యెదలన్!

మేనే తడియకయున్నను
తానే మరి యొరిగిపోదు తాపసి సీమన్!
వానే వదలక కురిసిన
చేనై తావబ్బునంట చేవగు ధరణిన్!

రంకెల లేపాక్షి దుముకు
నంకెల వెంకన్నహుండి నందుట జరుగున్
సంకెలబట్టిన తుంగయు
సుంకేసుల జేరురోజు సుంకులు దొలగున్!

శిఖరపు శ్రీశైలమునను
నఖలను సప్తగిరులుగల నాకంబదియేన్!
ముఖమున మంత్రాలయమును
శిఖముల జలజామణులకు సుమములు లేవే!

పొందెడి అనవరతజలము
నందిన పొందేటి సీమనంతట పొందన్
వందల యేళ్ళే వేచిరి
కొందరు మరి పూనుకొన్న కొండలు కరుగున్!