Sunday, February 28, 2016

ఫల విలాపం

నేనొక పళ్ళబుట్టకడ నిల్చి చివాలున సిగ్గువిడిచి బేర
మానెడు నంతలోన పళ్ళన్నియు జాలిగ తొనలు దించి "మా
మానము కొలుతువా" యనుచు బావురు మన్నవి; కృంగిపోతిని; నా
మానసమందెదో కళుకు మన్నది ఫలవిలాప భావ్యమై.

ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కనిపెంచిన మానుతరులనొదిలి జా
లీయనని బుగ్గచేర్తుము; విధియోగ కరణమ్ముల స్వంతమై  
గాయము లోడుచున్ మంచి చేతుము; ఆయువు దీరినంతనే
హాయిగ మళ్ళి చేరెదము విత్తుల చల్లని భూమితల్లి ఒడిన్

బాలల శక్తిచేతుము ఆరోగ్యముగ చేసి; సమాశ్రయించు క్షుథ్వీ  
రులకు విందు చేసెదము కమ్మని రుచులతోన్; మిము బోంట్ల జి
హ్వాలకు తీపిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల కుంచబుద్ధితో
తాళుము, కొలవ బోకుము; తల్లికి బిడ్డకు వెలలుసేతువే!

గీర బేరాలతో రైతు కురి బిగించి
గుండెలో నుండి కత్తులు గ్రుచ్చి, తీసి
మలచు కొందురు ముక్కల శూలమున మమ్ము
అకటా! ఎంత దయలేని వారు ఈ మోటువారు

మా చవులూరు నిస్వార్థ సుకుమార సుగంధ మరంద మాధురీ
స్వచ్చర్మముల్ మందుల జోడించి, కృశించి నశించిపోయె; మీ
పచనములందు కొల్లగొని ఆపై సంచులనిండ నింపి మ
ముచేతుల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

అశోక రాజుని భూమిలో పుట్టినావు
సహజ మగు వనప్రేమ నీలోన చచ్చెనేమి?
ఆరోగ్యమును హత్య చేసెడి హంతకుండ!
కుంచించెనోయీ! నీ మనసు జన్మ!      

Saturday, February 27, 2016

సభా స్మృతి

కొందరికి మనుస్మృతో
కొందరి మనసు మృతో
ఓ దుర్గమ ధృతో
ఓ దుర్గాకృతో
అవని గళమో
అది అనిర్గళమో
ఘాటున గొంతెత్తి
పోటున ముంచెత్తి
మాటలనెంచి పట్టి
మాటునెంచక నిలిచేట్టి
వనితగా అడుగు ముందెట్టి
విడుపులనాపక పదునెట్టి
విడవని అరుపుల పక్కనపెట్టి
వదలని అర్భకుల పడగొట్టి
బోధిబోధన సోది పట్టని
రాహులుమాయాల నొడిసిపట్టి
న్యాయపు గౌరవం
చదువరుల ధర్మం
వంతల సామాజికన్యాయం
వాతల సమన్యాయం
వాసాల దేశ దైన్యం
అక్కునపట్టి
మనసుబెట్టి
మనసులబట్టి
బాణము నెక్కుపెట్టి
బాధ్యత లెంపల కొట్టి
ఒకటొకటి ఏకేట్టి
గట్టి కొలికిని ఎక్కుపెట్టి
ఒక గంట నిలబెట్టి
చిట్టీలు పక్కనబెట్టి
మాట్లాడ గలిగేట్టి
సభ్యుల కనిబెట్టి
కళ్ళబట్టి
ఏళ్ళైనట్టి
ఓ స్వామ్యధరిత్రీ
సభా సౌమిత్రీ !    
నీపై ఎక్కుపెట్టులు
నీవెక్కు మెట్టులు
నీవే కనిపెట్టితివిపో
ఓటులు నోటులు కాదు
ఘాటుల మాటలు
వినిన చోటులు
చూచిన ఆటుపోటుల
ఒక గంట
ఉపశమనమాయెనా నీకున్!

Sunday, February 21, 2016

తెలుగు నాది

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా తెలుగుకోసం తెలుగువారికోసం .. 

తెలుగు అనాది
తెలుగు పునాది
తెలుగు నీది
తెలుగు నాది
తెలుగు వినేది
తెలుగు అనేది 
తెలుగు మనది!

తెలియకుంటే 
తెలియదంటే 
పదోగది దాటాక కనబడనిదా తెలుగు?
పరుగు విక్రమార్కుల ఒడివడనిదా తెలుగు?
పట్టణ వలసవాక్కుల్లో మరుగయినదా తెలుగు?
పలుకు ఆంగ్లపు ప్రయోక్త లాస్యాల్లోనిదా తెలుగు?
పెళుకు వాక్కుల సినీ హాస్యాల్లోనిదా తెలుగు ?
పతిపత్నుల ప్రకోపాల భాష్యాల్లోనిదా తెలుగు? 
వ్యాపార ముసుగుల లోపాల్లోనిదా తెలుగు ?
అంతరించే భాషల ఆరాటానికా తెలుగు!

తెలుసుకుంటే 
తెలుపుతుంటే 
అమ్మ మాటలా తెలుగు
అష్టాచెమ్మాటలా తెలుగు
బూడిద గుమ్మట్లో తెలుగు
పూడిక పెరట్లో తెలుగు 
ఉగాది పచ్చట్లో తెలుగు 
జనాల ముచ్చట్లో తెలుగు  
పురిటి నొప్పిళ్ళలో తెలుగు
పండుగ గొబ్బిళ్ళలో తెలుగు
ప్రథమ పూజలప్పుడూ తెలుగు
పుడకలోపోయేప్పుడూ తెలుగు 
ప్రాచీన భాషగా వెలుగులలో తెలుగు
పసుపు ముంగిళ్ళ పదును ఆరోగ్యంలో తెలుగు
పండు గోరింటాకు పసిచేతుల్లో తెలుగు 
పదును ముత్తైదువల పసుపువాయినాల్లో తెలుగు
పచ్చమండపాల పెళ్ళిపేరంటాల్లో తెలుగు 
శతక పద్యాల నీతి మేళవింపుల్లో తెలుగు
శతమానపు దీవెనల తీపి తలపుల్లో తెలుగు  
పదముల పాడించు కృతిగతుల్లో తెలుగు 
పాదముల నాడించు నృత్యరీతుల్లో తెలుగు 
శాస్త్రముల శాసించు శిల్పగీతల్లో తెలుగు

మనసు పెడితే  
మనసు తడితే   
మనసు పడితే   
మనసు తడితో 
చదువుల పాలించు బుడతల రాతల్లో తెలుగు
యంత్రాలు లాలించు చిరులాలి పాటల్లో తెలుగు
వింతలు సాధించు చిరుతల మాటల్లో తెలుగు
ఈ జగాన తెలుగు
నీతోనే వెలుగు వెలుగు 
అందుకై నీ వంతు 
పాదములు కదుపు కదుపు
పదములు కలుపు కలుపు!     

ముందు తరాలకు
తెలుగు వదిలేది
మనం మనం!

ఎవరో మరేవరో 
ఇది మనం కాదని  
అనం అనం! 

ముందు తరాలకు
తెలుగు తెలిపేది
మన మనం
మనం మనం!

Saturday, February 20, 2016

నేర్పే ప్రకృతి


సుమాల తీగన్నా, శిశిరాన మోడన్నా
తనలో వగచేనా,  వసంతాన మల్లెలై విరిసేనా!

ఈదురు గాలన్నా, ఎదురున బండున్నా
తరలి దుమికేనా, తెగువన ఎగసేనా!

మసకల మబ్బన్నా, మండే ఎండున్నా,
నీళ్ళు నమిలేనా, చినుకై తడిపేనా!

విరిసే పూవన్నా, రాలే దండన్నా,
ఒకరిపై మెరిసైనా, నేలలో కలిసేనా!

ఇంచుక పక్షన్నా, ఎదుటన కొండున్నా,
చుట్టూ దాటైనా, బతికేదారులు వెతికేనా!

నీటిలో చేపైనా, చేరనిది ఒడ్డన్నా,
బతుకే ఆపేనా, ఈదక వదిలేనా!

ఒంటరి మనసన్నా, వదలని గోడున్నా,
ప్రకృతి చూసైనా, నమ్మిక కలిగేనా!

వడి సడి ఆగేలా, కదలక ఓడేనా!
గడి, తడి తొలగేలా, వదలక పోరాడేనా!
వెతలపై నడిచైనా, కతలై మెరిసేనా!

Wednesday, February 17, 2016

అట్టు

బొట్టులా వేసిన వెన్న పూరేకులాం
టట్టులా, అమ్మచేతిలో ఆడిన గరిటంచున
పట్టులా, పెసరమినపల మదిలో
జట్టులా బాగున్నావే అట్టూ, ఇది నీ కనికట్టు!

పట్టుల్లా వేసిపెట్టిన సన్నటికాగిత
పట్టుల్లా, బండినెత్తిన కాలివచ్చిన పిండి కార
పట్టుల్లా, కూరదట్టిన కిరీట     
పట్టుల్లా, గురుతు తెచ్చెనే పదముల చిలకావిరట్టు!          

Tuesday, February 16, 2016

అంధగీత

కళ్ళుంటే చదివామా
చెవులారైనా విన్నామా
కులపు గొప్పల్లా
కలుపు మొక్కల్లా
కరడు గుండెల్లా
ఖద్దరు కండల్లా
కరగని బండల్లా 
దేశాల్నే దోచేస్తూ
దేశాన్నే ధూషిస్తూ
ఆదేశాల్నే తోసేస్తూ
తిరుగుతున్న మనుషులంతా
తెగులద్దిన మనసులంతా 
తరుగుతున్న అంతరాల్ని
తెగువచూపి పెంచేస్తూ
విలువలన్నీ  దూరం చేస్తూ
మరి చుట్టూ ఎడారి చేస్తూ
వీధుల్లో విద్యాలయాల్లో
అరుస్తూ చరిస్తూంటే!

అవేవీ చేరని
అంధ బధిరాలయాల్లో,
మనుషుల్నే తయారుచేసే
నిజ దేవాలయాల్లో,
మంచితనం బతికిస్తుంటే
మమకారాలు చూపిస్తుంటే
బతికే మార్గాలు తోడొస్తుంటే
కళ్ళుంటే కనబడడని 
కుళ్ళంటూ కనబడలేదని 
అంధకారం ఎందుకదేలని
చదువులమ్మ చదువుకుంటే
గీతనంతా చెబుతూంటే
మతాల జాడ్యం
భూతద్దాల మాధ్యమం
బుద్ధిగా బుడతలుగా మారి
గుచ్చుకున్న బాణాల్ని తీస్తూ
నొచ్చుకున్న జనాల్ని చూస్తూ
గుండెలపై మరకల ఆనల్ని తుడుస్తూ
గర్వంగా తలకెత్తుకోవాలనింది
గొప్పగా చెప్పుకోవాలనుంది
కళ్ళుంటే తనకు ఇవ్వాలనింది!

Reaction after reading about a a blind girl learning geeta, reciting flawlessly and saying she cannot see god anyways.

Saturday, February 13, 2016

ఆకర్షణ

ప్రపంచమంతా మరి మోగిందా ప్రధానమైన ఆకర్షణంతా! హిగ్గ్స్ బోసనూ ఐనుస్టీనూ ఒక్కొక్కటిగా విడుతూ పోతే విశ్వమంతా ఒకటే అనిందా! వేదాలంతా చెప్పినదంతా ఒకటే శబ్దపుసడి మొదలంతా! శబ్దపు అలలలో సమస్తమంతా సున్నాల బరువుల సమస్యలంత కాంతివేగాన మన ఆయుష్షెంత? మరిమరి తెలిసి మనసొదిగుండనిదే వింత! ఎంతోవుంటే చుట్టూరంతా మనమీచోట ఉండేదెంత! ఉన్నవి కొన్నీ విలువలనిన్నీ చిలువలు పలువలు చేయకు అవిన్నీ! ఆనందంగానైనా కొన్ని మధురంగా మార్చి మరిన్నీ పంచెయ్ తరాలకు, నువు మరి ఎన్ని!

Wednesday, February 10, 2016

వార్తల చెలిమి

ఎవరిపై ఏ మాల
ఎందుకీ కులాల గోల
ఎగిరే మంటల లీల
ఎరుపేనా జీవన హేల
ఏదీ తడిమే ప్రసారమీవేళ

ఎవరు చస్తే
ఎవరు బతికితే
ఏమరుపాటే ఎరుకలో లేక
ఈ కథే జీవనం అంటూ
కోరలేని సమాజం వింటూ
రుమాలు వేసి
సమాలు చూసి
గుమ్మాలకేసి
చూపు పడేసి
ఓదార్పనేసి
ప్రతిఙ్ఞలోసి
ప్రతిదీ కాసి
పరాకు చేసే
ఖరారు బాబుల
షరా రుబాబుల
పనులే మొత్తం
ప్రపంచమంతా
ప్రతిధ్వనిస్తే
ప్రతిదీ చూస్తే,
మనుషులమంటే
మృగాల గోల
మనసుల్లేవని
మరీ అదోలా
మరుగున చూస్తే
మతలబులేని
మది కడిగేస్తే

ఏమరుపాటును
ఎటో వాటంగా
పల్లెల బాల్యపు
పదునును తీసి
ప్రతిదీ చూసి
మనసెనకేసి
మరీ అదోలా
సడులే లేని
అలజడులే చేరని
బతుకుల తీస్తే

అగ్గిరేగని కమ్మరి కొలిమి
ఏదీ కదలని కిరాణా కొట్టు
చదునైపోయిన వరి మాగాణి
దూరపుకొండల ఆగిన గుండె
ఎదురుచూపుల బస్సుల ఊళ్ళు
అదిమేచేతుల ముసలి చలిబట్ట
ఏదీ చేరని అడవి బలిగుట్ట
వాగులుదాటిన చదువరి పట్టు
వదలక ఎక్కే కాలిమెట్టెల మెట్టు
బదులేకోరని అనాథ బిడ్డ
చలిలో చచ్చే కర్మ జవానులు
చితులలో చేతి చేనేతకారుల ఆనులు
కనులునిండిన జలాలకు ఒడ్డా!
బతుకులనిండా కథలకు అడ్డా!

కదలనియ్యవా మనసులనదిమి
కలిసి చేయవా వార్తల చెలిమి!
కమిలి పేర్చవా చెడునకు కొలిమి
కలిసి మార్చవా గుండెల బలిమి
కనులచేర్చవా మనుషుల కలిమి!

Sunday, February 7, 2016

మనవరాలి తెలుగు

మన వరాల తెలుగు
తరతరాల తెలుగు
చమత్కారాల తెలుగు
జాతీయ నుడికారాల తెలుగు
అలంకారాల తెలుగు
ప్రాసానుప్రాసల తెలుగు
విభక్తిభక్తులతో తెలుగు
పాండిత్యప్రభక్తులతో తెలుగు
ఛందోమాలల్లో తెలుగు
తేట గీతుల్లో తెలుగు
ద్విపద పాదాల్లో తెలుగు
స్వతంత్ర గీతుల్లో తెలుగు
సశేష రీతుల్లో తెలుగు
సొత్తు జానపదాల్లో తెలుగు
పొత్తు అనువాదాల్లో తెలుగు
స్తుతి మాలికల్లో తెలుగు
శృతి డోలికల్లో తెలుగు
వేగాలవడిలో తెలుగు
చరణసవ్వడిలో తెలుగు
పోరాట గేయాల్లో తెలుగు
ఆరాట లాలుల్లో తెలుగు
నాటక దారుల్లో తెలుగు
సరస భావనతో తెలుగు
సరళ భావుకతతో తెలుగు
హృదయరాగాలాతో తెలుగు
జీవనగీతాలతో తెలుగు
అలంకారంలా తెలుగు
కంఠహారంలా తెలుగు
మన గారాల తెలుగు
మమకారాల తెలుగు
కలిసిపోవుటగా తెలుగు
కలుపుగోలుగా తెలుగు
కలిసే మనవరాలి తెలుగు
కలిపే తరతరాలు తెలుగు
ఇది మన వరాళి తెలుగు!